బాపులపాడు మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పై విచారణ

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామమలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ బయో ఫ్యూయెల్స్ వారి ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలు అనుసారం ఈ రోజు బాపులపాడు మండల రెవెన్యూ అధికారి గారు క్షేత్రస్థాయి పరిశీలన/విచారణ చేపట్టారు.

కొన్ని నెలల క్రితం గ్రామ ప్రజలు, మానవ హక్కుల వేదిక (HRF) ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ పరిశ్రమ నిర్మాణం నిలుపదల చేయమని ఫిర్యాదు చేయడం జరిగినది. వీరవల్లి ఛానల్ 1 సమీపంలో, ఆ ఛానల్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఒడ్డున, పంట పొలాల మధ్యన, సరైన నీటి వసతి కూడా లేకుండా ఈ పరిశ్రమ నిర్మిస్తున్నారని, ఇది తీవ్ర కాలుష్య కారక పరిశ్రమ అయినందున ఇటువంటి పరిశ్రమలని ఊర్లలో, పంట పొలాల మధ్య నిర్మించకూడదు అని, గ్రామ ప్రజలకి కనీస సమాచారం కూడా లేకుండా దీని నిర్మాణం మొదలుపెట్టారని, ఇది తీవ్ర కాలుష్యకారకమే కాకుండా చట్ట విరుద్ధమని ముఖ్యమంత్రి గారికి వివరించటం జరిగినది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఆదేశాల ప్రకారం ఈ రోజు, అనగా 07.10.2025 నాడు, బాపులపాడు మండల రెవెన్యూ అధికారి గారు గ్రామానికి వచ్చి, పరిశ్రమ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, ఫిర్యాదుదారులతోనూ, గ్రామస్థులతోనూ, HRF ప్రతినిధులతోనూ మాట్లాడి విషయ సేకరణ చేశారు.

ఈ పరిశ్రమకి వీరవల్లి ఛానల్ 1 నుండి నీటిని కేటాయించారని, అయితే ఆ ఛానల్ లో 4 నెలలు అసలే నీరు ఉండకపోగా, ఇంకొక 4 నెలలు చాలా తక్కువ పరిమాణంలో నీరు ఉంటుంది అని, అటువంటప్పుడు ఈ పరిశ్రమకి నీరు ఎలా కేటాయిస్తారు అని ఫిర్యాదుదారులు తమ అభ్యంతరం తెలిపారు. అదే విధంగా ఈ గ్రామంలో త్రాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి 0.01 టిఎంసి నీటిని కేటాయించగా, ఈ ఒక్క పరిశ్రమకే 0.02602 టిఎంసి నీరు అవసరం అని, కాబట్టి అది సాధ్యపడదు అని గ్రామస్తులు తెలిపారు. అంతే కాక, ఇది కాలుష్యకారక ‘రెడ్’ కేటగిరీ పరిశ్రమ అని, అటువంటి వాటిని ఊర్లలో, పంట పొలాల మధ్య నిర్మించకూడదు అని, అయినా ఇక్కడ పంట పొలాల మధ్య, జిల్లా పరిషత్ హై స్కూల్ కి, ఇళ్లకి అర కిలోమీటరు కన్నా తక్కువ దూరంలో నిర్మిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధం అని తెలిపారు. అదే విధంగా, ఈ గ్రామం సి ఆర్ డి ఏ పరిధిలోని గ్రామమని, జోనింగ్ ప్రకారం కూడా ఇక్కడ పరిశ్రమ నిర్మాణానికి అనుమతి లేదని తెలిపారు. ఈ పరిశ్రమ అనుమతుల ఇప్పటికే లోకాయుక్తలో కేసు కూడా ఉందని తెలిపారు.

మండల రెవెన్యూ అధికారి గారు తన క్షేత్ర స్థాయి పరిశీలలనో తేలిన విషయాలని, గ్రామస్తులు తెలిపిన విషయాలని, అలాగే కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, తదితర విభాగాల వారు ఇచ్చే జవాబులని కలెక్టర్ గారికి సమార్పిస్తానని తెలిపారు.

ఈ విచారణ/పరిశీలనలో గ్రామస్తులు మూల్పూరు వెంకటరత్నం, కోయ రాఘవరావు, ఇతరులు, HRF రాష్ట్ర కార్యదర్శి జి. రోహిత్ పాల్గొన్నారు.

జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)

07.10.2025,
ఆరుగొలను

Related Posts

Scroll to Top