ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సెప్టెంబర్ 6 నాడు జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన వారి మీద కంచికచర్ల పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులని, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.
సెప్టంబర్ 6 వారు తారీఖు సాయంత్రం పరిటాల గ్రామంలో మత ఉద్రిక్తలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇద్దరు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం సెప్టెంబర్ 7 నాడు గ్రామంలో నిజ నిర్ధారణ చేపట్టింది. గ్రామస్థులతోనూ, కంచికచర్ల పోలీసులతోనూ మాట్లాడింది.
సెప్టెంబర్ 6 సాయంత్రం స్థానిక షెడ్యూల్డ్ కాస్ట్ (మాదిగ) నివాస ప్రాంతంలో ఉన్న యుసిసిసి చర్చ్ లో కొంత మంది పిల్లలలు ప్రార్ధనకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఊరేగింపులో కొంతమంది విగ్రహం ఉన్న బండికి ఉన్న డీజే నుండి ‘పుడితే పుట్టాలి హిందువుగా పుట్టాలి’ లాంటి పాటలని బిగ్గరగా వినిపించడం మొదలుపెట్టారు. స్థానిక పెద్దలు కలగచేసుకుని, అటువంట పాటలను పెట్టవద్దు అని సూచించారు. అదే సమయంలో వారు కంచికచర్ల పోలీసులని కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే కంచికచర్ల పోలీసులు వీరికి కాంటాక్ట్ లోకి రాలేదు.
స్థానిక పెద్దల సూచనని పెడచెవిన పెడుతూ ఈ ఊరేగింపులో కొంతమంది మరింతగా రెచ్చగొట్టే చర్యలకి పూనుకున్నారు. కులం పేరుతో బూతులు తిడుతూ, అసభ్యకరమైన రీతిలో ప్రవర్తిస్తూ, ఆ పాటలని మరింత బిగ్గరగా వినిపించారు. దానితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. అప్పటికే ఇక్కడికి చేరుకున్న పోలీసులు మత ఉద్రిక్తలు రెచ్చగొడతున్న వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా, అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ‘అటువంటి పాటలు పెడితే తప్పు ఏంటి’ అని స్థానికులనే ఎదురు ప్రశ్నించాడు.
ఇటువంటి రెచ్చగొట్టే పాటలనే మిలాద్ ఉల్ నబీ అయిన సెప్టంబర్ 5 నాడు స్థానిక పాత మసీదు పరిసరాలలో కూడా వినిపించారని మేము తెలుసుకున్నాము. ఇలా గత 2-3 సంవత్సరాలు నుండి జరుగుతున్నదని, ఈ సంవత్సరం ఘర్షణ స్థాయికి చేరుకున్నదని గ్రామస్తులు మాకు తెలిపారు.
మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నించిన వారి మీద ఎఫ్ఆర్ నమోదు చేశారా అని కంచికచర్ల పోలీసులని అడుగగా, వారు విస్మయకరమైన జవాబు ఇచ్చారు. ‘గ్రామస్తుల మధ్య సెటిల్మెంట్ చేశాము. ఫిర్యాదుని ఇంకా పరిశీలిస్తున్నాము’ అని వారు తెలిపారు. అంటే ఇప్పటికీ ఫిర్యాదుని రిజిస్టర్ చేయలేదు. పోలీసులు పని ఫిర్యాదుని రిజిస్టర్ చేసి, విచారణ చేసి, శిక్ష పడేటట్టు చేయటం కాని, సెటిల్మెంట్లు చేయడం కాదని ఇక్కడ వారికి మరొక్కసారి గుర్తుచేయదలుచుకున్నాము.
పోలీసులే తక్షణమే మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వారిని గుర్తించి వారి మీద భారతీయ న్యాయ సంహిత, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం కూడా ఇటువంటి శక్తులని కట్టడి చేయాలని కోరుతున్నాము.
వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
07.09.2025,
విజయవాడ.