బిపిసిఎల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గ్రామాలలో, కావలి మండలంలోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెన్ఆర్ఎఫ్) డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే కనుక స్థానికంగా జరిగే విధ్వంసం చెప్పరానిదిగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో 6000 ఎకరాలలో బిపిసిఎల్ వారి సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్స్ (9mmtpa) చమురు శుద్ధి రిఫైనరి మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు చేస్తుందనే వార్తా కథనాల నేపధ్యంలో మానవ హక్కుల వేదిక (హెన్ఆర్ఎఫ్) బృందం ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 14, 2025 నాడు నిజ నిర్ధారణ చేపట్టింది. గుడ్లూరు మండలంలో చేవూరు, రావూరు, కావలి మండలంలో పెద పట్టపుపాలెం, చెన్నాయపాలెం, పాముగుంటపాలెం, నందెమ్మపురం గ్రామస్తులతో మాట్లాడాము. ఈ గ్రామాలన్నీ కూడా బంగాళాఖాతం, జాతీయ రహదారి 16 మధ్య ఉన్నాయి. మేము ముఖ్యంగా రైతులతో, రైతు కూలీలతో, మత్య్సకారులతో (పట్టపు, పల్లెకారు) మాట్లాడాము.

ఈ మూడు పంచాయతీల ప్రజలకి ప్రధానమైన ఆదాయ వనరు వ్యవసాయం, చేపల వేట. పెద పట్టపుపాలెం ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం 20 అడుగుల లోతులో లభ్యమవ్వడంతో వ్యవసాయం సమృద్ధిగా ఉంది. స్థానిక చెన్నాయపాలెం చెరువు కింద 1000 ఏకరాలకి పైగా ఆయకట్టు ఉంది. ఈ పంచాయతీలలో చెన్నాయపాలెం చెరువే కాకుండా చేవూరు చెరువు, రావూరు చెరువు కూడా ఉన్నాయి. ఈ ఒకొక్క చెరువు కింద 500-1000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో వరి ప్రధానమైన పంట. ఈ గ్రామాలలో మత్స్యకారులతో సహా ఎక్కువ మంది ఆధారపడుతున్నది వ్యవసాయం మీదనే. వరి, వేరుశెనగ ముఖ్యమైన పంటలు. పెద్ద పట్టపుపాలెం గ్రామంలో కూడా అనేక మంది బంగాళాఖాతంలో చేపల వేట మీద ఆధారపడతారు.

ఈ ప్రాజెక్టులో పర్యావరణ, జీవనోపాధుల విధ్వంసమే కాకుండా గ్రామాల విస్థాపన కూడా ఉంది. చెన్నాయపాలెం, పాముగుంటపాలెం, నందెమ్మపురం, శాలిపేట గ్రామాలను పూర్తి విస్థాపనకి గురిచేసే ప్రణాళిక ఉండగా, రావూరు గ్రామం పాక్షిక విస్థాపనకి గురవ్వనుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు సరిహద్దు పక్కనే 12 గ్రామాలు ఉండగా, కనీసం 10కి పైగా గ్రామాలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎల్కేరు నది ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా, బకింగ్ హాం కాలువ కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాలన్నీ కూడా జన సాంద్రత ఎక్కువగా ఉన్నవి, అలాగే వ్యవసాయం, చేపల వేట మీద పూర్తిగా ఆధారపడిన గ్రామాలు.

ఈ గ్రామాలలో ప్రజలు తాము ఈ ప్రాజెక్టుకి పూర్తిగా వ్యతిరేకం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్, దాని కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్యం, ప్రాజెక్ట్ కోసం జరిగే భూ సేకరణ కారణంగా తమ ఆర్థిక జీవితం శాశ్వతంగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధులు పూర్తిగా ధ్వంసం అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. కొన్ని గ్రామాలలో అయితే ఈ ప్రాజెక్ట్ కారణంగా తాము విస్తాపనకి గురవ్వాల్సి వస్తుంది అనే కోపం, ఆందోళన ఉన్నాయి.

చేవూరు గ్రామంలో గత ప్రభుత్వం సౌర పలకల పరిశ్రమ పేరు మీద ఇండో సోల్ సోలార్ సంస్థ కోసం 2500 ఎకరాలు సేకరించింది. ఇప్పుడు ఈ భూములన్నీ బిపిసిఎల్ కోసం కేటాయించదలుచుకున్నామని ప్రభుత్వం చెబుతున్నది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఒక ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని మరొక ప్రాజెక్టుకి అందులోనూ అత్యంత ప్రమాదకరమైన, కాలుష్యకారకమైన దానికి- కేటాయించడం ఆమోదయోగ్యం కాదు, కారాదు. ఇప్పుడేమో ప్రభుత్వం పారిశ్రామిక హబ్/ కారిడార్ కోసం భూమిని సేకరిస్తున్నామని చెబుతున్నది. ఈ మొత్తం గజిబిజి, గందరగోళ ప్రక్రియ గురించి ప్రజలకి కనీస సమాచారం కూడా లేదు. ఈ మొత్తం ప్రక్రియ కూడా పూర్తిగా చట్ట వ్యతిరేకం. అలాగే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, అపహాస్యం చేయడం కూడా.

బిపిసిఎల్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ గురించి వార్తా కథనాలు మొదలయినప్పటి నుండి స్థానికులు కలిసికట్టుగా తమ వ్యతిరేకతను తెలియచేస్తూనే ఉన్నారు. జిల్లా అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలలో రైతులు, మత్స్యకారులు ఎప్పటికప్పుడు తమ వ్యతిరేకతను తెలియచేస్తూనే ఉన్నారు.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవడం అవసరం. ఈ ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు 75 శాతం. ఈ పరిశ్రమ కలిపించబోయే శాశ్వత ఉద్యోగాలు మాత్రం నిర్మాణం సమయంలో 400, మొదలయ్యాక 1200. ఇంతోటి ఉద్యోగాలకి, ఈ పరిశ్రమ వస్తే జరిగే విధ్వంసానికి ఏమన్నా సంబంధం ఉందా?

9 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు శుద్ది రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం 6,000 ఎకరాలు తీసుకోవాలనుకోవడం పూర్తిగా ఆక్షేపణీయం. ఉదాహరణకి తమిళనాడు మనాలిలో ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సిపిసిఎల్) 10 mmtpa సామర్ధ్యం కలిగిన రిఫైనరీ విస్తీర్ణం కేవలం 800 ఎకరాలలో ఉంది. అలాగే విశాఖపట్టణంలో 15 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పి సి ఎల్) రిఫైనరీ విస్తీర్ణం దాదాపుగా 900 ఎకరాలే. అదే విధంగా ఒడిశాలోని పరదీప్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇఓసిఎల్) 15 mmtpa రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విస్తీర్ణం 3350 ఎకరాలు. ఇవన్నీ సాపేక్షిక్షంగా తక్కువ విస్తీర్ణంలో ఉండగా, కావలిలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం కోరతున్న భూమి విస్తీర్ణం ఎంతవరకు సబబు? ప్రజల జీవితాలని, వారి భవిష్యత్తుని పణంగా పెట్టి ఇంత భూమి ఎందుకు సేకరించాలి?

కావున, గుండ్లూరు, కావలి మండలాలలో బిపిసిఎల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని హెచ్ఎర్ఎఫ్ డిమాండ్ చేస్తున్నది.

వై. రాజేష్ – హెచ్ఐర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎ. రవి – హెచ్ఐర్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జి. రోహిత్ – హెచ్ఐర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ఎండి. ఇక్బాల్ – హెన్ఆర్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సభ్యులు

14-09-2025,
నెల్లూరు.

Related Posts

Scroll to Top