దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతిచెంది, వందమందికి పైగా, కాళ్ళు, చేతులు విరిగి, కాలిన గాయాలతోను, మూగగాయల పాలు కావడానికి రాష్ట్రప్రభుత్వం, అందులో భాగమైన జిల్లా రెవిన్యూ పోలీసుల భద్రతావైఫల్యం వల్లనే జరిగాయని ఆరోపణలు రావడాన్ని మానవ హక్కుల వేదిక, ఐ.యఫ్టి.యు తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఆలూరు తాలూకా, హొళగొంద మండలం, దేవరగట్టులో 03 అక్టోబర్, 2025 తేది తెల్లవారుజామున 1 – 2 గం మధ్యలో మాళమల్లేశ్వరస్వామి పల్లకి కొరకు జరిగిన కర్రల సమరం లో మృతి చెందిన ఇద్దరిలో ఆరికెర గ్రామానికి చెందిన కోసిగి తిమ్మప్ప తలపై ఇనుపరింగులున్న కట్టెలు, రాళ్లదెబ్బల వల్ల మృతి చెందాడని సమాచారం.
మృతి చెందిన మరో దళిత వికలాంగుడు చిన్న అంజిని. మేము ఆదోని ఆరంజ్యోతి కాలనీకి చెందిన చిన్న అంజని భార్య ఈరమ్మను, వారి ముగ్గురు పిల్లలను కలసి విచారించడం జరిగింది. అంజినికి అంగవైకల్యం ఉన్నా, ఆరోగ్యాంగానే ఉన్నాడని, అతను బేల్దారు, హమాలి పనికి వెళ్ళేవాదని, 02 అక్టోబర్, 2025 తేది గురువారం సాయంత్రంతమ కాలనీకి చెందిన నలుగురితో కలసి వెళ్లాడని, ఆలూరు పోలీసులు తన భర్త ఫోటో వైరల్ చేయడంవల్ల మాకు తెలిసి, అంజనికి వరుసకు అల్లుడైన పరుశురాముడిని పంపామని, అతను 04 అక్టోబర్, 2025 తేది, ఉదయం 11 గం ఆలూరుకు వెళ్లి, ఆసుపత్రి దగ్గర సి.ఐ ని కలువగా, వారు అంజిని శవాన్ని అప్పజెప్పగా, ఆంబులన్స్ లో తీసుకొని వచ్చారని తెలిపారు.పోలీసులు, ఆసుపత్రివారు అంజిని మృతికి కారణం చెప్పలేదని, పత్రికల్లో గుండెపోటు తో చనిపోయాదని రాశారని, అయితే తన భర్తకు ఆరోగ్య వంతుడని, ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పారు. ఆలూరు ఆసుపత్రి వారు అంజనిని యం యల్ సి కింద కేసును తీసుకొన్నా, తమకు అతని మృతికి కారణం చెప్పలేదని, పోలీసులు తమఫిర్యాదు తీసుకోలేదని, తనభర్త తొక్కిసలాట లో కిందకుపడిపోయి, అతనిపై జనాలు తొక్కివేయడం వల్లనే మృతి చెందినట్టు తాము భావిస్తున్నామని చెప్పింది. అతని శరీరంపై గమనించగా, గుండెకు కిందిభాగంలోను,ఎడమ మోకాలికి, నడుముమీద రక్త గాయాలు ఉన్నాయని, ముఖం బాగా ఉబ్బిపోయిందని వాపోయారు.
మేము ఆదోని ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్లో ఉన్న భాధితులయిన నర్సప్ప, భీమేష్, మధు, సంజీవ, నీలకంఠ, మాధవ మాట్లాడటం జరిగింది. వారిలో కాళ్ళు, చేతులు విరిగినవారు, మూగ గాయాలు తగిలిన వారు ఉన్నారు. అప్పటికే అడ్మిట్ అయ్యి మెరుగైన వైద్యం కోసం కర్నూలు జి జి హెచ్ కు వెళ్లిన వారిలో వందవాగిలి రాజు, శివయ్య, మాల మల్లేష్, కాశయ్య లు ఉన్నారు.
దేవరగట్టులో బన్ని ఉత్సవం పేరు తో జిల్లా ఎస్పీ, ఆదోని సబ్కలెక్టర్ సమక్షంలో జరిగిన అనాగరికమైన, ఆరాచకానికి భాద్యులు ఎవరు? వెయ్యి మంది పోలీసులు పహారా ఏమైంది? పల్లకి కోసం ఆయా గ్రామాల ప్రజలు పోటీపడే దగ్గర అసలు పోలీసులు ఉన్నారా? లేరా? పోలీసులులేరనే ఆరోపణ వాస్తవం అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం లో భాగమైన జిల్లా కలెక్టర్, ఎస్పీ భాద్యత లేదా? ఇద్దరిచావుకు, మరికొందరి చావుబతుకులతో పోరాడుతున్న వారి పరిస్థితికి, తీవ్రంగాను,మూగగాయాలు
తగలడానికి చట్టంప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ భాద్యులు కాక, మరెవరు భాద్యులు? చిన్న అంజిని అంగవైకల్యం ఉన్న దళితుడు అతనిచావుకు కారణం ప్రభుత్వం, పోలీసుల భద్రత వైఫల్యం మని తేలితే కలెక్టర్ జిల్లా ఎస్పీ లపై ఎందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు ఎందుకు చేయకూడదు?
దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. పల్లకికోసం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ జరిగిన చోట సీసీటీవీ ఫూటేజీ పరిశీలించడం వల్ల పోలీసులు భద్రతలో పాల్గొన్నారనే విషయం అర్ధం అవుతుంది. జరిగిన ఘర్షణకు ప్రభుత్వం, పోలీసుల భద్రతా వైఫల్యం వల్లనే జరిగాయనే ఆరోపణల ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినపుడే అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న వారి కుటుంబాలకు, కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకొన్న వారికి, గాయాలు అయిన వారికందరికి వెంటనే తగిన నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు, చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం, నివాసానికి ఇల్లుకట్టించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవలసి వస్తోందని విజ్ఞప్తి చేస్తున్నాం.
U. G. శ్రీనివాసులు
AP HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు
తస్లీమా,
HRF కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యురాలు
యం. నర్సన్న
IFTU రాష్ట్ర నాయకులు
05-10-2025,
ఆదోని.