అదుపు తప్పుతున్న మతోన్మాద సంస్కృతికి సంకేతమే రంగరాజన్ పై దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేశారు. తమని తాము శ్రీరాముని వంశానికి చెందినవారమని చెప్పుకున్న వారు, రామరాజ్య స్థాపన కోసం మాకు ఆర్థికంగా సహాయం చేయాలని, మేము ఏర్పాటు చేసుకున్న శ్రీరామ సైన్యంలోకి ఇక్ష్వాకు వంశస్తులను ఎంపిక చేసి రిక్రూట్ చేయించాలని రంగరాజన్ గారిని డిమాండ్ చేసి, దానికి ఆయన నిరాకరించినందుకు ఆయనపై భౌతిక దాడి చేశారు.

ఈ దాడిని హిందుత్వ సంస్థలు, హిందుత్వ పార్టీ, వారి కోణంలో మాత్రమే ఆలోచించి స్పందించవచ్చు. కానీ చట్టము, రాజ్యాంగము, ప్రజాస్వామ్యం వంటి ఏ దృష్టితో చూసినా ఇది చాలా తీవ్రవాద స్వభావం కలిగిన, హేయమైన దాడి. తన మానాన తను రాజ్యాంగానికి లోబడి ఆలయాన్ని నిర్వహించుకుంటున్న పూజారి మీద ఇలా దాడి చేయటం అన్యాయం, అనాగరికం. ఈ దాడిని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

ఇంత బహిరంగంగా ఒక ప్రత్యేక యూనిఫాంలో వచ్చిన ప్రైవేటు సైన్యం నగరంలో తిరుగుతూ కొన్ని గంటలపాటు రద్దీగా ఉండే ఒక ఆలయ పూజారి స్వంత ఇంట్లోనే ఆయనను బంధించి, భౌతిక దాడి చేసి సులభంగా తిరిగి వెళ్ళిపోతున్నదంటే ఈ దేశము, రాష్ట్రము హిందూ మతోన్మాద వేషధారణతో తిరిగే మనుషులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో అర్థమవుతుంది. ఈ దాడి చేసినవారి వివరాల్లోకి వెళితే సభ్య సమాజం కలవరపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ దాడి చేసిన వీర రాఘవరెడ్డి “రామరాజ్యం” అంటూ ప్రైవేటు సైన్యంతో కూడిన సంస్థను స్థాపించి ఎప్పటికప్పుడు తన వీడియోల ద్వారానే పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. కేవలం సమాచారం మాత్రమే కాదు న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థలకు, కలెక్టర్లకు, డీజీపీలకు మీ అధికారాన్ని బద్దలు కొడతామని ఆయన బహిరంగంగా సవాళ్లు విసురుతూనే ఉన్నాడు. అయినా పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ అతనిపై ఈ విషయంలో చిన్న చర్య కూడా తీసుకోలేదు. అంతులేని రాజ్యాంగబద్ధ, రాజ్యాంగ రహిత అధికారాన్ని కలిగిన ఈ వ్యవస్థలే ఇన్నేళ్లపాటు ఇటువంటి వాళ్లకు భయపడి మమ్మల్ని కాదులే అని కళ్ళు, చెవులు మూసుకుంటుంటే, సమాజంలో అటువంటి వారి దాడికి గురవ్వగల మైనారిటీల, బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి? ఈ వ్యవస్థలు నిజంగానే కళ్ళు మూసుకున్నాయా? లేక వారిని ప్రోత్సహించాయా? అనేదీ అనుమానాస్పదమే.

హిందూ రాజ్య పునస్థాపన కోసమే అంటూ ఇంతకాలం అనేక సంస్థలు సృష్టించిన భావజాల వాతావరణం, విశృంఖల వాతావరణం ఈరోజు ఇటువంటి సైన్యాలను తయారు చేశాయి. అదే ఉన్మాదం ఇవ్వాళ అదుపు తప్పి తన తోటి హిందూత్వ ప్రతినిధి పైననే దాడి చేసింది. ఇది పాత పురాణ కథలోని భస్మాసుర హస్తం లాగా మారిపోయింది. ఆ కథలో శివున్ని కాపాడటానికి మహావిష్ణువు వచ్చి ఉండవచ్చు. ఇప్పటి సమాజంలో అలా ఎవరూ రారు. ఇటువంటి వాళ్ళ నుండి రక్షణ కోసం ఇంతకంటే పెద్ద ఉన్మాదిని ఆశ్రయించటం పరిష్కారం కాదు. ఒకే మతంలోని భిన్న శాఖలు, గుంపులు అనేక ప్రైవేట్ సైన్యాలను ఏర్పరచుకునే సంస్కృతి ఈ దేశంలో పెరుగుతున్నది. అందరినీ మింగేసి ఒకే ఒక కార్పొరేట్ ఉన్మాది చేతిలోనే దేశం నడవడం కూడా దీనికి పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరూ వ్యక్తులుగా, సంస్థలుగా ప్రజాస్వామ్య సంస్కృతి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండటమే పరిష్కారం.

భవిష్యత్తులో ఈ ఉన్మాద మతతత్వ భావజాలాల, సైన్యాల ఫాసిస్టు సంస్కృతి సమసి పోవాలి.

  1. రంగరాజన్ గారి మీద జరిగిన దాడికి పాల్పడ్డ వ్యక్తులకు శిక్షలు పడేటట్లు చేయడమే కాదు, అందుకు వారిని ప్రేరేపిస్తున్న సామాజిక వాతావరణాన్ని కూడా ప్రభుత్వాలు నియంత్రించాలి.
  2. ఇవాళ దాడికి గురైన రంగరాజన్ గారి మీద కనీసం రాష్ట్ర భవిష్యత్తు పరిధిలో చాలా బాధ్యత ఉంది. వారు, వారి లాంటి హిందూ ధర్మం సరైనదే అని నమ్మి ఆచరిస్తూ, బోధించేటువంటి వ్యక్తులు ఆ విషయాలను ఆధ్యాత్మికత రంగానికీ, పౌరుల వ్యక్తిగత విశ్వాసాలకూ పరిమితం చేసి, మిగతా సామాజిక జీవనంలో రాజ్యాంగ స్పూర్తికి లోబడి మాత్రమే వ్యవహరిస్తామని నిర్ణయించుకోవాలి. సమాజమూ అలాగే చేయాలని బోధించాలి. హిందూ ధర్మ రక్షణ పేరుమీద రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక తత్వానికి, ప్రజాస్వామ్య, సౌభ్రాతృత్వ భావనలకు విరుద్ధంగా పనిచేసే సంస్థలతో సహజీవనం చేయకూడదని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం.
  3. కనీసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోనైనా ప్రభుత్వాలు రాజ్యాంగేతర పరిభాష మాట్లాడి, మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే, అది హిందూ మతం పేరు మీద చేసినా, మరే మతం పేరు మీద చేసినా, వారికోసం ప్రత్యేక చట్టాలు చేసి, వారిని కట్టడి చేయాలి.

11-02-2025,
మానహ హక్కుల వేదిక (HRF) ,
తెలంగాణ రాష్ట్ర కమిటీ.

ఆత్రం భుజంగరావు (అధ్యక్షుడు)
డా ఎస్. తిరుపతయ్య (ప్రధాన కార్యదర్శి)

Related Posts

Scroll to Top