గని విస్తరణ పేరిట జలాశయం పూడ్చివేత  

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీటి వనరు మళ్లింపు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల సరిహద్దులో వట్టివాగు జలాశయాన్ని 1998 లో రూ.120 కోట్లతో పూర్తి చేశారు. 2 టీఎంసీల సామర్థ్యంతో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కాని శిథిల కాలువలు, దెబ్బతిన్న తూములు, అడుగడుగునా లీకేజీల కారణంగా 2 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. రైతులే ఏటా కాలువల్లో పూడిక తీసుకుంటూ పంటలను తడుపుకొంటున్నారు. ప్రాజెక్టును ఆనుకునే 1,217 హెక్టార్లలో కైరిగూర ఉపరితల(ఓపెన్ కాస్ట్) గని ఉంది. ప్రస్తుతం ఈ గనిని మరో 450 హెక్టార్ల మేర విస్తరిస్తున్నారు. ఇందుకోసం తిర్యాణి మండలం చెలిమెల ప్రాజెక్టు మత్తడితో పాటు మార్గమధ్యంలోని అనేక వాగులను కలుపుకొని వచ్చే నదిని మళ్లిస్తున్నారు. ఇందుకు రూ.8 కోట్లు కేటాయించారు. జలాశయానికి ప్రధాన నీటి వనరు అయిన ఈ నదిని 2006 లోనే ఒకసారి మళ్లించారు. తాజాగా మరోసారి మళ్లింపు పనులు చేపట్టారు.

నీటిపారుదల అధికారులు 20 హెక్టార్లలో పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చామని అంటున్నా, దాదాపు 60 హెక్టార్ల స్థలంలో మట్టి వేసే పనులు సాగుతున్నాయి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే జలాశయంలో మట్టి వేసి చదును చేస్తున్నారు. గని పక్కనే ఉన్న కొండల నుంచి తెచ్చిన మట్టితో భారీ యంత్రాల సాయంతో పూడ్చివేస్తున్నారు. జలాశయం చుట్టూ భారీగా బొగ్గు వ్యర్థాలను డంప్ చేయడంతో ఇప్పటికే అది చాలావరకు నిండిపోయింది. ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ దామోదరన్ ను వివరణ కోరగా నది మళ్లింపునకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. జలాశయంలో 20 హెక్టార్ల మేర పూడ్చివేసినందుకు మరోచోట సింగరేణి సంస్థ 20 హెక్టార్ల వరకు స్థలం ఇవ్వనుందని పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందరును సంప్రదించగా గని విస్తరణలో భాగంగా వట్టివాగు జలాశయం నీరు రాకుండా కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం 20 హెక్టార్లలోనే పనులు చేస్తున్నామన్నారు.

మానవ హక్కుల వేదిక
తెలంగాణ
6 జూన్ 2023

Related Posts

Scroll to Top