ప్రభుత్వానికి అనుకూలంగా లేదని ఏకంగా శాసన మండలినే రద్దు చేయడం అప్రజాస్వామికం

రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వo ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించలేదని ఏకంగా ఆ మండలినే రద్దు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది.  ఇది కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదు.  ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు ఏకంగా రాష్ట్ర శాసన మండలి బలి పశువు కావడం విచారకరం.  బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు ఇంతటిఅసహనాన్ని, దుoదుడుకుతనాన్ని ప్రదర్శించడం వారి పరిపాలనాదక్షతతోలోని లోపాలను చాటుతుంది.  ఇది ప్రజాహితాన్ని  దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం, చేపట్టిన చర్య కాదు. దురహంకారాన్ని చాటిచెప్పే చర్య. 

పాలనావ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని, అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమంగా అందాలని హెచ్.ఆర్.ఎఫ్. బలంగా నమ్ముతోంది.  ఈ వంకతో ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడం ఏమాత్రం తగదు. 

ఒక శాసన సంస్థ తీసుకునే నిర్ణయాలను రెండవ శాసన సంస్థ సమీక్షించ గలిగే వెసులుబాటు, అవకాశం ఉండటం ఒక ప్రజాస్వామిక సాంప్రదాయo. భారత రాజ్యాంగo దాన్ని గుర్తించే కేంద్రంలో రాజ్య సభను, రాష్ట్రాలలో శాసన మండలులు ఉండాలని భావించింది.  మన రాజ్యాంగకర్తలు ఫెడరల్ స్వభావాన్ని కూడా గౌరవించారు కనక దాన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని అనుకోలేదు.  అందుకనే దాన్ని రద్దు చేసుకునే అవకాశం, తిరిగి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు.  ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజ్యాంగం కల్పించిన ఈ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం దుర్మార్గం.  

శాసనాలు చేయడానికి రెండు సభలు ఉండటం మంచిదని, అయితే రాజ్యాంగం శాసన మండలి, రాజ్య సభల సభ్యత్వాన్ని కేవలం విద్యావంతులు, పండితులు, పట్టభద్రులకు పరిమితం చేయకుండా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి ఉండాల్సిందని మేము భావిస్తున్నాము.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
14 జనవరి 2020

Related Posts

Scroll to Top