రామడుగు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కూతాడి కనకయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ లు కలిసి ఉమ్మడిగా నిజనిర్ధారణ జరిపాయి. మా బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు న్యాయవాది సలపాల రమేష్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు టి సురేష్ లు ఉన్నారు. మా విచారణలో భాగంగా బాధితుడినీ, అతని కుటుంబ సభ్యులనూ కలిసి వివరాల సేకరించాము. అలాగే రామడుగు మండలం ఎస్సై సురేందర్ బాబుతోనూ ఫోన్లో మాట్లాడాము.

వెలిచాల గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారం చేసే ఒక వ్యక్తి తనకు చెందిన ఆరు గొర్రెలు ఎవరో ఎత్తుకెళ్లారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 22న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్టు కేసు నమోదు అయింది. రెండు నెలల అనంతరం, రామడుగు పోలీసులు ఈ నెల 11 వ తారీఖున వెలిచాల గ్రామానికే చెందిన కనకయ్య ను ఉదయం నాలుగు గంటలకు ఇంటిలోనుండి నిద్రలేపి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అక్కడ నుండి కరీంనగర్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్లో గల క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉంచి వరుసగా రెండు రోజులు కొట్టిన తర్వాత 12వ తారీఖు రాత్రి, లేవలేని స్థితిలో ఉన్న కనకయ్యను వారి బంధువులకు అప్పగించారు. మరుసటి రోజు ఉదయం కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని కొట్టాలని చూశారు. అయితే, అప్పటికే విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న కనకయ్యను ఇంటికి పంపించి మేము పిలిచినప్పుడు మళ్ళీ రావాలని బెదిరించి పంపారు. 13 రోజుల గ్యాప్ అనంతరం 26వ తారీకు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ పిలిపించుకొని ఎనిమిది మంది కానిస్టేబుళ్లు మరియు ఎస్సై కలిసి రెండు దఫాలుగా కనకయ్యను పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టారు. నేలపై బోర్లా పడుకోబెట్టి కాళ్లు కట్టివేసి, చేతులు, వీపుపై నిలబడి, వీపు పైనా అరిపాదాల పైనా బెల్టులు, కర్రలను ఉపయోగించి కొట్టారని కనకయ్య చెప్తున్నాడు. గొర్రెల దొంగతనం తానే చేశానని ఒప్పుకోవాలని కొట్టారని బాధితుడు చెప్తున్నాడు. తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకోకపోతే ఇలాగే కొడుతూ, చంపి వేస్తామంటూ పోలీసులు కొట్టారని కనకయ్య చెప్పాడు. చదువు రాని కనకయ్యతో ఆరోజు ఒక పేపర్ పై వేలిముద్ర చేయించుకుని, రాత్రి 10 గంటలకు వదిలిపెట్టారు. ఎస్టీ ఎరుకల కులానికి చెందిన కనకయ్య 28వ తారీకు స్థానికంగా చికిత్స చేయించుకుని, 29 తారీకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఇప్పటికీ కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

రాజ్యాంగం తన దృష్టిలో దేశంలోని పౌరులందరూ సమానమే అని చెప్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే, చట్టం అందరికీ సమానమైన రక్షణ ఇస్తుంది అని ఉంటుంది. కానీ కరీంనగర్ జిల్లాలోని పోలీసులు లాఠీ, బెల్టులను నమ్ముకున్నంతగా రాజ్యాంగాన్ని నమ్ముకోవడం లేదు. సమాజంలోని అణగారిన వర్గాలూ, నోరు లేని వాళ్ళు కనిపిస్తే ఇక వాళ్ల ప్రతాపమే వేరు. నేరం ఎవరు చేశారనే విషయాన్ని కాసేపు అలా ఉంచినా, నేరస్థాయి కూడా ఇక్కడ పెద్దది కాదు. నేర విచారణలో ఎన్నో ఆధునిక పద్ధతులు వచ్చినా సామాన్యులపై మాత్రం వీళ్ళ తీరు మారటం లేదు.

కరీంనగర్ జిల్లాలో కొంతకాలంగా కనీసం ఐదారు లాకప్ డెత్ లు జరిగాయి. చిత్రహింసలు పెట్టడం, బాధితులు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేయటం సాధారణమైపోయింది.
పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం మా ఏడవ గ్యారెంటీగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఆచరణలో పోలీసు ప్రవర్తనలో, వ్యవహారాల్లో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు.

మా డిమాండ్లు

  1. ముఖ్యమంత్రి గారే స్వయంగా హోం శాఖను నిర్వహిస్తున్నందున, వారి కార్యాలయం తక్షణమే కల్పించుకొని అన్యాయంగా కనకయ్యను చిత్రహింసలకు గురిచేసిన రామడుగు ఎస్ఐ ని మరియు పోలీసులను సస్పెండ్ చేయాలి.
  2. బాధ్యులైన రామడుగు పోలీసులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి.
  3. బాధితుడైన కనకయ్యకు అట్రాసిటీ చట్టం ప్రకారం రావలసిన పరిహారం ఇప్పించి, తగిన వైద్యం చేయించి, ఆయన గౌరవంగా జీవించే హక్కును కాపాడాలి.

డాక్టర్ ఎస్. తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Related Posts

Scroll to Top