దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు వినోద్ కుటుంబానికి 50 లక్షల పరిహారం అందచేయాలి

దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో బీహార్ వలస కార్మికుని మరణం, అనంతరం జరిగిన ఘర్షణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం ఫ్యాక్టరీకి చెందిన కార్మికులనూ, ఫ్యాక్టరీ ప్రతినిధులనూ కలిసి వివరాల సేకరించింది. కార్మికుల నివాస స్థితిగతులను పరిశీలించింది.

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వినోద్ అనే 42 ఏళ్ల కార్మికుడు, వారికి కేటాయించిన నివాసంలో, ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం అకస్మాత్తుగా పడిపోయి, చనిపోయాడు. వినోద్ చనిపోయాడని అనుమానించిన ఫ్యాక్టరీ సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చనిపోయాడని తెలియగానే పోలీసుల సహాయం కోరారు. కనీసం అతని మరణానికి గల కారణం కూడా తెలియకుండానే పోలీసులు దగ్గర ఉండి, కార్మికుని మృతదేహాన్ని కొంతమంది ఇతర కార్మికులతో పాటు హడావుడిగా అంబులెన్స్ ఎక్కించి బీహార్ కు పంపించేశారు. అతని మరణానికి కారణమేమిటనేది ఈరోజుకీ ఎవరికీ తెలియదు. వందలాదిగా గల తోటి కార్మికులు మృతదేహాన్ని చూడటానికి కూడా కొంతసేపైనా అవకాశం ఇవ్వలేదు. ఎంతో దూరం నుండి బ్రతుకుతెరువు కోసం వచ్చిన సహ కార్మికుడు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు, మృతదేహాన్ని చూసి కనీసం దుఃఖించాలనీ, మృతుని కుటుంబాన్ని యాజమాన్యం (కంపెనీ గాని కాంట్రాక్టర్ గానీ) ఆదుకోవాలని కోరాలనీ ఇతర కార్మికులు తప్పకుండా అనుకుంటారు. యజమానుల సుఖ భోగాలకు కారణమైతున్న కార్మికులు మనుషులు కాదనుకున్నారో, యాజమాన్యపు వ్యాపారానికి చిన్న అవాంతరం కూడా రాకూడదనుకున్నారో పోలీసులు మాత్రం కార్మికులకు ఆపాటి అవకాశం కూడా ఇవ్వలేదు.

దాంతో మరునాడు సోమవారం ఉదయం కార్మికులందరూ కలిసి యాజమాన్యంతో మాట్లాడటానికి ఫ్యాక్టరీ లోపలికి వచ్చారు. కొంతమంది కార్మికులు ఆఫీసు బాధ్యులతో మాట్లాడుతుండగా, మరికొంతమంది బయట గుమి కూడారు. ఇంతలో, అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను ఇవేవీ అడగకుండా నోరు మూసుకుని పనుల్లోకి వెళ్లాల్సిందిగా లాఠీ ఝులిపించటంలిపించడం మొదలుపెట్టారు. ఫలితంగా, కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ఒక పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టారు. అంతకుమించి ఏమీ చేయలేదు. అయినా 14 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. రిమాండ్ కు పంపే ముందు వారినేమైనా కొట్టారా లేదా అనే విషయం చెప్పటానికీ ఎవరూ లేరు. భయోద్రిక్తులైన మిగతా వందలాది మంది కార్మికులు, వారు చేసిన పనికి జీతం కూడా అడగకుండా స్వంత రాష్ట్రానికి పారిపోయారు.

మన రాష్ట్రంలో తమ శ్రమను దారపోయడానికి వచ్చిన ఒక పొరుగు రాష్ట్ర కార్మికుడు చనిపోతే లక్ష రూపాయల పరిహారం అడిగటానికి వారికి అవకాశం లేదు. సాహసించి అడిగినందుకు 14 మంది కార్మికులు జైలుకు వెళ్లారు. వందల మంది భయంతో ఇంటికి వెళ్లిపోయారు.

మన రాష్ట్రానికి ఎంతమంది కార్మికులు వలసలు వచ్చి పని చేసుకుంటున్నారో, వారి స్థితిగతులేమిటో, వారి వేతనాలేమిటో, పని గంటలేమిటో, వారికి కనీస హక్కులు ఏమైనా అమలవుతున్నావో లేదో పట్టించుకునే పరిపాలకులు లేరు. అధికారులు అంతకన్నా లేరు. కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఏ కార్మిక హక్కులూ వారికి వర్తించవు. వారిని బానిసలు వాడుకున్నట్టు యజమానులు వాడుకోవచ్చు. ఇది, ఈరోజు తమ సొంత దేశంలోనే అంతర్గత వలస కార్మికుల దుస్థితి.

మానవ హక్కుల వేదిక డిమాండ్లు:

  1. చని పోయిన కార్మికుని కుటుంబానికి 50 లక్షల రూపాయలు కనీస ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం, యాజమాన్యం, కాంట్రాక్టర్ అందరూ కలిసి అందించాలి.
  2. పోలీసులపై తిరగబడ్డారని జైలుకు పంపిన కార్మికులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి .
  3. వలస కార్మికులకు సంబంధించిన అనేక చట్టాలు, అరకుర హక్కుల తోనైనా, ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. కనీసం వాటిని తప్పనిసరిగా అమలయ్యేటట్టు చూసే విధంగా ఒక ప్రత్యేక వలస కార్మిక శాఖను ఏర్పాటు చేయాలి.

మా నిజ నిర్ధారణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి టి హరికృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ల రోహిత్, దిలీప్ కుమార్, వెంకటనారాయణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దశరధ, సభ్యులు గురవయ్య, వెంకటరమణలు మరియు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు పి. శంకర్ గారు పాల్గొన్నారు. –

డాక్టర్ ఎస్. తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

01.10.2025
పాలకవీడు, సూర్యాపేట.

Related Posts

Scroll to Top