రైతులకు బీమా పథకాన్ని ప్రభుత్వమే చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘జాతీయ బీమా కార్యక్రమం’ ద్వారా కష్టాలొచ్చినప్పుడు రైతులను ఆదుకునే బాధ్యత నుండి వైదొలగాలనుకుంటోంది. ఈ బీమా కార్యక్రమాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెపితే వాళ్లల్లో వాళ్లకు పోటీ పెరిగి ఎక్కువ మంది ఏజెంట్లను నియమించుకుని అధిక సంఖ్యలో బీమాలు కట్టిస్తారని ప్రభుత్వ ఆలోచన. ఆ పని ప్రభుత్వమే ఎందుకు చేయకూడదని మానవ హక్కుల వేదిక ప్రశ్నిస్తోంది.

ఇప్పటికే విత్తనాలూ, పురుగుల మందులూ లాంటి అవసరాల కోసం రైతులు పూర్తిగా ప్రైవేటు కంపెనీలపై ఆధారపడి వున్నారు. రోజురోజుకి  ఆ కంపెనీలు వృద్ధి చెందుతుంటే, రైతులు మాత్రం చితికిపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన బాధ్యతల నుండి వైదొలగి, చివరికి బీమా కార్యక్రమాన్ని కూడా ప్రైవేటు పరం చేయడం రైతును మరింత కుదేలు చేయడానికే. పైగా ప్రీమియంను 11% నుండి 13% వరకు పెంచడం మరింత దారుణం. ప్రైవేటు కంపెనీల కల్లబొల్లి మాటలు నమ్మి రైతులు ఒక వేళ అంత భారీ ప్రీమియంను చెల్లించినా రేపు ఫైలాన్ తుఫాను లాంటి పెద్ద ఆపద వచ్చినప్పుడు నష్టాలు కోట్లల్లో వుంటాయి. అప్పుడు ఆ కంపెనీలు రైతులను ఆదుకుంటాయన్న నమ్మకం లేదు. ఇక ప్రీమియం కట్టలేని వారిని ఎవరు ఆదుకుంటారు ?

ప్రభుత్వం రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే బీమా ప్రీమియంను తగ్గించి, ఈ కార్యక్రమాన్ని తనే స్వయంగా చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.

(ఎస్. జీవన్ కుమార్ )
(వి. ఎస్. కృష్ణ)

16.11.2013
హైదరాబాద్

Related Posts

Scroll to Top