ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల భూదాన్ కాలనీలో గత 12 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దాదాపు రెండు వేల కుటుంబాలకు చెందిన పట్టణ కార్మికుల నివాసాలను ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా కూల్చివేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
తేదీ 24 ఫిబ్రవరి 2026 న భూదాన్ భూముల్లో ఏర్పాటు చేసుకున్న సుమారు 800 నివాసాలను తెల్లవారి ఆరు గంటలకు అకస్మాత్తుగా సుమారు 2000 మంది పోలీసులను మోహరించి, 50 బుల్డోజర్ లతో కూల్చివేసి 800 కుటుంబాలను రోడ్డుపాలు చేసిన ప్రభుత్వ దురాగతాన్ని వర్ణించటానికి మాటలు సరిపోవు. అతి సామాన్యులపై రాజకీయ, ఆర్థిక బలం ఉన్న స్వార్థపరులు అధికార యంత్రాంగం తోడ్పాటుతో చేసిన దారుణ అత్యాచారం ఇది.
ఈ భూమి నిజానికి ప్రభుత్వ భూమి కూడా కాదు. భూదాన్ ఉద్యమంలో భాగంగా భూములను పేదలకు కేటాయించే నిమిత్తం దానం చేయబడిన ఒక ట్రస్టుకు చెందినది. ఆ భూదాన భూముల ట్రస్టు 2014 లో ఇళ్లు లేని పేదలకు ప్రతి ఒక్క కుటుంబానికి 100 గజాల చొప్పున కేటాయిస్తూ లేఅవుట్ ను చేయించి , భూదాన పత్రాలు ఇచ్చింది. అటువంటి ప్రతీ పత్రం కాపీని రెవెన్యూ అధికారులకు కూడా పంపించి, తగు చర్యలు తీసుకొని చట్టబద్ధంగా ఈ భూమిపై వారికి శాశ్వత నివాస పట్టాలు ఇవ్వాలని కూడా కోరింది. వారి కోర్కెలను కానీ తీర్మానాలను కానీ భూదాన్ భూముల పైన వారికి గల ప్రత్యేక అధికారాలను గాని ప్రభుత్వం పట్టించుకోకుండా 2014 నుంచి నివాసం ఉంటున్న వారి ఇళ్లను దారుణంగా కూల్చి వేయటం రాజ్యాంగబద్ధంగా వారికి గల నివాస హక్కులను కాలరాయటమే. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా హక్కు కూడా లేని భూదాన్ భూముల్లో వాళ్ళు నివసిస్తూ ఉంటే, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం స్వయంగా ఇల్లు కట్టించాల్సింది పోయి, కేసు హై కోర్టులో ఉన్నప్పటికీ, నివాసితులకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, వారి పైన అకస్మాత్తుగా దాడి చేసి, వారి వస్తు సామాగ్రిని తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చి వేయటం నాగరిక ప్రభుత్వం చేయాల్సిన పనేనా?
ఇలా ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా వారి ఇళ్లపై దాడి చేయటం ప్రభుత్వం చేసే పనిలాగా లేదు. ఇది, పేదల భూమిని బలవంతంగా లాక్కునే భూ మాఫియాకు కావలసిన పనిని ప్రభుత్వం చేసిపెట్టినట్టుగా ఉంది. ఇలా అకస్మాత్తుగా రోడ్లపై పడ్డ కుటుంబాలు నిలవడానికి నీడలేక, వండుకొని తినటానికి అవకాశాలు లేక చెట్ల కింద బ్రతకాల్సిన స్థితికి ప్రభుత్వం వారిని నెట్టి వేసింది.
మా డిమాండ్లు:
- ప్రభుత్వం బ్రేషరతుగా తన చర్యకు పశ్చాత్తాపం ప్రకటిస్తూ కూల్చివేసిన ఇళ్ల స్థానాలలో బాధితులకు కొత్త ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి.
- కూల్చివేతలో భాగంగా నష్టపోయిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడం కోసం మరియు పునరావాస అవసరాల కోసం ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి.
- భూదాన్ యజ్ఞ బోర్డ్ సూచించిన ప్రకారం ప్రతి కుటుంబానికి వంద గజాల భూమిని రిజిస్టర్ చేసి ఇవ్వాలి.
- ఆ కాలనీ పునర్నిర్మించి వారికి కావలసిన కరెంట్, మంచి నీరు, రోడ్లు మొదలగు మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పరచాలి.
- ఈ దారుణానికి కారణమైన భూమాఫియాపై మరియు వారితో అంట కాగిన ప్రభుత్వ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
— డాక్టర్ ఎస్. తిరుపతయ్య
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవ హక్కుల వేదిక)
ఈ నిజ నిర్ధారణ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బాధావత్ రాజు, ఖాదర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి టి. హరికృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి దిలీప్ గార్లు పాల్గొన్నారు.
01.03.2026,
ఖమ్మం.