మలికిపురం మండలం కేశనపల్లి సి సి ఎఫ్ సొసైటీ నందు 10-12-2025 న రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి ఆధ్యర్యంలో జరిగిన సమావేశం సమితి ప్రధాన కార్యదర్శి మందా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ ప్రసంగించారు.
హక్కులు రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన వాటంతట అవే అమలు కావని, రాజ్యాంగబద్ధంగా అవగాహన పెంచుకుని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరి పైన ఉందని ఏడిద రాజేష్ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యతలను విస్మరిస్తే, సమాజంలో అసమానతలు మరింత పెరిగి, చట్టబద్ధ పాలన అస్తవ్యస్తమయ్యే పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు. ప్రతి మనిషికీ ఒకే విలువ అనే ప్రాతిపదికనే ఐక్యరాజ్యసమితి ఏభై దేశాల ప్రాతినిధ్యంతో మానవ హక్కుల ప్రకటన ని చేసింది అన్నారు. ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ సమాజంలో హక్కుల ఉల్లంఘన రోజురోజుకీ పెరుగుతోంది. మనుషుల్ని కులాల పేరిట, మతాల పేరిట విడదీసి విద్వేషాన్ని రెచ్చగొట్టే భావజాలం ప్రాబల్యాన్ని సంతరించుకుంది. ఇది మొత్తంగా సమాజానికే నష్టదాయకం. దీనిని నిలువరించడంలో మనమందరం భాగస్వాములు అయ్యి, వ్యతిరేకించాలని అన్నారు.
ఈ సమావేశంలో చైతన్య సమితి అధ్యక్షులు నల్లి ప్రసాద్, పారా సంస్థ బాధ్యులు థామస్ పల్లిథానం, సి సి ఎఫ్ సొసైటీ అధ్యక్షులు తాడి ఆనందరావు, వైస్ ప్రెసిడెంట్ దేవ రాందాస్, ఎడ్ల శ్రీనివాస్, తాడి శివాజి, పమ్మి రత్నంరాజు, బీఎస్పీ నాయకులు ఆకుమర్తి భూషణం, జనుపల్లి సత్యానందం, గంటా బాలాజీ, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనువాసరావు, పి పవన్, చవ్వాకుల వెంకట్, రాచెల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు
10-12-2025,
మలికిపురం.