క్వార్ట్‌జ్‌ తవ్వకాల కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలస, గొట్టివలస, ఉద్దవోలు గ్రామాల  దగ్గరలో క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ కోసం కేటాయించిన అనుమతులన్నిటినీ తక్షణమే రద్దు చెయ్యాలని మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌ జరిగితే వందల మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా, నీటి వనరులు, వ్యవసాయం, పాడి ధ్వంసం అవుతాయి. గత పది సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది.

నలుగురు సభ్యుల మానవహక్కుల వేదిక బృందం 7 మార్చి 2022న ఈ గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడింది. జనావాసాలకి అతి సమీపంలో జరుగుతున్న అడ్డూఅదుపు లేని మైనింగ్‌ కారణంగా జరిగిన విధ్వంసం మమ్మల్ని దిగ్భ్రాంతపరిచింది. జనావాసాలకి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి మైనింగ్‌ జరగకూడదని సివిల్‌ అప్పీల్‌ నెం. 1907-1914/2000 కేసులో సుప్రీంకోర్టు 12 డిసెంబర్‌ 2003న తీర్పునిచ్చింది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం మైనింగ్‌ సైట్‌ సరిహద్దు నుండి జనావాసాలకి, విద్యాలయాలకి, ప్రార్ధనా మందిరాలకి కనీసం ఐదు వందల మీటర్ల దూరం ఉండాలి. అయితే ఈ క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ ప్రాంతానికి దళాయివలస గ్రామానికీ మధ్య దూరం కేవలం 180 మీటర్లు వుంది. ఇది సుప్రీంకోర్ట తీర్పుకీ, కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకీ రెండింటికీ విరుద్ధమే. ఇంత బహిరంగంగా ఇటువంటి క్రిమినల్‌ కార్యక్రమాలు జరగడం అంటే మైనింగ్‌, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కుమ్మక్కు అవ్వడమే దీనికి కారణం.

దళాయివలస గ్రామం పక్కన ఉన్న కొంకమాని అనే పెద్ద చెరువుని నింపే అనేక ఏరులు మైనింగ్‌ జరుగుతున్న గుట్ట నుండే ఉద్భవిస్తాయి. మైనింగ్‌ కారణంగా కొన్ని వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువులోకి వచ్చే నీటి ప్రవాహం సహజంగానే తగ్గిపోయింది. ఆగస్ట్‌-డిసెంబర్‌ నెలల మధ్య ఈ గుట్ట దళాయివలస, శివరామపురం, ఉల్లిభద్ర, ఉద్దవోలు గ్రామాలకి చెందిన పశువుల మేతకి ముఖ్య ఆధారం. వాటికి ఇప్పుడు గ్రాసం లభించని పరిస్థితి ఏర్పడింది.

క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ చేసే పద్ధతి కారణంగా స్థానిక ప్రజలు పేలుళ్ళకి, తద్వారా వచ్చే దుమ్ము-ధూళికి బాధితులు అవుతున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది, నీటి వనరులని కలుషితం చేస్తున్నది, వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నది. ‘మైనింగ్‌ జరిగేటప్పుడు మేము ఇంటి నుండి కాలు బయటపెట్టలేము’ అని ఉద్దవోలు, దళాయివలస గ్రామస్తులే  కాక గరుగుబిల్లి – పార్వతీపురం రహదారి మీద ఉన్న గొల్లవానివలస గ్రామస్తులు కూడా చెప్పారు. గాలి పీల్చడం ద్వారా, క్వార్ట్‌జ్‌ కలుషిత నీరు తాగటం ద్వారా, ఇతర మార్గాల ద్వారా క్వార్ట్‌జ్‌ శరీరంలోకి ప్రవేశిస్తే అది క్యాన్సర్‌కి, ఇతర ప్రాణాంతక వ్యాధులకి కారణం అవుతుందనీ అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

ప్రస్తుతం దళాయివలస, గొట్టివలస, ఉద్దవోలు గ్రామాలలో మూడు క్వార్ట్‌జ్‌ గనులకి లీజులు ఉన్నాయి. వాటికి పర్యావరణ అనుమతి కోసం 9 మార్చి 2022 న ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఈ మూడు గనుల సామర్థ్యం సాలీనా 7,01,984 మెట్రిక్‌ టన్నులు. సాలీనా 6,000 టన్నుల మైనింగు జరుగుతున్న దళాయివలసలో ఇంతటి విధ్వంసం కళ్ళకు కనబడుతుంటే ఇక లక్షల టన్నుల మైనింగ్‌ ఎంత సృష్టించగలదో ఊహించడమే కష్టంగా ఉంది.

ఈ క్రిమినల్‌ చర్యలకి అడ్డుకట్ట వెయ్యడం అధికారుల రాజ్యాంగ బాధ్యత. ఈ ప్రాంతంలో మైనింగ్‌ కోసం జరుగుతున్న ప్రయత్నాలకి తక్షణమే అడ్డుకట్ట వేసి, లీజులు రద్దు చెయ్యాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తున్నది. నియమాలు పాటించకుండా, ఇప్పటివరకు జరిగిన చట్టవిరుద్ధ మైనింగ్‌కి ఎవరెవరు సహకరించారో విచారణ చేపట్టి బాధ్యులైన వారిని తగిన విధంగా శిక్షించాలని మా వేదిక డిమాండ్ చేస్తుంది.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
8 మార్చి 2022

Related Posts

Scroll to Top