భూపాల్ పల్లి జిల్లా ములుగు ఘనపూర్ ధర్మారావు పేటకు చెందిన బొల్లం బిక్షపతి తనకు చెందిన మూడు ఆవులను మేపుతున్న క్రమంలో పూజారి బాబుకు చెందిన పొలంలో రెండు ఆవులు వరి పొలాన్ని పొరపాటున మేయడం జరిగింది. తగిన నష్టపరిహారం చెల్లిస్తానని నన్ను కొట్ట వద్దని కాళ్ళ వేళ్ళ పడిన కనికరించకుండా పొలం యజమాని పూజారి బాబు బూతులు తిడుతూ, తాటి మట్ట తోని విచక్షణ రహితంగా బొల్లం బిక్షపతి పై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామంలోని పెద్దమనుషులకు తెలియజేస్తూ, తనకు తగిలిన దెబ్బలు కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామ పెద్ద మనుషులు, పోలీసులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకుడైన పూజారి రాజేందర్ కు పూజారి బాబు అన్న అవుతారు. దీనితో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం మూలంగానే మూడు రోజులైనా వారిపై చర్య తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బొల్లం బిక్షపతి ఇక న్యాయం జరగదని జీవితంపై విరక్తి చెంది అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగడం జరిగింది. దాదాపుగా 8 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడి బొల్లం బిక్షపతి 26.9.2025 న ఉదయం ఎంజీఎంలో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక ఎంజీఎం ఆసుపత్రిలోని పోస్టుమార్టం దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించడం జరిగింది. ములుగు ఘనపూర్ ఎస్సై గారు 16.9.2025 న పిటిషన్ ఇచ్చినప్పటికీ అతనిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన కారణంగానే, జీవితం పై విరక్తి చెంది, అవమానభారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా 10 గంటల పాటు స్థానిక పోలీసులు పోస్టుమార్టం దగ్గరికి ఎవరు పోకుండా ఎస్సై, సీఐ లు రెండు వర్గాలను పిలిచి డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. తమ విద్యుక్త ధర్మాన్ని మరిచి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, అతని అనుచరుల మెప్పు పొందడం కోసం పోలీసులు పనిచేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా పోలీసులు పూజారి బాబు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు ,307, 506 తదితర కేసుల్ని నమోదు చేసి బొల్లం బిక్షపతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్య వహించి నందుకు బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.
Dr. బాదావత్ రాజు
రాష్ట్ర ఉపాధ్యక్షులు, మానవ హక్కుల వేదిక
28-09-2025,
భూపాల్ పల్లి.