అభూజ్ మద్ ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని ఛత్తీస్ ఘడ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు హోరాహోరీగా జరిగినట్లు చెప్పబడుతున్న ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు బలగాలకు చిన్న గాయం కూడా కాకుండా నక్సలైట్లు మాత్రమే ఇంత పెద్ద ఎత్తునచనిపోవడం చూస్తే దీనిని ‘ఎదురుకాల్పులు’ అని నమ్మటం అసాధ్యం. మావోయిస్టులను లేదా వారి సహాయకులను అనేక ఇతర అనైతిక, చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా చంపేసి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లటం ప్రభుత్వాలు సర్వసాధారణంగా చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పక్షానికే జరిగిన నష్టం చూస్తే అలాంటిదే జరిగిందని మేం బలంగా నమ్ముతున్నాం.

దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి, చత్తిస్గడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ నక్సలైట్లను ఏరివేస్తామనీ, నక్సలైట్లను నిర్మూలిస్తామనీ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అంటే చంపేస్తామనే అర్ధం. అందుకోసం లక్షలాదిమంది భారత సైన్యాలను, పోలీసులను నక్సలైట్ ప్రాంతాల్లో మోహరించారు. తమకు నచ్చని వారిని చంపేయటం అనే మాఫియా నీతిని ప్రజాస్వామ్య దేశాల్లో పారిపాలకులు కలిగివుండటం, అదే తమ విధానం అని బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, అనైతికం. ఇది నాగరిక సమాజం ఆమోదించదగ్గ విషయం కాదు.

ఎన్కౌంటర్లపై నిజానిజాలు తెలుసుకోవటానికి వెళ్లే ఛత్తీస్ ఘడ్ హక్కుల సంఘాలను గానీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే హక్కుల సంఘాలను గానీ పాలకులు అనుమతించడం లేదు. వారు చేసే ఎంకౌంటర్లు, చేసే ప్రచారం యదార్థమైనవే అయితే హక్కుల సంఘాలను అడ్డుకోవాల్సిన పనిలేదు. అయినా అడ్డుకుంటున్నారంటే వారి ప్రచారంలో వాస్తవాలు లేవనీ , వారు చేసే ఎన్కౌంటర్లు దారుణమైన హత్యలనీ అర్ధం తప్ప మరొకటి కాదు.

  • 31 మంది చనిపోవడానికి కారణమైన శుక్రవారం నాటి ఎన్ కౌంటర్ ను మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
  • ఈ ఎన్కౌంటర్ కు బాధ్యులైన పోలీసు అధికారులందరి మీద హత్యా నేరం మోపి విచారణ జరిపించాలి.
  • ఇలా నక్సలైట్లను వెతుకుతూ, వేటాడి చంపడం అనే అనాగరిక విధానాన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
  • మధ్య భారతంలోని వనరులను కొల్లగొట్టడం కోసం స్ధానిక ఆదివాసీ జీవితాలను చిన్నాభిన్నం చేసే హక్కు తమకు లేదనే విషయం పాలకులు గ్రహించాలి.
  • సాయుధ మావోయిస్టుల విషయంలో రాజకీయ, రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామ్య విధానాలను మాత్రమే అనుసరించాలని మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.

– మానవ హక్కుల వేదిక, ఉభయ రాష్ట్రాలు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం,
హైదరాబాద్,
06.10.2024.

Related Posts

Scroll to Top