ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామంలో చెట్టు పట్టా లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్న ఇరిగేషన్ యంత్రాంగం, ఆధిపత్య కులాల రైతులు.

లొల్ల గ్రామంలో 1987-88 లో చెట్టు పట్టా పొందిన ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలను ఈ రోజు నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం కలిసి వివరాలను సేకరించింది. లొల్ల గ్రామంలో కాలవ గట్టు ప్రాంతంలో తమకు కొబ్బరి చెట్లు పెంచుకోవడానికి పట్టా ద్వారా కేటాయించిన స్థలాలను గట్టుని ఆనుకొని ఉన్న రైతులు ఆక్రమించి పాకలు, రేకు షెడ్డులు నిర్మించుకొని తమను అడ్డుకొంటున్నారని వారు వాపోయారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సంవత్సరాల నుండి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నప్పటికీ రాజకీయ, కులపరమైన ఒత్తిళ్లకు తలొగ్గి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని వారన్నారు. జిల్లా కలెక్టర్ కి చేసిన ఫిర్యాదుకు కూడా ఎలాంటి స్పందన లేదని బాధ పడ్డారు.

గ్రామాలలో బలహీన వర్గాలలో పేదరికాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో అప్పట్లో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ది దారుడు నిర్దేశించిన స్థలంలో 60 కొబ్బరిచెట్లను పెంచుకోవడానికి ప్రభుత్వమే ధన సహాయం చేసేది. ఆ చెట్లను సంరక్షించుకొంటూ ఫల సాయం అనుభవించే హక్కు లబ్ధిదారులకుంటుంది. ఇది ఆనువంశికం కూడా. అయితే లొల్ల గ్రామం లో కాలవ గట్టున పట్టాలున్న దిగుమర్తి రాజారావు, దువ్వ స్వామయ్య, గాలింకి నాగేశ్వర్రావు, గాలింకి సుబ్బారావు, సవరపు యేసేబు, రాయి నాగేశ్, పసలి సత్తయ్య, తానింక అమృతరావు ల కుటింబీకులను చెట్లు సంరక్షించుకోనీకుండా తమ రాజకీయ, కుల ప్రాబల్యంతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు పట్టా చట్ట ప్రకారం అమలయ్యేలా చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ రవి, జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇక్బాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శనం పాల్గొన్నారు.

ఎ రవి, 9949294256
వై రాజేష్, 9966631796
మొహమ్మద్ ఇక్బాల్, 9848485961

27-09-2025,
ఆత్రేయపురం.

Related Posts

Scroll to Top