కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన 40 ఏళ్ల బత్తుల మహేందర్ ఎమ్మెస్సీ బీఈడీ చదివి, ఏ ఉద్యోగమూ రాక స్థానికంగా కూల్ డ్రింక్స్ ని హోల్ సేల్ గా సరఫరా చేస్తూ జీవనం గడుపుతున్న చిరు వ్యాపారి. కులం రీత్యా ఎస్సీ మాదిగ. ఈ నెల ఎనిమిదవ తేదీన అతనిపై జరిగిన సైదాపూర్ పోలీసులు అకారణంగా దాడి చేశారు.
లక్ష్మణపల్లి గ్రామం, సోమారం శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా పని మీద వెళ్లి తిరిగి వస్తున్న మహేందర్ ను ఆపారు. ఫోన్ లో మాట్లాడుతూ, పోలీసులకు భయపడటం లేదన్న అహంతో ట్రైనీ సబ్‌ఇన్‌స్పెక్టర్ భార్గవ్ గౌడ్, కానిస్టేబుల్స్ ఆకాశ్ రెడ్డి, రవికుమార్ లు మహేందర్ పై అన్యాయంగా దాడి చేసి కొట్టారు. అతని రెండు చెవులపై బలంగా అనేకసార్లు మోదటం వలన రెండు చెవుల్లో కర్ణభేరీలు పగిలిపోయి రక్తం ధారలు కట్టింది. రెండు చెవులలో ఇప్పుడు వినికిడి శక్తి తగ్గిపోయింది. కండ్ల చుట్టూ, వీపుపైనా ఈ రోజుకీ తీవ్రమైన గాయాలు కనిపిస్తున్నాయి.
రక్తస్రావమవుతున్నా ఆపకుండా కొట్టడమేగాక, అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన మహేందర్‌ను పోలీసులు నిర్బంధించి, బెదిరించి, ఆయన చేతనే అక్రమంగా క్షమాపణ పత్రం రాయించుకున్నారు. ఈ చర్యలు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులనాన్నిటినీ అవమానించే విధంగా ఉన్నాయి. ఈ దౌర్జన్యాన్ని హ్యూమన్ రైట్స్ ఫోరం (HRF) తీవ్రంగా ఖండిస్తున్నది.
ఇది ఎటువంటి యాదృచ్ఛిక లేదా “అపవాద” ఘటన కాదు. ఇది పాలకవ్యవస్థలో మారుతున్న ప్రమాదకర ధోరణికి సంకేతం. ఎన్నికలకు ముందు “రాజ్యనిర్బంధాన్ని అంతం చేస్తాము” అని ఏడవ హామీగా ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ప్రజలపై రెట్టింపు హింసను ప్రయోగిస్తున్న తీరు అత్యంత ఆందోళనకరమైనది. ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను ప్రజలపై దాడికి ఆయుధంగా వాడుకోవటం, అదే అదనుగా పోలీసులు ఇష్టారాజ్యంగా, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ పౌరుల గౌరవాన్నీ, హక్కులనూ కాలరాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా భావించవలసి వస్తుంది.
ఈ దాడి మానవ హక్కుల పైననే కాక, రాజ్యాంగ విలువలపై, సామాజిక న్యాయంపై, ప్రజాస్వామ్య సాంప్రదాయంపై కూడా దాడి. పోలీసు వ్యవస్థలో ఇంకా పూర్తిగా కూడా కుదురుకోని ట్రైనీ ఎస్సైనే ఈ స్థాయిలో దౌర్జన్యం చేయగలిగాడంటే అది అతని విపరీత మానస్తత్వమా లేక పోలీసులు ఏం చేసినా చెల్లుతుందని ఊహించుకుంటున్నాడో అతని పైస్థాయి అధికారులే చెప్పాలి. అతనిపై ఏ చర్యా తీసుకోకపోతే దాన్ని పోలీసు వ్యవస్థ చేసిన దౌర్జన్యంగా పౌర సమాజం భావిస్తుంది.
ఈ రోజు హ్యూమన్ రైట్స్ ఫారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిళ్ల రంజిత్ కుమార్ మరియు వేదిక సభ్యులు కొయ్యడ కొమరయ్య, ముక్కెర సంపత్, కన్నూరి సదానందం, బిక్షపతి, సమ్మెట అచ్యుత్ లతో కూడిన నిజ నిర్ధారణ బృందం గొల్లగూడెం లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. బాధితుడి ఒంటిపై ఉన్న గాయాలను, మెడికల్ రిపోర్టులను, వాంగ్మూలాలను స్వీకరించి ఇది కచ్చితమైన హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తూ, ఈ దుర్ఘటనపై రాష్ట్ర మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్లకు, ఎస్సీ ఎస్టీ కమిషన్లకూ అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ఇది ఒక స్పష్టమైన రాజ్యహింస చర్యగా, ఎస్సీ ఎస్టీ అత్యాచార పరిధిలోకి వచ్చే నేరంగా నిర్ధారిస్తున్నాము.
హ్యూమన్ రైట్స్ ఫోరం డిమాండ్లు:
- బాధితుడు మహేందర్‌కు తక్షణ వైద్యసహాయం, న్యాయ పరిరక్షణ కల్పించాలి.
- జిల్లా ఉన్నతాధికారులు వెంటనే కల్పించుకొని SI భార్గవ గౌడ్, కానిస్టేబుల్స్ ఆకాశ్ రెడ్డి, రవికుమార్ లపై క్రిమినల్ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలి.
- ట్రైనీ ఎస్ఐ ని, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, ఘటనపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ తరఫున ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నేరం కింద న్యాయపరమైన పరిహారం బాధితుడికి ప్రకటించాలి.
- భవిష్యత్తులో అతనికి లేదా అతని కుటుంబానికి ఎటువంటి బెదిరింపులు లేకుండా భద్రత కల్పించాలి .
పందిళ్ళ రంజిత్ కుమార్
మానవ హక్కుల వేదిక
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
మానవ హక్కుల వేదిక తెలంగాణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
20.05.2025,
హుజురాబాద్