కోవిడ్ కాలంలో ఉపాధి పనిని వాయిదా వేసి కూలీలకు వేతనాలను ముందుగానే  చెల్లించాలి

విషయం: గ్రామీణ ఉపాధి పనుల వల్ల పెద్ద ఎత్తులో కరోనా వ్యాపించే ప్రమాదం. పనిని వాయిదా వేసి వేతనాలు ముందుగానే  చెల్లించాలని ప్రభుత్వానికి మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) విన్నపం.

తెలంగాణలో ప్రస్తుతం 70 వేల మంది గ్రామీణ ఉపాధి పనులకు వెళుతున్నారు మరియు రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంఖ్య బాగా పెరుగుతుంది.

తెలంగాణలోని బహుళ జిల్లాలు జాతీయ గ్రామీణ ఉపాధి పనిని COVID పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మార్గదర్శక సూచనలతోనే ప్రారంభించినా ఈ పనుల స్వభావాన్ని పట్టి పని జరుగుతున్నప్పుడు ప్రపంచమంతటా COVID వ్యాప్తిని అరికట్టటానికి పాటిస్తున్న ఫిజికల్ distancingని పాటించటం చాలా కష్టం.

పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు ఉన్న కొన్ని జిల్లాలతో సహా అనేక జిల్లాల్లోని గ్రామాల్లో ఉపాధి పనుల కోసం ప్రజలు పెద్ద సమూహాలుగా గుమిగూడుతున్నారు. ప్రజలు గ్రామం నుండి పని జరిగే స్థలాలకి క్షేమంగా పోయిరావడం, పని జరిగే చోట ఒకరికొకరు మరీ దగ్గరగా ఉండకుండా, ఒకరు వాడిన పనిముట్లు, గంపలు లాంటివి వేరే వాళ్ళు ముట్టుకోకుండా, తవ్వడం, లెవెలింగ్ పనులు చెయ్యడం కుదిరే పని కాదు. ఉదాహరణకు, వికారాబాద్ జిల్లాలోని గ్రామాలలో మేము ఒకొక చోట 20 మందికి పైగా వ్యక్తులు త్రవ్వటానికి గుంపుగా చేరటం చూసాము. ఆ పనుల్లో మట్టి నింపిన గంపలను వట్టి చేతులతోనే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది.

పశువులకు నీళ్లు తాగించి తన పొలం నుంచి సొంత ఇంటికి వెళ్తున్నరైతునే మొహానికి మాస్క్ లేదని ఊర్లలోకి వచ్చి మరీ పోలీసులు కొడుతున్న సందర్భంలో గుంపులుగా మనుషులు కూడే ఉపాధి పనులని చేపట్టటం లాక్ డౌన్ ముఖ్య ఉద్దేశాన్నే నీరుగార్చటమే.  

అయితే ఉపాధి పనుల నుండి తమకు లభించే కొద్దిపాటి డబ్బు ప్రజలకు ఈ సమయంలో ఎంతో అవసరమవుతుందనేది వాస్తవం. అందువల్ల గ్రామస్తులకు ఈ 3 వారాల లాక్ డౌన్ సమయానికి గాను ముందుగానే వేతనాలు చెల్లించాలని, ఆ పధకం కింద జరగవలసిన పనిని ఈ పరిస్థితి చక్కబడేంతవరకు వాయిదా వెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

మానవ హక్కుల వేదిక
ఆంద్ర -తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
14 ఏప్రిల్ 2020

Related Posts

Scroll to Top