ఏలూరు జిల్లా లో నేవల్ ఆయుధ డిపో నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెడుతున్న భూసేకరణ ప్రయత్నాలని తక్షణమే విరమించుకోవాలి

కొయ్యలగూడెం మండలంలో ఆయుధ డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1300 ఎకరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం 03.02.2026 నాడు కొయ్యలగూడెం మండలంలో వివిధ గ్రామాల ప్రజలను కలిసి నిజ నిర్ధారణ చేపట్టింది. ప్రజలందరూ కూడా ఈ భూసేకరణ ప్రయత్నాలను ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

కొయ్యలగూడెం మండలంలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో, సుభిక్షమైన వ్యవసాయం సంవత్సరం పొడుగునా నడుస్తున్నది. ఈ మండలంలో ప్రజలు వర్జీనియా పొగాకు, పామాయిల్, పత్తి, జీడి మామిడి, అరటి, మొక్కజొన్న, చెరుకు పంటలతో పాటు రకరకాల కూరగాయల వ్యవసాయం చేస్తున్నారు. కొందరు సంవత్సరానికికి రెండు పంటలు పండిస్తుండగా, మరి కొంతమంది మూడు పంటలు కూడా పండిస్తున్నారు. వ్యవసాయం వారికి లాభసాటిగా ఉన్నది. అటువంటి భూములని ఇటువంటి ప్రాజెక్ట్ కోసం ఇవ్వాలని వారిని ఒత్తిడి పెట్టడం ఏ పాటి విజ్ఞత అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది.

ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూ బ్యాంకుల గురించి గొప్పగా చెప్పని సందర్భం లేనే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూ బ్యాంకులలో లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకి అటువంటి భూములు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తెలియదు. ఆ ఖాళీ భూములని వదిలేసి ఇటువంటి సస్యశ్యామలమైన భూములని ఇమ్మని ప్రజలని ఇబ్బంది పెట్టడం అన్యాయం కాక మరేమీ కాదు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ప్రభుత్వం మొదట్లో ఈ జిల్లాలోనే నల్లజర్ల మండలంలో భూములు సేకరించే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ స్థానిక ప్రజలు దీనిని వ్యతిరేకించడంతో ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో సేకరించే ప్రయత్నం చేసింది. అయితే అక్కడా ప్రజలు ఎదురుతిరిగారు. దానితో మూడవ ప్రయత్నంగా ఇక్కడ సేకరించే ప్రయత్నాలు చేపట్టింది. ఇటువంటి ప్రాజెక్టుకి ఇక్కడ ఏ మండలంలోని భూములు అనువు కాదు, కాకూడదు కూడా. ఇటువంటి ప్రాజెక్టులని సాగుయోగ్యం కాని ప్రభుత్వ బంజర భూములల్లో లేదా ప్రభుత్వం అధీనంలో ఉన్న ఖాళీ భూములలో మాత్రమే చేపట్టాలి.

‘అభివృద్ధి’ పేరు మీద భూములు కోల్పోవటం ఈ మండల ప్రజలకి ఇది మొదటిసారి కాదు. ఒక దశాబ్దం పూర్వమే చింతలపూడి ఎత్తిపోతల పధకం కింద కాలువల కోసం ఈ మండలంలో కన్నాపురం, మంగదేవిపేట తదితర గ్రామాల్లో భూములు సేకరించారు. ఈ ఎత్తిపోతల పధకాన్ని నేటి వరకు కట్టిందీ లేదు, ఈ కాలువల్లో నీరు పారిందీ లేదు. అదలా ఉండగానే మళ్ళీ భూసేకరణ అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదెంతవరకు ఆమోదయోగ్యం?

ఈ మండలంలో ఇటువంటి ప్రాజెక్టు కోసం భూములు సేకరించే అసంబద్ధ ప్రయత్నాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, దీని కోసం ఎవరికీ అభ్యంతరం లేని ప్రభుత్వ భూములని వెతుక్కోవాలని మానవ హక్కుల వేదిక (HRF) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.

వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)

04.02.2026,
విజయవాడ.

Related Posts

Scroll to Top