అటవీ శాఖ అధికారులు అజం నగర్ శివారులో పోడు చేసుకుంటున్న కుటుంబాల పై చేసిన దాడిని ఖండిస్తున్నాం

20 ఫిబ్రవరి 2025 గురువారం నాడు అటవీ అధికారులు అజం నగర్ శివారులో పోడు చేసుకుంటున్న సుమారు 11 కుటుంబాలపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన సంఘటన ను మానవ హక్కుల వేదిక ఖండిస్తూ ఉన్నది.

ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం అటవీ అధికారుల దాడికి గురైన ఆజాంనగర్ గ్రామస్తులను కలిసి వాస్తవాలను సేకరించటం జరిగింది.

గత 35 సంవత్సరాల గా వారు పోడు చేసి సాగు చేసుకుంటున్న భూములపై సుమారు 150 మంది అటవీశాఖ పోలీసులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో పట్టెం శారద పొదిల శ్రీను లు తీవ్రంగా గాయపడ్డారు. శారద ఆ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ  కోల్పోయింది. పొదిల శ్రీనును లాఠీలతో విపరీతంగా కొట్టి గాయపరిచారు. ఇంత చేసి వాళ్లు చేసిన నేరం ఏమిటంటే వారు గత 35 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములలో కందకాలు తీసి వ్యవసాయాన్ని కొనసాగకుండా చేయడానికి జెసిబి లతో వచ్చిన అధికారులను అడ్డుకోవటమే.

అక్కడ సాగు చేసుకుంటున్న కుటుంబాలలో అందరూ గుంట భూమి లేని అత్యంత వెనుకబడ్డ, దళిత కుటుంబాల వారే.

వివరాల్లోకి వెళితే గత  రెండు సంవత్సరాలుగా డి.ఆర్ఓ. గా పనిచేస్తున్న అధికారి అయిన ఉష గారు సుమారు 30 ఎకరాల పోడు భూమిలో పత్తి సాగు చేయడానికి గత సంవత్సరం చివర్లో సుమారు 5 లక్షల రూపాయలను తీసుకున్నదని, ఆమెకు డబ్బులు ఇచ్చిన తర్వాతే మేము పత్తి పంట పెట్టుకున్నామని వారు చెబుతున్నారు. అంతకుముందు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నప్పటికీ ట్రాక్టర్లతో భూమి దున్నటానికి మాత్రం ఆమెకు డబ్బు  ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత అదనంగా ఇంకా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ 11 కుటుంబాలను ఆమె డిమాండ్ చేయడం వల్ల సమస్య తలెత్తింది. ఆమె అడిగిన అదనపు సొమ్మును ఇవ్వటానికి నిరాకరించటం వల్ల కక్షగట్టిన అధికారి గురువారం నాడు సుమారు 150 మంది అధికారులతో, పోలీసులతో వచ్చి ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. అడ్డగించిన రైతులను కిందపడి వేసి అధికారులు బూట్లతో తన్ని, తొక్కి గాయపరిచారు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి దాడి ఎంత మాత్రమూ సహించరానిది. మానవీయ కోణంలో చూసినప్పుడు అత్యంత హేయమైన చర్యగా మానవ హక్కుల వేదిక భావిస్తూ ఉన్నది.

మా డిమాండ్లు:

  1. దాడి చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
  2. గ్రామస్తులు అక్రమంగా సాగు చేసుకుంటున్నారని అధికారులు భావిస్తే వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి వివరణ ఇవ్వడానికి సమయం ఇచ్చిన తరువాతే చర్యలు తీసుకోవాలి.
  3. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి  సేకరించిన సమాచారం మేరకు నిర్ధారణ చేసుకొని  పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలని ఇవ్వాలి.
  4. గాయపడ్డ పట్టం శారద, పొదిల శ్రీను లకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
  5. వారిద్దరికీ ప్రభుత్వం తక్షణం లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
  6. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూములన్నింటికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి.

మా మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతియ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి దిలీప్, సభ్యులు హనుమాన్ ప్రసాద్ కర్ణాటక సమయ చంద్రగిరి శంకర్ లు పాల్గొన్నారు.

23-02-2025,
భూపాల పల్లి.

Related Posts

Scroll to Top