ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులను నిలువరించాలి

గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో దళితుల మీద అత్యాచారాలు, భౌతిక దాడులు జరుగుతున్న తీరు దళితుల్లో భయాందోళన, అభద్రతా భావాన్ని నింపాయి. జరిగిన సంఘటనలు, వాటి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పోలీసులు ఎటువైపు? చట్టం వైపా, ఆధిపత్యం వైపా అనేది కూడా చర్చనీయాంశం అయింది.

చట్టాలు ఉన్నది బలవంతుల నుండి బలహీనులను కాపాడటానికి. దీనికి విరుద్ధంగా నేడు చట్టాలను చేసేవారూ, వాటిని అమలు చేసే అధికారిక వ్యవస్థలూ అధికారంలో ఉన్న పార్టీలకు రక్షకులుగా మారాయి. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలు నీరుగారి పోతున్నాయి. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఒక్కొక్కటిగా వివరంగా చర్చించుకుందాం.

1. సీతానగరం పోలీసులు వరప్రసాద్‌ విషయంలో వ్యవహరించిన తీరు చూస్తే మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఇసుక వ్యవహారంలో వరప్రసాద్‌ అనే దళిత యువకుడికి కృష్ణమూర్తి అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. కృష్ణమూర్తి కారు డోరును వరప్రసాద్‌ బలంగా వేశాడని వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే, పోలీసులు వరప్రసాద్‌ని తీసుకెళ్ళి విపరీతంగా కొట్టి మంగలితో గుండు గీయించారు. ఇదంతా ఎస్‌.ఐ. స్వయంగా దగ్గరుండి చేయించాడు. నేరమే చేయని వ్యక్తిని, ఏ చట్టం ప్రకారం గుండు గీయించడం చేశారో ఆ ఎస్‌.ఐ. గారికే తెలియాలి. అధికార పార్టీ వాళ్ళు చెబితే చట్టంతో సంబంధం లేకుండా ఏమైనా చేసే స్థాయికి పోలీసులు ‘ఎదిగారు.’

2. చిత్తూరు జిల్లా బి కొత్తకోటకు చెందిన జూనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ గారికీ, ఆ వూరి రెడ్లకు గొడవ జరిగింది. జడ్జి రామకృష్ణ గారికి కొన్ని దెబ్బలు తగిలాయి. ఆయన పోలీసు స్టేషన్లో రెడ్ల మీద కేసు పెట్టాడు. వారు రాజీ చేసుకుంటామంటే ఎఫ్‌.ఐ.ఆర్‌ చేయలేదని డి.ఎస్‌.పి. గారు పత్రికలకు తెలిపారు. అంటే కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద మంత్రి పెద్దిరెద్ది రామచంద్రారెడ్డి జడ్జిని వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడటాన్ని ఏమనాలి?

3. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు వైద్యుడు సుధాకర్‌ తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో పి.పి.ఇ కిట్లు, ఎన్‌95 మాస్కులు లేవనీ, వాటిని ఇవ్వాలనీ మీడియా ద్వారా కోరినందుకు ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇందులో సుధాకర్‌ చేసిన నేరం ఏమిటో ఎవరికీ తెలియదు. సుధాకర్‌ చేసిన పని ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా వుంటే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంతేగానీ అతన్ని నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి ఈడ్చుకుంటూ పొమ్మని ఏ చట్టం చెబుతోంది? అంతేకాకుండా అతని మానసిక స్థితి బాగా లేదని మెంటల్‌ ఆసుపత్రికి తరలిస్తే చివరికతను కోర్టు నుండి రక్షణ పొందాడు.

4. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అనితారాణి దళిత కులానికి చెందింది. జూన్‌ నెలలో కొంతమంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆసుపత్రిలో రోగులను సరిగ్గా చూడటం లేదని ఆమె మీద దాడి చేశారు. రోగులను సరిగ్గా చూడకపోతే ఆమెపై ఫిర్యాదు చేయవచ్చు. కానీ దాడి చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం దళిత కులానికి చెందడమే ఆమె తప్పు. తన మీద జరిగిన దాడి విషయంలో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది. ఇదేం పాలన ? చివరికి ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

5. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన ఓబన్న, రత్నకుమారి భార్యా భర్తలు. 2020 మే 15న రత్నకుమారి ఇంట్లో ఒంటరిగా వున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన గోపాలరెడ్డి అనుచరుడు ఆమెను బలాత్కారం చేయబోయాడు. విషయం తెలిసి ఓబన్న , అతని తల్లితండ్రులు, రత్నకుమారి తదితరులు ఆ వ్యక్తిని కొట్టారు. ఆ విషయం తెలియగానే గోపాలరెడ్డి తన మనుషులతో వచ్చి బూతులు తిడుతూ ఓబన్ననూ, రత్నకుమారినీ తీవ్రంగా కొట్టాడు. బాధితుడు ఓబన్న యాడికి పోలీసు స్టేషన్లో వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఎస్‌.హెచ్‌.ఓ గారు ఎస్‌.సి సర్టిఫికెట్‌ కోరగా తహశీల్దార్‌ అతనికి సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ నిందితులు ఎప్పుడైతే అధికారుల మీద వత్తిడి తెచ్చారో, ఓబన్న చర్చికి పోతాడు గనక అతను ఎస్‌.సి కాదు అని మళ్ళీ అదే తహశీల్దార్‌ బి.సి సర్టిఫికెట్‌ ఇచ్చాడు. దళితులపై ఏ అఘాయిత్యం జరిగినా వారికి అండగా ఏ అధికారులూ నిలబడరనీ, ఏ చట్టాలూ వారికి ఉపయోగపడవనీ ఈ ఉదంతం తెలియజేస్తుంది. చివరికి తాను ఎస్‌.సి కులస్తుడనేనని రుజువు చేసుకోవడానికి ఓబన్న జిల్లా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చింది.

6. అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు నాగసుబ్బారాయుడు గ్రామ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వినయకుమార్‌ రెడ్డి తన వల్లే నాగసుబ్బారాయుడుకి వాలంటీరు ఉద్యోగం వచ్చిందనీ, అయినా తాను చెప్పిన పనులు అతను చేయడం లేదని నాగసుబ్బారాయుడుని దుర్భాషలాడే వాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం పీకిస్తానని బెదిరించేవాడు. డిగ్రీ వరకూ చదువుకున్న నాగసుబ్బారాయుడు రోజూ ఈ వేధింపులు, తిట్లు భరించలేక పోలీసు స్టేషన్లో వినయకుమార్‌ రెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టాడు. పోలీసులు వినయకుమార్‌ రెడ్డిని అరెస్టు కూడా చేశారు. కేసయితే ధైర్యంగా పెట్టాడుగాని ఊరి రెడ్ల ఆగ్రహానికి గురయ్యి బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాడు.

7. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వై. కిరణ్‌ కుమార్‌, అబ్రహాంలు బైక్ మీద వెళుతుండగా మాస్క్‌ ధరించలేదని పోలీసులు వాళ్ళను ఆపి కొట్టారు. వాదోపవాదాల తరవాత ఎస్‌ఐ వచ్చి వారిని స్టేషనుకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా కొట్టడం వల్ల కిరణ్‌ కుమార్‌ చనిపోయాడని అతని తల్లిదండ్రులు, అబ్రహాం అంటుంటే పోలీసులు మాత్రం కిరణ్‌ కుమార్‌ జీప్‌లో నుండి దూకటం వల్ల దెబ్బ తగిలి చనిపోయాడని అన్నారు. ఏది ఏమైనా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మాస్క్‌ పెట్టుకోకపోతే కొట్టి చంపవచ్చనే చట్టం మన దేశంలో లేదు. అయినా పోలీసుల మీద ఎఫ్‌ఐఆర్‌ గాని, కేసు గాని లేదు. కిరణ్‌ కుమార్‌ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి సరిపెట్టారు. దళితుల ప్రాణాలు చవకే కదా !

8. రాజమండ్రి పట్టణంలో ఇటీవల ఒక ప్రైవేటు షాపులో పని చేస్తున్న దళిత అమ్మాయిపై నలుగురు అత్యాచారం చేశారు. వారిని పట్టుకుని దండించే తీరిక పోలీసులకు లేకపోయింది.

9. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగన్‌ అనే ఒక దళిత యువకుడికీ, ఒక వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకుడికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి గొడవ జరిగింది. ఆ నాయకుడు జగన్‌ మీద దాడి చేశాడు. జగన్‌ పలాస పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోగా సిఐ అతడిని కాలితో తన్ని దూషించాడు. ఆయన మీద కేసు ఎవరు పెట్టాలి ? దళితుల పట్ల పోలీసుల కుండే గౌరవం ఇదీ.

డిమాండ్లు:

  1. దళితులపై దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిబద్ధతతో అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులను త్వరితగతిన విచారించి ప్రాసిక్యూషన్‌ని బలోపేతం చేయాలి. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార ఘటనలపై  ప్రతి మూడు నెలలకు జిల్లా కలెక్టర్‌, సంబంధిత మంత్రి సమీక్ష నిర్వహించాలి. ముఖ్యమంత్రి ప్రతి ఆరు నెలలకి ఈ విషయం మీద సమీక్ష చేయాలి.
  2. రాష్ట్ర స్థాయి ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
  3. సీతానగరం పోలీసుల వ్యవహారంలో వరప్రసాద్‌కి నష్టపరిహారం చెల్లించాలి.
  4. డా.సుధాకర్‌, డా.అనిత రాణిల సస్పెన్షనలను ఎత్తివేసి వారిని విధుల్లోకి తీసుకోవాలి.
  5. అనంతపురం జిల్లాలోని రెండు సంఘటనలలో నిందితులను ఎస్సీ, ఎస్టీ  చట్టం ప్రకారం త్వరగా విచారించి శిక్షించాలి.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
7 ఆగస్టు 2020

Related Posts

Scroll to Top