ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని, నిరసిస్తున్న స్థానికుల పైన క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని హెచ్.ఆర్.ఎఫ్ ఖండిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని నిరసిస్తూ, అదే రోజు పెద్ద హరివాణం గ్రామ ప్రజలు స్పందించి, హెచ్. ఆదినారాయణ నాయకత్వంలో రోడ్డుపై రాస్తారోకో చేయడంతో, ఇస్వి పోలీసులు ఆయనతోపాటు, ఏడుగురిని ముందుజాగ్రత్త చర్య పేరు మీద అదుపులోకి తీసుకొని, వారిపై ప్రజల భద్రతను కారణంగా చూపి క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కొరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా ఎనిమిది జిల్లాల ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళారో, లేదో తెలియదు. ఆదోని ప్రజలను కలవడానికి వస్తున్నట్టుగా ప్రకటించి, తమ పర్యటనను రద్దుచేసుకొనడం జరిగింది. అటువంటి సందర్బంగా ప్రజలు స్వచ్చందంగా రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలపడాన్ని, పోలీసులు ప్రభుత్వం నిర్ణయాన్ని అడ్డగించడం భావించడం విడ్డూరంగా ఉంది. వారు కేసును నమోదు చేసిన వారిలో ఆదినారాయణతోపాటు, బింగి కరియప్ప, రేణుక ఆచార్య స్వామి, వీరేష్, గర్జప్ప, తిమ్మప్ప, మధు సూదన్ లు ఉన్నారు.

రాయలసీమలో కర్నూలు జిల్లా పడమటిప్రాంత ప్రజల గోడును చెప్పుకోవడానికి లేకుండా చేశారు. వర్షాధారమైన ఈ ప్రాంతానికి బచావత్ ట్రిబ్యునల్ నికరజలాల కేటాయింపు ఉన్నా, రాజోలిబండ కుడికాలువ ప్రాజెక్ట్ ను పాలకులు మూడు దశాబ్దాలుగా నేటికి ముగించకపోవడం వల్ల, మెజారిటీ గ్రామాల ప్రజలంతా, ఊళ్లను వదలి వలసపోతున్న పరిస్థితి. ఆదోనిని జిల్లా చేస్తేనన్నా తమ పరిస్థితి మారుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన ప్రజలు తమ నిరసనను తెలిపే హక్కును కాపాడుతూనే, ఆదోని ప్రజల గోడును వినిపించుకొని, మా ప్రాంత అభివృద్ధికోసం ప్రజల ప్రతిపాదనలను వినాలని, నిరసన తెలిపారనే సాకుతో పెట్టిన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

యు. జి. శ్రీనివాసులు (HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు)
కె. ఉరుకుందప్ప (HRF కర్నూలు జిల్లా అధ్యక్షులు)

09.11.2025,
ఆదోని.

Related Posts

Scroll to Top