ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల (సవరణ) బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడాన్ని మానవ హక్కుల వేదిక (HRF) ఖండిస్తోంది. ఈ బిల్ కార్మికుల హక్కుల మీద, వారి ఆత్మగౌరవం మీద దాడిగా మేము భావిస్తున్నాము. ఈ బిల్ ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.

పరిశ్రమల చట్టం, 1948 ని సవరిస్తూ ప్రభుత్వం ఈ బిల్ ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది. దీనిని ‘సంస్కరణ’గా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది కానీ, వాస్తవానికి ఇదొక హేయకరమైన వెనకడుగు. పని దినాన్ని పది గంటలకు పెంచడం అంటే దోపిడీకి మార్గం సుగుమం చేయడం. మానవీయ, సుస్ధిర పని విధానాలని పోరాడి సాధించుకున్న కార్మిక ఉద్యమాలని చులకన | చేయడమే. ఈ హక్కులకి ఒక ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా కార్మిక వర్గం, ప్రగతిశీల శక్తులు తర తరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు. కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ప్రభుత్వం ఇప్పుడు అటువంటి హక్కులని తిరగదోడే ప్రయత్నం చేస్తున్నది.

ఆధునిక కార్మిక హక్కులకి ఎనిమిది గంటల పని దినం అనే హక్కు ఆయువుపట్టు లాంటిది. ఇదేదో పెట్టుబడిదారీ వ్యవస్థ పెద్ద మనసుతో చేసిన దానం కాదు. ఇది కార్మికోద్యమం దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కు. ఎనిమిది గంటల పని దినాన్ని వ్యవస్థీకృతం చేయడంలో బి ఆర్ అంబేద్కర్ కీలక పాత్ర వహించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఎనిమిది గంటల పని దినానికి అనేక విధాలుగా ఆయనే ఆద్యుడు. 1940లలో ఎనిమిది గంటల పని దినం కోసం అంబేద్కర్ చేసిన అవిరళమైన కృషి, కార్మిక వర్గ ఉద్యమాల ఫలితంగా ఈ ఎనిమిది గంటల పని దినం చట్టంగా, హక్కుగా స్థిరీకరించబడింది. ఇప్పుడు దీన్ని తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఈజ్/స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని ప్రభుత్వం ఊదరగొట్టే విధానం కార్మిక హక్కులని కాలరాచి పెట్టుబడికి లాభం చేకూర్చడానికే తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ‘పెట్టుబడిని ఆకర్షించటం’ అనే విధానం కార్మిక హక్కులని నీరుగార్చడం, నియంత్రణ సంస్థల అధికారాలని బలహీనపరచడం, ఉద్యోగాలని కాంట్రాక్ట్ పరం చేయడం లాంటి వాటికి పెట్టుకున్న పేరు. గరిష్ట పని గంటలని పెంచడం అంటే దోపిడీని చట్టబద్దం చేయడం, వ్యవస్థీకరించడం. ఇది పని నుండి విశ్రాంతి తీసుకునే హక్కుని, కార్మికుల వ్యక్తిగత సమయాన్ని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఈ సవరణ బిల్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది.

ఈ తిరోగమన సవరణని వ్యతిరేకించమని ప్రజాస్వామిక శక్తులని మానవ హక్కుల వేదిక కోరుతున్నది.

వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
వి. ఎస్. కృష్ణ (HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

10.06.2025,
విశాఖపట్టణం.

Related Posts

Scroll to Top