ఈ నెల తొమ్మిదవ తేదీన కొత్తపేట తండాకు చెందిన గిరిజన లంబాడ యువకుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం బాధితుడుని, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించింది.
సూర్యాపేట జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన ఇరవై ఐదేళ్ల ధనావత్ సాయి సిద్దు నిరుపేద గిరిజన యువకుడు. తండ్రి మరణానంతరం చదువు మధ్యలో ఆపేసిన సిద్దు, కుటుంబానికి ఏకైక దిక్కుగా మారి, వ్యవసాయం చేసుకోవటానికి సొంత భూమి, ఉండటానికి సరైన ఇల్లు కూడా లేక గత ఏడు సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య , తల్లీ అతనిపై ఆధారపడి ఉన్నారు.
ఈ నెల రెండవ తేదీన తన సొంత అన్నపై అకారణంగా మద్యం మత్తులో దాడి చేసిన పొరుగు కుటుంబంతో సిద్దు ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ఈనెల 9వ తారీఖున వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఉదయం ఆరు గంటలకే ఇద్దరు కానిస్టేబుళ్లను సిద్దు ఇంటికి పంపి, కొట్టుకుంటూ స్టేషన్కు పిలిపించాడు. స్టేషన్ పై గదిలో పెద్ద రబ్బరు పట్టాలు, కర్రలతో ఎస్సై స్వయంగా మరియు ఇద్దరు కానిస్టేబుల్లు కలిసి సిద్దును, భూమిలేని నువ్వు యూరియా ధర్నాలో ఎందుకు పాల్గొన్నావు లంబాడా కొడకా అంటూ తిడుతూ, గంటకు పైగా విపరీతంగా కొట్టారు. అనంతరం, ఆరోజు సాయంత్రం, గతంలో జరిగిన ఘర్షణలో పొరుగు కుటుంబంలోని మహిళకు గాయం అయ్యిందని ఇచ్చిన ఫిర్యాదు చూపించి, అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు.
ఈ నెల మూడో తేదీన రైతులందరూ మండల కేంద్రంలో యూరియా కోసం చేసిన ఆందోళనలో సిద్దు పాల్గొన్నాడనో లేక సిద్దుపై ఫిర్యాదు చేసిన పొరుగు కుటుంబం ఇచ్చిన లంచాలో లేక పైస్థాయి రాజకీయ నాయకుల ఆదేశాలో లేదా ఎస్సై అంటే చట్టానికి అతీతమనే అతని అహంకారమో తెలియదుగానీ ఆ ఎస్సై సిద్ధూను దారుణంగా కొట్టాడు. నడవలేని స్థితిలో ఆ యువకుడు కోర్టులో జడ్జ్ గారి ముందే నేలపై పడిపోయాడు. 20 రోజుల అనంతరం కూడా అతను ఇంకా నడవలేని స్థితిలోనే ఉన్నాడు. అతనొక్కడు పనిచేస్తేనే నడిచే కుటుంబం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.
ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పోలీసులందరూ చట్టానికి అతీతంగానే వ్యవహరిస్తున్నారు. పోలీసుల పైన ఎస్సీ ఎస్టీ చట్టం అప్లై కాదని కూడా వారు భావిస్తున్నట్టున్నారు. అందుకే బలహీన కులాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలను చిన్న చిన్న ఆరోపణలపై కూడా కులం పేరుతో తిడుతూ, కొడుతూ, కొన్నిసార్లు లాకప్ లలోనే చంపుతున్నారు. ఇటువంటి అనేక సంఘటనలు నిరంతరం పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, పోలీసుల మీద ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోవడం లేదు. దీన్నే ఆసరాగా పోలీసులు సామాన్య ప్రజలపై అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు, అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు.
ప్రజాస్వామ్య బద్ధ పరిపాలనను ఏడవ హామీగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ అమలు కోసం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పోలీసు శాఖ ప్రక్షాళన చేపట్టాలి. చట్ట బాహ్య, అనైతిక ప్రవర్తన కలిగిన పోలీసులపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయక సాయి సిద్ధుని హింసించిన వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి. అతనితో పాటు, అతనికి సహకరించిన కానిస్టేబుల్లతో సహా ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఒక సాధారణ పౌరుడు మరొక పౌరునిపై చేయి చేసుకుంటే ఎటువంటి శిక్ష పడాలో పోలీసులకూ అదే శిక్ష పడాలి. సాయి సిద్ధు కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వచ్చే పరిహారం వెంటనే అందించి ఆర్థికంగా ఆదుకోవాలి.
మా నిజ నిర్ధారణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి టి హరికృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ల రోహిత్, దిలీప్ కుమార్, వెంకటనారాయణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దశరధ, సభ్యులు గురవయ్య, వెంకటరమణలు మరియు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు పి. శంకర్ గారు పాల్గొన్నారు.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ.
30.09.2025,
దామరచర్ల.