బ్రతుకుతెరువు కోసం కౌతాళం మండలం, సుళకేరి గ్రామం నుండి వచ్చి ఆదోని, క్రాంతి నగర్లో నివాసం ఉంటున్న దళిత మైనర్ బాలిక పట్ల అదే కాలనీకింద చెందిన కురువ అరవింద్, అభ్యంతరకరంగా ప్రవర్తించడమే కాకుండ, ఆమె తండ్రి ప్రకాష్ పై అతని స్నేహితుడి తో కలసి తాగి, ఇంట్లో నిద్రిస్తున్న అతన్ని, ఇంటి బయటకులాక్కొని వచ్చి కులదూషణకు పాల్పడి, అవమానించడమే కాకుండ, భౌతిక దాడికి గురిచేయడాన్ని మానవ హక్కుల వేదిక, IFTU, రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. మూడు సంస్థల భాద్యులు భాధిత కుటుంబాన్ని, ఆదోని టూ టౌన్ పోలీసులను, డిఎస్పీని కలవగా ఈ కింది వాస్తవాలు వెల్లడించడం జరిగింది.
ప్రకాష్ కాయగూరల మార్కెట్లో అల్లంకొని బండిమీద ఊరంత అమ్ముకుంటూ, చిన్న కూతురు మహిమను ఆర్ సి యం స్కూల్లో పదోతరగతి చదువిస్తూ, పెద్ద కూతురు మైనర్ బాలిక (17), బాబు ప్లాజా దగ్గర రెడిమేడ్ దుస్తులు అమ్మే దుకాణంలో పనిచేస్తోంది. క్రాంతినగర్ కాలనీకే చెందిన కురువ అరవింద్ 27 ఆగస్టు తేది సాయంత్రం 4గంటలకు ఉద్దేశ్యపూర్వకంగా తన బైక్ మీద వేగంగా నడుపుకొంటూ, షాప్ బయట ఉన్న దళిత మైనర్ బాలిక మీదకు పోనిచ్చి, గట్టిగా హారన్ కొట్టి ఇఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఆకస్మిక స్థితి నుండి కోలుకొన్న ఆ బాలిక కోపంతో ” ఛస్తావ్ “అన్న నేరానికి, అతను నోటికి వచ్చినట్టు కులం పేరుతోతిట్టి, “ఇంటి దగ్గర రచ్చ రచ్చ చేస్తానని” బెదిరించడం జరిగింది. అదే రోజు రాత్రి 8 – 9 గంటల మధ్యలో అరవింద్ తాగి, బాడుగ ఇంట్లో నివాసం ఉంటున్న ప్రకాష్ భార్యతో వేలు చూపుతూ, నీ మొగుడు ఎక్కడ? అని ఏకవచనంతో సంభోధన చేయగా, అక్కడే ఉన్న, ఇంటి ఓనర్ భార్య మల్లేశ్వరి మర్యాదగామాట్లాడమని చెప్పడంతో అక్కడి నుండి అతను వెళ్ళిపోయాడు. ప్రకాష్ కుటుంబం నలుగురు కలసి తమ ఇంటికి సమీపంలో నివాసం ఉన్న అరవింద్ ఇంటికి వెళ్లి, అతని తల్లికి జరిగిన విషయం చెప్పగా, ” మా వాడిదే తప్పు, వదిలేయండని ” బతిమాలు కుంది. దాంతో వారు ఇంటికి తిరిగి వెళుతుండగా, అరవింద్ షర్ట్ విప్పి ప్రకాష్ మీదకు రాగా, అతని మిత్రులు అడ్డుకోవడం జరిగింది. ప్రకాష్ కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అరవింద్, తన స్నేహితుడు షేక్ షావలితో కలసి వెళ్లి తాగిన స్థితిలో మొదటి అంతస్థులో ఇంట్లో నిద్రిస్తున్న ప్రకాష్ ను కిందకు లాక్కొని వచ్చి, నోటి కొచ్చినట్టు అవమానకరంగా బూతులు తిట్టి, కొట్టడం జరిగింది.
బతుకు తెరువు కోసం వలస వచ్చిన దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలికను పనిచేసే ప్రదేశానికి అరవింద్ వెళ్లి, అకతాయిగా ప్రదర్శించడమే కాకుండ, ఆమెను నోటికొచ్చినట్టు తిట్టి, బెదిరించడం తీవ్రమైన విషయంగా మేం భావిస్తున్నాం. ఇదేమని ప్రశ్నించిన ఆమె తండ్రి ప్రకాష్ పై అరవింద్, స్నేహితుడు షేక్ షావలి కలసి తాగి వెళ్లి కుల దూషణకు, భౌతిక దాడి జరిపారని ఆదోని టూ పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు వేగంగా స్పందిచక పోగా, వన్ టౌన్ పరిధి కిందకు వస్తుందని చెప్పి కాలయాపన చేయడంవల్ల, వారు డిఎస్పీ గారిని కలవాల్సిరావడం శోచనీయమైన విషయం. డిఎస్పీ హేమలత 2 టౌన్ పోలీసులకు ఫోన్ చేసి, ఫిర్యాదును తీసుకోమని, నేరం కొనసాగింపును దృష్టిలో పెట్టుకొని కేసును నమోదు చేయమని చెప్పారు.
కావున దళిత మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించి, ఇదేమని ప్రశ్నించిన ఆమె తండ్రి ప్రకాష్ ను కులదూషణకు, భౌతికదాడికి పాల్పడిన అరవింద్, అతని స్నేహితుడు షేక్ షావలిపై 2 టౌన్ పోలీసుల ఉదాసీన వైఖరి మానుకొని, ఇప్పటికైనా నిందితులపై ఎస్సీ ఎస్టీ (అత్యాచారాల నిరోధక ) చట్టం, 1989 కింద కేసును నమోదు చేసి, వారిని వెంటనే అరెస్టుచేసి, మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
U. G. శ్రీనివాసులు, AP HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు.
తస్లీమ్, HRF కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు.
K. నర్సన్న, రాష్ట్ర నాయకులు, IFTU.
K. ప్రసాద్, రాష్ట్ర నాయకులు, రైతు కూలీ సంఘం.
ఆదోని,
01-09-2025.