హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన.
12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్సీ, బిసి, బాలికల హాస్టల్లో ఉంటున్న 9 మంది విద్యార్థినిలను మరియు గంగారంకు చెందిన మోడల్ పాఠశాలలో చదువుచున్న డే స్కాలర్, ముగ్గురు విద్యార్థినిలను రేచల్, లీనా అనే మత ప్రచారకులు, నియమాలకు విరుద్ధంగా బయటికి తీసికొని పోయిన సంధర్భంగా, మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు అద్దునూరి యాదగిరి, కార్యదర్శి, కర్నాటకపు సమ్మయ్య, లు అట్టి హాస్టల్లను ఈ రోజు సందర్శించి వాస్తవాలు సేకరించడం జరిగింది.
ఈ సంధర్భంగా ఎస్సి హాస్టల్ పిల్లలను మరియు వారి వార్డెన్ గారిని అడుగగా, 12-09-2025 సాయంకాలమున, 6,50,గంటలకు రేచల్ అనే మహిళ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చి ఇవాళ బైబిల్ రీడింగ్ ఉందని మీరు రావాలని అడుగగా మేము రామని వార్డెన్ మేడమ్ లేదని చెప్పినప్పటికీ వాచ్మెన్ కూడా పంపించనని చెప్పినప్పటికీ నేను వార్డెన్ మేడమ్ పర్మిషన్ తీసుకున్నాననీ నమ్మ బలికి నలుగురు విద్యార్థినులను బయటికి తీసికొని పోవడం జరిగిందని మేడమ్ కి ఫోన్ చేద్దాం అన్నా కూడా వినకుండా బయటికి తీసికొని పోవడం జరిగిందని పిల్లలు, వాచ్మెన్ చెప్పడం జరిగింది.
మీరు ఎటు వెళ్లారని వార్డెన్ గారిని అడుగగా నేను మహాదేవ్ పూర్ లో గల హాస్టల్ కి ఇంచార్జ్ గా వెళ్లానని ఆమె చెప్పడం జరిగింది. అక్కడ డ్యూటీ అయిపోయిన తరువాత నేను ఇక్కడికి వచ్చేసరికి ఈ విషయం తెలిసిందని వార్డెన్ చెప్పడం జరిగింది. తరువాత నేను నలుగురు, పిల్లలను వెంట బెట్టుకొని పోయానని చెప్పడం జరిగింది.
బిసీ హాస్టల్ కి లీనా అనే మహిళ వచ్చి మోటివేషన్ క్లాస్ లు ఉన్నాయని వార్డెన్ మాధవి జ్వరంతో వేరే గదిలో పడుకుంటే ఆమెకు వాచ్మెన్ కూడా చెప్పకుండా పంపించడం జరిగిందని మాధవి గారు చెప్పడం జరిగింది. తరువాత వార్డెన్ పిల్లలందరు ఉన్నారా అని వాచ్మెన్ ను అడగగా అందరు ఉన్నారని చెప్పిందని మాధవి వార్డెన్ మాకు చెప్పడం జరిగింది.
తెల్లవారి వచ్చిన తరువాత విషయం తెలుసుకున్న వార్డెన్, పిల్లలను తీసికొని పోయి ఏమి మాట్లాడారు అని అడుగగా ఎవరైనా తప్పుడు వ్యక్తులు వచ్చి తీసుకుని పోతే పోవద్దని డ్రగ్స్ గాని మత్తు పదార్థాలు ఇస్తే తినకూడని చెప్పారని పిల్లలు చెప్పడం జరిగిందని వార్డెన్ అన్నారు.
అదేవిధంగా, గంగారంలో మోడల్ స్కూల్ లో చదువుతున్న 10,వ, తరగతి పిల్లలకు వారి క్లాస్ టీచర్ సదానందం పేరుతో ఫోన్ చేసి సైన్స్ ఫేర్ క్లాస్ లు ఉన్నాయి మీరు భూపాలపల్లికి రావాలని చెప్పగా నిజమని నమ్మిన పిల్లల తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలను పంపినట్టు వారి ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. తరువాత రాత్రి పిల్లలను పంపక పోవడంతో ఎవరైతే ఫోన్ చేసారో వారికి ఫోన్ చేయగా ఫోన్ నాట్ రీచేబ్ ల్ రావడం వల్ల సదానందం కు ఫోన్ చేసారని ఆయన ఎలాంటి సైన్స్ ఫేర్ క్లాస్ లేదని చెప్పడంతో ప్రిన్సిపాల్ కూడా అదే చెప్పడంతో ఖంగు తిన్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరా తీసి వారిని ఉంచిన చోటు తెలుసుకుని పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
మా డిమాండ్లు
- విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వాచ్ మెన్లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి.
- వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- వార్డెన్ పర్మిషన్ లేకుండా వాచ్మెన్ల ను మోసం చేసి హాస్టల్ లోపలికి ప్రవేశించిన రేచల్ లీనాఅనే మహిళలను, వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి
- హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను శాఖ పరమైన చర్యలను తీసుకోవాలి
- అన్ని హాస్టళ్లకు శాశ్వత ప్రాతిపదికన వార్డెన్లను నియమించాలి
- హాస్టల్ విద్యార్థులకు తగు కౌన్సిలింగ్లను నిర్వహించాలి
- విద్యార్థుల తల్లిదండ్రులకు మోసపూరిత మాటల చెప్పి వారి పిల్లలను తీసుకుపోయిన మహిళలపై మరియు గంగారంకు చెందిన పిల్లలను వారి క్లాస్ టీచర్ పేరుతో ఫోన్ చేసి పిల్లలను రప్పించిన వారిపై పోలీసులు అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. కాబట్టి, ఇప్పటికైనా పోలీసులు లోతుగా ఆలోచించి వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మానవ హక్కుల వేదిక,
ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ,
16-09-2025.