వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్న ఉమిద్ (వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2025 )చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని మానవ హక్కుల వేదిక అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గ ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మహమ్మద్ జానీ అధ్యక్షతన మంగళవారం అంతర్వేదిపాలెం జామియా మసీద్ నందు జరిగిన వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 పై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

మైనారిటీలను అణిచివేస్తున్నామని సంకేతం ఇవ్వడం ద్వారా హిందూ మెజారిటీ ఓట్లను ఆకర్షించి అధికారంలో కొనసాగాలని కుటిల రాజనీతితో ఇటువంటి చట్టాలు చేస్తున్నారని, ఈ ముసుగులో విలువైన దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి పన్నాగం కూడా ఉందని ఆయన అన్నారు. మైనారిటీ సమాజంపై ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సచార్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవమేనని, ముతావలీలు, ముస్లిం రాజకీయ నాయకులు లబ్ధి పొందారే తప్ప పేద ముస్లింలకు అందిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తూనే, దానిని సంష్కరించడానికి ఈ చట్టం ఏ విధంగా సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా భూ కబ్జాదారులకు, ఆక్రమణదారులకు అనుకూలంగా ఉన్న ఈ సంస్కరణను లౌకికవాదులు, రాజ్యాంగ వాదులు వ్యతిరేకించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి యేడిద రాజేష్, ఆకుమర్తి రవి, ముత్యాల శ్రీనివాసరావు, జనపల్లి నాని, తదితరులు వక్ఫ్ సవరణ చట్టంలోని రాజ్యాంగవిరుద్ద అంశాలపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమం లో ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు అబ్దుల్ రహీం, మహమ్మద్ కబీర్, ఏక్ మీరాజ్ రాజ్, బహుజన్ సమాజ్ పార్టీ రాజోలు నియోజకవర్గం అధ్యక్షులు ఆకుమర్తి భూషణం, రాజోలు నియోజకవర్గం పరిరక్షణ చైతన్య సమితి కార్యదర్శి మందా సత్యనారాయణ, రుద్రరాజు నరసింహారాజు, పమ్మి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా,
10-06-2025.

Related Posts

Scroll to Top