ఆత్మహత్య చేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మాదారావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై 1.9.2025 న తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ బాధిత కుటుంబాన్ని కలిసి వాస్తవ విషయాలు సేకరించింది.

గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న మైదం మహేష్ కు 2025 మే, జూన్ (రెండు నెలల) లకి సంబంధించిన వేతనం రాలేదు. జూలై 2025 తర్వాత మున్సిపాలిటీగా మారినప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు రాకపోవడం కుటుంబాన్ని నడపటం కష్టంగా మారడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. దీనికి తోడు కుటుంబం కోసం చేసిన చిన్నచితక అప్పులు సైతం తీర్చలేక తీవ్రమనోవేదనతో ఉన్నాడు. మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న కిరీటి గారి దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో విసిగివేసాగి 1.9.2025 న కలుపుమందు తాగి 2.9.2025 న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు . గత ఆరు నెలలుగా మైదం మహేష్ జీతాన్ని బిల్ కలెక్టర్ తన అకౌంట్లో వేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాదిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పటికే దీనికి కా రణమైన బిల్ కలెక్టర్ కిరీటిని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా తెలిసింది.

మా డిమాండ్లు:

  • కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తూ, 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
  • ఇందిరమ్మ ఇంటిని ఆ కుటుంబానికి కేటాయించాలి.
  • మైదం మహేష్ ముగ్గురు పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి.
  • రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల అందరిని శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేయాలి.
  • ప్రభుత్వమే పారిశుధ్య కార్మికులందరికీ ఆరోగ్య భీమాను కల్పించాలి.

ఈ నిజనిర్ధారణ బృందంలో సభ్యులు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బదావత్ రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అద్దునూరి యాదగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్, ఉపాధ్యక్షులు హనుమాన్ ప్రసాద్, కార్యదర్శి కర్ణాటక సమ్మయ్య, చంద్రగిరి శంకర్ లు పాల్గొన్నారు.

ములుగు,
05-09-2025.

Related Posts

Scroll to Top