మాకొద్దు బాబో విషవ్యర్థాల చెత్త

పరిశ్రమలకు అనుమతులివ్వడంలో మన ప్రభుత్వాలకున్న ఉత్సాహం వాటివల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడంలో  వుండదు. దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోవాలంటే పర్యావరణ, అటవీ తదితర శాఖలన్నీ పరిశ్రమలకు అనుకూలంగా రబ్బర్ స్టాంపులుగా మారి, కాలుష్య నియంత్రణ మండలి చూసీ చూడనట్లుగా పోవాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. పరిశ్రమల నుండి, ముఖ్యంగా పురుగు మందులు లేక రసాయన పరిశ్రమలు నుండి వెలువడే ప్రమాదకరమైన వ్యర్ధాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ వ్యర్ధాలు ఎక్కడ నిల్వ చేయాలో లేక ఎక్కడ పారబోయలో తెలియని పరిస్థితి వచ్చింది. ఈ వ్యర్ధాలకు మూలాలు ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, ఆసుపత్రులు, జంతువుల కబేళాలు మొదలైనవి.

ఈ మధ్యే నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి వెలువడే ఇటువంటి వ్యర్ధాలను భూమిలో పూడ్చడానికి RAAMKI అనే సంస్థ నల్లగొండ జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి అనే గ్రామములో భూమి సేకరించి, ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యడానికి తలపెట్టింది. ఈ విషయమై ప్రాంతీయ దినపత్రికలలో ప్రకటన వెలువడింది. ప్రకటన వెలువడిన వెంటనే ప్రభావిత గ్రామాల ప్రజలు స్పందించి, ముఖ్యంగా కక్కిరేణి గ్రామ యువకులు మానవ హక్కుల వేదికని సంప్రదించడం  జరిగింది. వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లి మహిళలు, విద్యార్ధులు, యువకులు మరియు పెద్దవారితో భవిష్యత్తులో దీనివలన జరగబోయే  నష్టాల గురించి చర్చించి RAAMKI ప్రయత్నాన్ని ఆదిలోనే ఆపాలని నిర్ణయించటం జరిగింది. ఎక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలు అక్కడే శుద్ధి  చెయ్యాలి కాని యితర జిల్లాల నుండి తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చటం ఏమిటి? అసలు చెత్త రాకుండా చూసుకోవాలి కాని మన ఇంట్లో వూడ్చిన చెత్త వేరే వాళ్ళ ఇంట్లో వేస్తే ఊరుకుంటారా? మొదట  ఇటువంటి పరిశ్రమ తలపెట్టే ముందు పాటించవలసిన నియమనిబంధనల గురించి మాట్లాడుకున్నాము. ఏ పరిశ్రమ నెలకొల్పాలన్నా  30 రోజుల ముందే ప్రాంతీయ భాషలో పర్యావరణ ప్రభావిత అంచనా రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని  తెలియచేసి అవి పాటించారా లేదా  అనే విషయం ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయానికి  వెళ్లి నిర్ధారించుకోవాలి అని చెప్పటము జరిగింది. గ్రామాల యువకులు, ముఖ్యంగా కక్కిరేణి గ్రామ యువకులు ముందు వుండి, ఈ విషయాలు చాల బాగా సేకరించటము జరిగింది.

అయితే నియమనిబంధనలు ఏ ఒక్క ప్రభావిత గ్రామలలో కూడా పాటించలేదని, ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా ఈ ప్రయత్నం చేస్తున్నదనే విషయాన్ని, ఇది ప్రధాన ఉల్లంఘనగా ప్రజల దృష్టికి తేవటం జరిగింది. గ్రామ ప్రజలను  చైతన్య  పరచటంలో భాగంగా స్త్రీలు, అంగన్వాడి కార్యకర్తలు, సంఘబంధం సభ్యులు, విద్యార్ధులు పాల్గొనటం జరిగింది. మానవ హక్కుల వేదిక తరపున కరపత్రాలు అచ్చు వేసి ప్రభావిత గ్రామాలలో విస్తృతంగా పంచటం జరిగింది. ఇందులో కూడా కక్కిరేణి యువకులు  ప్రధానపాత్ర వహించారు. అంతేగాక స్థానిక  సర్పంచులను, ప్రజా ప్రతినిధులను కలిసి వారికి కూడా RAAMKI చేపట్టబోతున్న dumpyard వలన జరుగు నష్టాల గురుంచి, ముఖ్యంగా నీటి, వాతావరణ కాలుష్యం, వ్యర్ధాలు వివిధ జిల్లాల నుండి ఇక్కడకు చేరవేసేటప్పుడు వ్యర్ధాల వాసన, వ్యర్ధాలు దారి వెంట పడుట లేక కారుట, వాటిని చేరవేసే వాహనాల వలన జరిగే ప్రమాదాల గురుంచి చర్చించటం జరిగింది. ఈ విషయాలను ర్యాలిల ద్వారా, సభల ద్వారా ప్రచారము చేయటం జరిగింది. RAAMKI చెపుతున్న ఉద్యోగాల కల్పన అనేది ఎండమావి లాంటిదని ఈ సందర్భంగా చెప్పటం జరిగింది. ఇదే విషయమై నార్కటపల్లిలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కక్కిరేణి గ్రామస్థులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు సింహాద్రి గారితో, శాస్త్రవేత్త శ్రీ కలాపాల బాబురావు గారితో మరియు ఈ క్షేత్రములో అనుభవజ్ఞులైన వారితో కూడా మాట్లాడించడం జరిగింది. తరువాత ఈ గ్రామాల యువకులు ప్రజాప్రతినిధులతో వ్రాత పూర్వకంగా సంబందిత అధికారులకు నిరసన లేఖలను పంపారు. మరుసటి రోజు అన్ని ప్రజా సంఘాలను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను రౌండ్ టేబుల్ ద్వారా సమావేశ పరచి, ఇక్కడ తలపెట్టబోయే dumpyard ను అనుమతించకూడదు అని ఏకగ్రీవంగా తిర్మానము చేసి వ్రాత పూర్వకంగా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు ఇవ్వటం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, బయటివారు రాకుండా గ్రామానికి వెళ్ళే అన్ని దారులను మూసివేయాలని కూడా నిర్ణయించటం జరిగింది.  వెంటనే ఈ నియోజకవర్గం  MLA గారు స్పందించి జిల్లా మంత్రిగారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ రాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పటం జరిగింది. పత్రికలు కూడా ఈ ఉద్యమం గురుంచి మరియు నిరసనల గురుంచి రోజు వ్రాయటం జరిగింది. ప్రజా నిరసన వెల్లువ చూసిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరగవలసిన ముందు రోజు సంబంధిత అధికారులు ‘అనివార్య కారణాల వల్ల ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేస్తున్నాము’ అని పత్రికల ద్వారా ప్రకటించారు. గ్రామ ప్రజలు తదుపరి చేపట్టవలసిన చర్యల గురుంచి మానవ హక్కుల వేదికను అడిగినప్పుడు ‘వాయిదా వేయటం కాదు, ఇక్కడ పెట్టటంలేదు అనే నిర్ణయాన్ని ప్రకటించేవరకు మనము అప్రమత్తంగా వుండి నిరసనలు తెలుపుతూ ఉండాలని , ఈ ప్రాజెక్టే కాదు ప్రజలకు నష్టం కలిగించే ఏ వినాశకరమైన ప్రాజెక్ట్ నైనా భవిష్యత్తులో పెట్టకుండా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండాలి’ అని చెప్పటము జరిగింది.

ఇది ప్రజల ఘన విజయంగా భావించాలి. ఈ విజయం చుట్టుప్రక్కల వున్న మండలాలపై ప్రభావితం చూపాయి. ఈ మధ్యే గట్టు ఉప్పల్ లో ఒక bulk drugs ఫార్మా పరిశ్రమకై తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో  ప్రజలు ఇదే రీతిలో స్పందించి జరగకుండా ఆపగలిగారు. 12 జులై 2017 న చౌటుప్పల్ మండలము, ధోతిగూడెంలో ఒక ఫార్మా పరిశ్రమ విస్తరణకై తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు  ఇదే రీతిలో  స్పందించి ఒక్క విన్నపము కూడా విస్తరణకు అనుకూలంగా రాకుండా చేయగలిగారు. నల్లగొండ జిల్లాలో ఫార్మా ప్రధాన కేంద్రమైన చౌటుప్పల్ మండలములో వినాశకరమైన ప్రాజెక్ట్ లకు ఎంత వ్యతిరేకత వచ్చిందో దీనిని బట్టి అర్ధం అవుతున్నది.

జిల్లాలో వేలకొద్ది పరిశ్రమలు ఉన్నప్పటికీ కాలుష్య నియంత్రణ మండలిలో మాత్రం వున్నది ఇద్దరు ఉద్యోగులే. దీనిని బట్టి కాలుష్య నియంత్రణ మీద పాలకులకు ఎంత చిత్తశుద్ది వున్నదో మనకు అర్ధం అవుతున్నది. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట, దామెరచెర్ల, చౌటుప్పల్ మండలాల పారిశ్రామిక వాడలు సందర్శించినప్పుడు ప్రజలు కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. అక్కడ రోజురోజుకూ పెరుగుతున్న  నిరసనలు చూస్తే వారు  కాలుష్య కోరల్లో ఎంతగా చిక్కుకున్తున్నారో  తెలియచేస్తున్నది.  దామెరచెర్ల గ్రామములో ప్రజల నిరసనతో మూసివేసిన ‘Deccan Chromites’  వదిలి వెళ్ళిన ప్రమాదకరమైన వ్యర్ధాల కుప్ప ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. దాదాపు ౩౦ అడుగుల ఎత్తు వున్నఈ కుప్ప 5 ఎకారాలలో విస్తరించి వుంది. ఈ నాటికీ దానినుండి  జాలువారే నీరు వలన చుట్టుప్రక్కల పశుపక్షాదులు లేకుండా పోయాయి. మనుషులు కూడా దాని దరిదాపుల్లోకి వెళ్ళటానికి జంకుతారు. ఈ నీరు అంతా ప్రక్కనే వున్న కృష్ణా నదిలో చేరుతున్నది. ఈ వ్యర్ధాల కుప్ప అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల నిర్లిప్తతకు నిదర్శనం. ఈ విషయమై మానవ హక్కుల వేదిక NGT (National Green Tribunal – జాతీయ హరిత న్యాయస్థానం) కి వెళ్ళాలని ఆలోచిస్తున్నది.  సూర్యాపేట పారిశ్రామిక వాడలో ఇటువంటి  ఒక ఫార్మ పరిశ్రమ, తమ వ్యర్ధాలను  బోర్ బావిలోకి వదలటం వలన చుట్టుప్రక్కల వ్యవసాయ బోర్ బావుల్లో రంగు నీళ్ళు రావటం మొదలయింది. దానిపై  విశ్లేషణ జరపగా  ప్రక్కన వున్న పరిశ్రమే అందుకు  కారణమని తేలాక వారిపై చర్యలు తీసుకోవటం జరిగింది.  

ఇలా మన దృష్టికి రానివి ఇంకా  ఎన్ని వున్నాయో! జిల్లాలో ఇద్దరు ఉద్యోగులతో కాలుష్య నియంత్రణ సాధ్యమా? ఈ మధ్యే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన రిపోర్ట్ చూసినా, పత్రికల వాళ్ళు వ్రాసిన కాలుష్య సంఘటనలు చూసినా ప్రజలు రోజురోజుకు కాలుష్య కోరల్లో ఎంతగా  చిక్కుకుంటున్నారో అర్ధం అవుతున్నది. విషవ్యర్ధాలను విడుదల చేస్తున్న ఇటువంటి పరిశ్రమలు ముందు నీటివనరులను నాశనం చేసి ఆ తరువాత corporate social responsibility  పేరుతో గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తే సరిపోతుందా? పిడికెడు ఉద్యోగాల ఎర చూపి ముందుకు వస్తున్నఇటువంటి  పరిశ్రమలను అనుమతించేటప్పుడు జాగారూకతతో మెలగాలని ప్రజలకు మనవి.

మానవ హక్కుల వేదిక
12.07.2017

Related Posts

Scroll to Top