ధిక్కార స్వరాల గొంతు నులిమే ప్రయత్నమే ఎన్‌.ఐ.ఎ దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ) అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మానవహక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్‌. కృష్ణ ఇంటిలో గత వారం సోదాలు నిర్వహించారు. ఈ సోదా కార్యక్రమం మార్చి 31, 2021న సాయంత్రం 5:35కి మొదలై ఏప్రిల్‌ 1, 2021 తెల్లరుజాము 2:30 వరకు నడిచింది. ఆయన ఇంటి నుండి ఆరు హార్డ్  డిస్కులు, ఒక మొబైల్‌ ఫోను, మూడు సిమ్‌ కార్డులు, మూడు ఎస్‌.డి కార్డులు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటోలు తీసుకున్నారు. ఆలాగే ఏప్రిల్‌ 1, 2 తారీఖులలో మొత్తం ఎనిమిది గంటలు పాటు ఎన్‌.ఐ.ఎ ఆయనని విచారించింది.

ఏప్రిల్‌ 1న ఎన్‌.ఐ.ఎ జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా వారు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, గుంటూరు, ప్రకాశం, శీకాకుళం, కర్నూలు, కృష్ణ, తూర్పు గోదావరి, కడప జిల్లాలలోనూ, తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్-మాల్కాజ్గిరి, మెదక్‌ జిల్లాలలోనూ మొత్తం 31 చోట్ల సోదాలు నిర్వహించారని మాకు తెలిసింది.

విశాఖపట్టణం జిల్లాలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న ముంచింగిపుట్టు పోలీసు స్టేషన్లో నవంబర్‌ 23, 2021 నాడు నమోదైన కేసుకి సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఈకేసులో ముద్దాయిలుగా పేర్కొన్న వారి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఏపిఏ), దేశ ద్రోహం, కుట్ర, ఇతర భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముద్దాయిలు సిపిఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థల సభ్యులు, వారి మద్దతుదారులు అనేది ఈ కేసు సారాంశం. ఈ కేసుని ఎన్‌.ఐ.ఎ మార్చి7, 2021 నాడు తన అధీనంలోకి తీసుకుంది.

గత నవంబర్‌లో ఈ కేను పెట్టినప్పుడు మేము  చెప్పిన విషయాన్నే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాము.

‘మానవ హక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌. ఎఫ్‌) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి. ఎస్‌. కృష్ణ మీదా; ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యుల మీదా విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు పోలీసు స్టేషన్లోనూ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్లోనూ నమోదు చేసిన రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌లలో పోలీసులు చేసిన ఆరోపణలు ప్రజల నిరసించే హక్కుపై జరిగిన దాడి తప్ప మరొకటి కాదు. ధిక్కార స్వరాల గొంతు నులిమి భయోత్పాతం సృష్టించడమే వారి ఉద్దేశ్యం. ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని, అభూతకల్పనలని అనడానికి మాకు ఎటువంటి సందేహం లేదు.

హెచ్‌.ఆర్‌.ఎఫ్‌కు చెందిన వి.ఎస్‌.కృష్ణ వాకపల్లి మహిళలచే పోలీసులకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించారని ముంచింగిపుట్టు ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఆరోపించారు. ఇంతకంటే విచిత్రమైన ఆరోపణ మరొకటి ఉండదు. గ్రే హౌండ్స్ సిబ్బందిచే లైంగిక అత్యాచారానికి గురైన 11 మంది వాకపల్లి మహిళలు న్యాయం కోసం 2007 నుండి చేస్తున్న పోరాటానికి ఇతర ఆదివాసీ, మహిళా, ప్రజా సంఘాలతో పాటు హెచ్‌. ఆర్‌.ఎఫ్‌. కూడా మద్దతు తెలుపుతూ వచ్చింది. వాకపల్లి మహిళల దృఢ సంకల్పంతో పాటు 2012లో హైకోర్టు, సెప్టెంబర్‌ 2017లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్లే విశాఖపట్నంలోని ఎస్‌.సి., ఎస్‌.టి. ప్రత్యేక కోర్టులో ఆ క్రిమినల్‌ కేసు విచారణ ఇప్పుడు జరుగుతున్నది. ఈ కేసులో 18 మంది పోలీసు సిబ్బందిపై విచారణ జరుగుతోంది. అత్యాచారానికి గురైన 11 మంది మహిళల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన 9 మంది కోర్టుకి హాజరై సాక్ష్యం చెప్పారు.

కోర్టు విచారణలో పాల్గొని సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వాకపల్లి మహిళలకు భోజన వసతులు కల్పించడంలో ఇతర సంఘాలతో పాటు హెచ్‌. ఆర్‌.ఎఫ్‌. కూడా సహకరించింది. చట్టబద్ధంగా జరుగుతున్న కేసు విచారణలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధిత ఆదివాసీ మహిళలకు భోజన వసతులు కల్పించడం ఏ రకంగా నేరమౌతుందో మాకు అర్థం కాని విషయం. ఇన్నేళ్ళుగా వాకపల్లి మహిళల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ వచ్చినందుకు, హక్కుల పోరాటాన్ని కొనసాగిస్తున్నందుకు వి.ఎస్‌. కృష్ణను భయపెట్టాలని పోలీసులు అనుకుంటున్నారు. ఇది కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదు.”

ముంచింగిపుట్టు ఎఫ్‌.ఐ.ఆర్‌ లో పేర్కొన్న అభియోగాలు కట్టుకథల, అబద్దాల జాబితా. తప్పుడు కేసు పెట్టడానికి జరుగుతున్న ఉద్దేశపూర్వక ప్రయత్నం ఇది. ఈ సోదాల తరువాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలలో ‘పట్టణ మావోయిజం’ అనే ఒక భారీ కుట్ర సిద్ధాంతానికి తెర తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది సుస్పష్టం.

మానవ హక్కుల కార్యక్షేత్రం మీద బురద జల్లే ఉద్దేశంతోనే ఇటువంటి సోదాలు చేస్తున్నారని భావిస్తున్నాం. ప్రజల దృష్టిలో మానవ హక్కుల కార్యరంగాన్ని చులకన చేసి, సాధికారతని దెబ్బతీసే ప్రయత్నాలలో భాగంగానే ఈ సోదాలు జరిగాయని మానవ హక్కుల వేదిక నమ్ముతున్నది. ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొనబడిన వారందరూ న్యాయప్రక్రియలో చివరికి నిర్దోషులుగా విడుదలయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే ప్రభుత్వ ఉద్దేశం ప్రక్రియనే శిక్షగా మార్చటం. ప్రభుత్వ విధానాలని, చర్యలని విమర్శించే వాళ్ళని ఎడతెరిపి లేకుండా వేధించడం. ఇందుకోసమే మౌలిక ప్రజాస్వామ్యానికి, నాగరిక విలువలకి విరుద్ధమైన, రాజకీయ స్వేచ్చని హరించే యుఏపిఏ చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. ఇతర ప్రత్యేక చట్టాల మాదిరిగానే ఈ చట్టమూ ఉనికిలో ఉన్న న్యాయసిద్ధాంత సూత్రాలను అపహాస్యం చేస్తుంది. యుఏపిఏ రాజ్య నిరంకుశత్వ పాలనకి ఒక ఆయుధం అని న్యాయ నిపుణులు అభివర్ణించారు. ఈ చట్టానికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన సవరణలు రాజ్యంగ మౌలిక విలువలకే విరుద్ధమైనవి.

అలాగే క్లోన్డ్  కాపీలు ఇవ్వకుండా వి.ఎస్‌. కృష్ణ ఇంటి నుండి హార్డ్ డిస్కులు, మొబైల్‌ ఫోను తీసుకోవడం అనేక ప్రశ్నలకు తావిస్తున్నది. తీసుకున్నవాటిని ఎప్పుడు తిరిగిస్తారు అని అడిగితే, అందులో నేరాన్ని రుజువు చేసే మెటీరియల్‌ ఏమీ దొరకకపోతే కనుక విజయవాడలోని ప్రత్యేక ఎన్‌.ఐ.ఏ న్యాయస్థానం నుండి క్లెయిమ్‌ చేసుకోమని తెలిపారు. ఈ హార్డ్ డిస్కులలో వ్యక్తిగత సమాచారం, అలాగే ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్న పనికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి.

విచారణ సమయంలో వ్యక్తిగత డిజిటల్‌ పరికరాలను, వాటిలో ఉండే సమాచారాన్ని తీసేసుకోవటం ఆయా కార్యకర్తల విలువైన సంపదను లాగేసుకోవటమే కాకుండా వారి జీవనోపాధి, గోప్యత హక్కులను, ఆత్మగౌరవాన్ని కాలరాయటమే. ఇది రాజ్యాంగ హక్కుల మీద దాడి. అలాగే వారు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ సాక్ష్యాలని ట్యాంపర్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి రాజ్యాంగ విలువలకి లోబడి నియమ నిబంధనలు తీసుకురావలసిన తక్షణ అవసరం ఉంది. 

వి.ఎస్‌. కృష్ణ మీద మోపిన అభియోగాలు అన్నీ పూర్తిగా అసత్యాలని, పోలీసులకి ఉన్న చట్టపరమైన అధికారాలను వాడుకుని చట్టాలనే అపహాస్యం చేస్తున్నారని మేము బలంగా భావిస్తున్నాం. మానవ హక్కుల వేదికలో ఆయన వ్యవస్థాపక సభ్యుడు, అలాగే ముఖ్యమైన కార్యకర్త కూడా. రాజ్యం, రాజ్య అంగాలు చేసే చట్టవ్యతిరేక కార్యక్రమాలని, ప్రస్తుతం నడుస్తున్న అప్రజాస్వామిక ధోరణులని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నందునే ఈ కేసులు, సోదాలు.

వి.ఎస్‌. కృష్ణ మీద, ఇతర హక్కుల, దళిత, మహిళా సంఘాల కార్యకర్తల మీద పెట్టిన ఈ తప్పుడు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్‌.ఐ.ఎ ను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తున్నది. నిరసనని అణగదొక్కే చర్యలకి తక్షణమే అడ్డుకట్ట వెయ్యాలి. మా కార్యక్షేత్రాన్ని నేరమయంగా చిత్రీకరించే ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావు. మేము మావోయిస్టు పార్టీకి కానీ లేదా ఇతర ఏ రాజకీయ పార్టీకి కానీ అనుబంధం కాదు. విసృత, విశాల పరిధి కలిగిన ఒక స్వతంత్ర మానవ హక్కుల ఉద్యమం అవసరం, సాధ్యం అనే లోతైన అవగాహనతోనే మేము 1998 ( హెచ్‌ ఆర్‌ ఎఫ్‌ స్థాపన) నుంచీ పనిచేస్తున్నాము. ఆ పని కొనసాగిస్తాము.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
6 ఏప్రిల్‌ 2021

Related Posts

Scroll to Top