ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో భాగంగా ఇంటి వద్ద రేషన్ సరఫరా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడం పట్ల మానవ హక్కుల వేదిక (HRF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈ చర్య వల్ల మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసుల ఆహార భద్రతకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది.
2021లో ప్రారంభమైన ఇంటివద్ద సరఫరా విధానం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (MDUs) – ద్వారా రేషన్లు నేరుగా లబ్దిదారుల వద్దకు చేరేవి. ఇది వృద్ధులు, వికలాంగులు ఇంకా రోజువారీ కూలీల ప్రయాణ భారాన్ని గణనీయంగా తగ్గించింది. ఆదివాసీ ప్రాంతాల్లో, ముఖ్యంగా నల్లమల అరణ్యంలో నివసించే చెంచులు వంటి అతి వెనుకబడిన ఆదివాసి సమూహాలకు ఇది ఎంతో ఉపయోగపడింది. సంక్షేమాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ముందడుగుగా నిలిచింది.
ఈ విధానాన్ని రద్దు చేసిన తర్వాత, ఏజెన్సీ ప్రాంతాలేకాక దానిని ఆనుకుని ఉన్న గ్రామాల నుండి కూడా తీవ్ర అసంతృప్తిని వెళ్ళబోస్తూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలు గ్రామాల్లో ఆదివాసీలు ఇప్పుడు కష్టమైన అటవీ మార్గాల మధ్యగా 10 కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తోంది. | దీనివల్ల, చాలా మంది తమకు న్యాయంగా లభించాల్సిన రేషన్లను వదులుకోవాల్సిన పరిస్థితికి చేరుకుంటున్నారు.
ఇంటివద్ద పంపిణీ ద్వారా రేషన్ మిస్ అవుతున్నారన్న ప్రభుత్వ వాదన క్షేత్ర స్థాయిలో అవాస్తవమని తేలింది. లిబెక్ ఇండియా అనే విధాన పరిశోధనా సంస్థ పాడేరు ఐటిడిఎ పరిధిలో 790 మంది ఆదివాసీ లబ్దిదారులతో నిర్వహించిన సర్వే ప్రకారం, 83 శాతం మంది ఇంటివద్ద పంపిణీ వ్యవస్థను డిపో వ్యవస్థకంటే మెరుగైనదిగా అభిప్రాయపడ్డారు. 92 శాతం మంది ప్రయాణ భారం తగ్గిందని పేర్కొన్నారు. డిపోల వద్ద 75 శాతం మంది రేషన్ తక్కువగా ఇచ్చారని, 65 శాతం మంది అదనపు వస్తువులు కొనాలని ఒత్తిడి ఎదుర్కొన్నారని వెల్లడించారు. స్పష్టంగా, దూరప్రాంతాల్లో నివసించే ఆదివాసీ కుటుంబాలకు ఇంటివద్ద రేషన్ పంపిణీ వ్యవస్థ మెరుగైనదని, దూరాభారాల సమస్య తగ్గించిందని ఈ సర్వేలో తేలింది.
ఇంటివద్ద పంపిణీ విధానంలో కొంత వెసులుబాటు కూడా ఉండేది. ఒక కుటుంబం మొదటి దఫా మొబైల్ యూనిట్ (MDU) వచ్చినప్పుడు వెళ్ళలేకపోతే, అదే రోజున స్థానిక సచివాలయంలో నిలిపిన మినీ ట్రక్కు నుండి రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. కొన్నిసార్లు ఆ ట్రక్కులు తిరిగి గ్రామాలకు రావడం కూడా జరిగేది. ఈ వ్యవస్థనే మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రభుత్వం ఈ పద్దతిని పూర్తిగా నిలిపివేసింది.
ఇంటివద్ద పంపిణీని ప్రాథమిక మార్గంగా ఉంచుతూ, డిపోలను బ్యాకప్ చానల్‌గా కొనసాగించే ద్వంద్వ విధానాన్ని అమలు చేయడం ఉపయోగకరమనీ, పూర్తిగా సాధ్యమని HRF అభిప్రాయ పడుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో, డిపోలు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాబట్టి వాటిని మరింత సులభంగా, బాధ్యతాయుతంగా నడిపే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
మొబైల్ యూనిట్ల వల్ల ఏర్పడిన పారదర్శకత, జవాబుదారీతనం వల్ల ఇబ్బంది పడుతున్న రేషన్ డిపో డీలర్ల శక్తివంతమైన లాబీ ఈ వ్యవస్థ రద్దు వెనక ఉండవచ్చని HRF భావిస్తోంది. ఈ నిర్ణయం జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (NFSA)లోని ప్రధాన లక్ష్యాలను, ముఖ్యంగా సెక్షన్ 30ని, అలాగే ఆదివాసులే లక్ష్యంగా సంక్షేమ సేవలు అందించేందుకు రూపొందించిన షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపొనెంట్ (STC) నిధుల ఉద్దేశ్యాలను విస్మరిస్తుంది.
ఆదివాసీ ప్రాంతాలన్నింటిలోనూ తక్షణమే ఇంటివద్ద రేషన్ పంపిణీ వ్యవస్థ పునరుద్ధరించాలని HRF డిమాండ్ చేస్తోంది. మొబైల్ యూనిట్లను మిస్ అయిన వారి కోసం డిపోల ద్వారా రేషన్ పొందే ప్రత్యామ్నాయాన్ని కూడా కల్పించాలి. ఈ ఇంటివద్ద పంపిణీ మోడల్‌ను మెరుగైన లాజిస్టిక్స్, స్వచ్చంద సహాయం ఇంకా బలమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థల ద్వారా బలోపేతం చేయాలి.
ఆహార భద్రత అనేది కేవలం సరఫరా మాత్రమే కాకూడదు. అది గౌరవవప్రదమైన హామీగా, సులభంగా అందుబాటులో ఉండాలి. వెనకబడిన వర్గాలకు ప్రాథమిక హక్కులను చేరువ చేసే బాధ్యత రాష్ట్రానికి ఉంది. ఆ అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించాలిగాని మరింతగా బలపరచకూడదు. ఇంటి వద్ద రేషన్ సరఫరా విధానాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఒక తిరోగమన చర్య, ఒక ఉద్దేశపూర్వక వంచన. ఇది ఆదివాసులకు హాని చేస్తుంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
వై. రాజేశ్ – HRF ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి.ఎస్. కృష్ణ – HRF ఏపీ & తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు
12-6-2025,
విశాఖపట్నం.