కోవిడ్ సందర్భంలో కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలను  తక్షణమే నిలిపివేయాలి

రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న కాలంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలు తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది.

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధికి గురయ్యి వేలాది మంది చనిపోతుండగా ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏ.పి.పి.సి.బి.) అదేమీ ఎరగనట్లు రాష్ట్రంలో బహిరంగ విచారణలు జరుపుకుంటూ పోతోంది. ఏ.పి.పి.సి.బి. పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండగా ఇప్పటికే మే 12న శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం లింగాలవలస గ్రామంలో ఒకటి, 20వ తెదీన ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రామంలో రెండు బహిరంగ విచారణలు నిర్వహించింది. జూన్ 26వ తేది వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో ఆరు బహిరంగ విచారణలు నిర్వహించబోతోంది.

ఏ.పి.పి.సి.బి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు విధించిన పాక్షిక కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఈ బహిరంగ విచారణలు నిర్వహిస్తోంది. కోవిడ్ రెండవ వెల్లువ విశ్వరూపం ప్రదర్శిస్తున్న కాలంలో పాక్షిక కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగ విచారణలు ఎందుకు నిర్వహిస్తున్నారు అని కాలుష్య నియంత్రణ మండలి అధికార్లను అడగగా 100 మందితో బహిరంగ విచారణలు నిర్వహించవచ్చనే గత ఏడాది సెప్టెంబర్ 14న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆఫీసు మెమొరాండం గురించి ప్రస్తావిస్తున్నారు. కోవిడ్ మొదటి వెల్లువ తగ్గుముఖం పట్టి అన్-లాక్ డౌన్ ప్రకటించిన కాలంలో జారీ చేసిన ఈ ఉత్తర్వును అడ్డం పెట్టుకుని కోవిడ్ రెండవ వెల్లువ ప్రజలపైకి విరుచుకుపడుతున్న కాలంలో ఈ బహిరంగ విచారణలు నిర్వహించుకుంటూ పోవడం అత్యంత దుర్మార్గం. అసలు బహిరంగ విచారణలకు 100 మంది మాత్రమే హాజరు కావచ్చనే కేంద్ర పర్యావరణ శాఖ పరిమితి విధించడమే పరమ దుర్మార్గమైనది. బహిరంగ విచారణ అన్నది ఒక వివాహమో శుభకార్యమో కాదు.  విచక్షణా రహితంగా జరుగుతన్న విధ్వంసకర అభివృద్ధిని ప్రజలు సవాలు చేయగలిగే ఒక అమూల్యమైన ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రాజెక్ట్ ప్రపోనేంట్స్, ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి కోవిడ్ ని అడ్డంపెట్టుకుని బహిరంగ విచారణల ప్రక్రియను ఈ విధంగా నీరుకార్చడం అత్యంత హేయకరం.  

కోవిడ్ ఉధృతంగా ఉన్న కాలంలో బహిరంగ విచారణలు జరపడం చట్ట విరుద్ధమే కాదు, అది ప్రజల జీవించే హక్కును కూడా కాలరాస్తోంది. ప్రాజెక్టుల అనుమతి కోసం జరిగే ఈ బహిరంగ విచారణలలో పాల్గొనడం అనేది ప్రజల ప్రాధమిక హక్కు. ఒక ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇవ్వడం వల్ల తమకు కలగబోయే హాని ఏమిటో తెలుసుకుని, దానికి తగిన విధంగా స్పందించడానికి వీలుకల్పించడానికి పర్యావరణ పరిరక్షణ చట్టాల్లో బహిరంగ విచారణ నిబంధనలను కల్పించారు. ప్రజల జీవించే హక్కుని, సమాచార హక్కుని కాపాడాలనే ఉద్దేశ్యంతో వచ్చిన నిబంధన అది.

పాక్షిక కర్ఫ్యూ విధించిన కాలంలో ఏ.పి.పి.సి.బి. ఈ విధంగా నామకహా విచారణలు జరిపి ఆ ప్రక్రియ పూర్తి చేస్తే అది ప్రజల జీవించే హక్కుని దెబ్బతీయడమే అవుతుంది. అలా చేయడం వల్ల బాగుపడేది పారిశ్రామికవేత్తలే కాని ప్రజలు కాదు.  పోనీ కోవిడ్ బారిన పడతామనే భయాన్ని పక్కన పెట్టి ప్రజలు ప్రాణాలకు తెగించి ఈ బహిరంగ విచారణల్లో పాల్గొంటే వారు కోవిడ్ బారిన పడే అవకాశముంది. ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడటం కాలుష్య నియంత్రణ మండలికి తగదు. 

ఏ ఉద్దేశ్యంతో బహిరంగ విచారణలు జరపాలనే నిబంధనలు తీసుకుని వచ్చారో ఆ లక్ష్యానికే ఇది విరుద్ధం. ఈ విధంగా బహిరంగ విచారణలు జరిపితే దాని వల్ల బాగు పాడేది పారిశ్రామికవేత్తలు మాత్రమే. కేవలం వారి  ప్రయోజనాలను కాపాడటానికి కాలుష్య నియంత్రణ  మండలులను ఏర్పాటు చేయలేదు. అవి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలి.

కేవలం బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే, ప్రజలకు హాని తలపెట్టే ఈ బహిరంగ విచారణల నిర్వహణను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తక్షణం నిలిపివేయాలని మేము కోరుతున్నాం.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
21 మే 2021

Related Posts

Scroll to Top