ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులందరూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ ఈ దేశాన్ని వివక్ష, అసమానతలు, హక్కుల ఉల్లంఘన లేని దేశంగా చూడాలని కలలు కన్నారు. రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ ప్రాథమిక హక్కులను, మైనారిటీలకు మత స్వేచ్ఛను, అణగారిన కులాల ప్రజలకు రాజకీయ, విద్యా, ఉద్యోగపరమైన రిజర్వేషన్లను అందించడంలో అంబేద్కర్ కీలక భాగస్వామిగా ఉన్నారు. మహిళలను హిందూకోడ్ బిల్లు ద్వారా సాంప్రదాయ అర్థ బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయాలని కలలు కన్నారు. దేశంలో అసమానతలు, అణచివేతలు అంతమొందటానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పడ్డ ఆరాటం చాలా గొప్పది. వారి జీవితం నిరంతర స్ఫూర్తిదాయకం.
69 వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వారిలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. అచ్యుత్ కుమార్, సభ్యులు మారముల్ల కిరణ్, చైతన్య, సదానందం, సమ్మయ్య, కొత్తూరి కుమార్ లు ఉన్నారు.
ఈ సందర్భంగా అనంతపురంలో జరగబోయే మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభల కరపత్రాలను రేగొండ మండల వ్యవసాయ అధికారి జి. క్రాంతి కుమార్ ఆవిష్కరించారు.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జమ్మికుంట,
06/12/2024