విప్లవ కవి వరవరరావు కి తక్షణమే వైద్య సేవలు అందించాలి

ప్రముఖ విప్లవ కవి, రచయత పి. వరవరరావుకి తక్షణం వైద్య నిపుణుల సహకారంతో చికత్స చేయించి తగిన వైద్య సహాయం అందజేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.అర.ఎఫ్.) సంబంధిత అధికార్లను కోరుతోంది.  80వ వడిలో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.  సుమారు రెండు సంవత్సరాలుగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వరవరరావు ప్రస్తుతం నవీ ముంబైలోని  తలోజా సెంట్రల్ జైలులో ఉన్నారు.

గుండె జబ్బు, ప్రోస్త్రేట్ ఎన్లార్జ్మెంట్, వెర్టిగో, పైల్స్, బి.పి. వంటి అనేక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.  ప్రస్తుతం ఆయన శరీరంలోని పొటాషియం, సోడియం లెవెల్స్ పడిపోయి తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో ఇటీవల ఫోన్ ద్వారా జరిపిన సంభాషణలో ఆయన మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. ఎటువంటి కాలయాపన చేయకుండా ఆయనను వెంటనే జైలు నుండి ఒక స్పెషలైజడ్ హాస్పిటల్ కి తరలించాలి.  అలా చేయకపోతే ఆయన జీవితానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది.    

కోవిడ్-19 పరిస్థితులు, వరవరరావు గారి అనారోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగచేసుకొని  ఆందోళనకరంగా ఉన్న ఆయన ఆరోగ్య స్థితి మరింత క్షీణించకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.  వరవరరావు కోలుకునే వరకు ఆయన కుటుంబ సభ్యులను ఆయన వద్దనే ఉండేందుకు అనుమతించమని కూడా అధికార్లను కోరుతున్నాం. 

మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
13 జూలై 2020 

Related Posts

Scroll to Top