మహ్మద్ హుస్సేన్ ను వెంటనే విడుదల చేయాలి

రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం.

జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న మహమ్మద్ హుస్సేన్ ను ఈ రోజు తెల్లవారుజామున ఆరు గంటలకు పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి, అరెస్టు నోటీసు లేకుండా, బంధువులకు ఏ విషయమూ తెలియజేయకుండా జీపులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. మఫ్టీలో వచ్చిన వాళ్ళు పోలీసులమని చెప్పటం తప్ప, తాము ఎక్కడ నుండి వచ్చాము, ఎందుకు తీసుకెళ్తున్నాము వంటి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం లేదు. బందువులు, తెలిసిన వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తే కరీంనగర్ పోలీసులనీ, బెల్లంపల్లి పోలీసులనీ అనధికారిక సమాచారం తప్ప అధికారిక సమాచారం ఏదీ లేదు.

మహ్మద్ హుస్సేన్ గత పదిహేనేళ్లుగా సాధారణ, చట్టబద్ధ జీవనం సాగిస్తున్న సీనియర్ సిటిజన్. ఒక పాత పరిచయస్తునికి కోర్టులో స్యూరిటీ పడ్డాడనే ఏకైక కారణంతో, చట్టాలను గౌరవించాల్సిన పోలీసులే ఈ విధంగా అక్రమ పద్ధతుల్లో చట్ట విరుద్ధంగా పట్టుకెళ్లటం పౌరుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించటమే అవుతుంది. పోలీసులు ఇప్పటికైనా మహమ్మద్ హుస్సేన్ ను ఏదైనా విచారణకై తీసుకెళ్ళి ఉంటే, ఆ విషయం ప్రకటించి, వెంటనే విడుదల చేయాలి.

ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు వెంటనే కల్పించుకొని పోలీసుల దౌర్జన్యాన్నీ, చట్ట బాహ్యతనూ ఆపించి, మహమ్మద్ హుస్సేన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకోకపోతే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా పోలీసుల చట్ట బాహ్యతను సమర్ధిస్తున్నట్టుగా భావించవలసి వస్తుంది.

ఎస్. జీవన్ కుమార్
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు

డాక్టర్ ఎస్. తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

08.07.2024
జమ్మికుంట

Related Posts

Scroll to Top