విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) వీధి వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల మానవ హక్కుల వేదిక (HRF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తొలగింపులు స్ట్రీట్ వెండర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్) చట్టం, 2014కు స్పష్టమైన ఉల్లంఘన అవుతుంది. ఈ చట్టం వీధి వ్యాపారులను ఇష్టానుసారంగా తరిమేయకుండా, వేధింపులకు గురిచేయకుండా, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రత్యేకంగా అమలులోకి వచ్చింది. ఈ అక్రమమైన, హింసాత్మకమైన తొలగింపులను తక్షణమే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
గత కొన్ని రోజులుగా జివిఎంసి 2,850కి పైగా చిన్న చిన్న దుకాణాలను, వీధి వ్యాపారాలను బలవంతంగా తొలగించింది. ఈ హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా, కొన్ని వేల కుటుంబాలు తీవ్రమైన అభద్రతలోకి నెట్టబడ్డాయి. తరచూ వీధి వ్యాపారస్తులను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక మౌఖిక నోటీసుల ద్వారా చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారు. ఈ చర్యలు అన్యాయమైనవే కాకుండా రాజ్యాంగం కల్పించిన జీవనాధికార హక్కును కాలరాస్తున్నాయి. వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనేది వాస్తవం. వారు లక్షలాది పౌరులకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులను, సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, వారి కృషిని గుర్తించకుండా జివిఎంసి వారిని హింసాత్మకంగా తరిమేయడం, సరుకులను స్వాధీనం చేసుకోవడం, వేధింపులకు పాల్పడటం చేస్తోంది. దాని ఫలితంగా కష్టపడి జీవనోపాధిని పొందుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, వారి ఆత్మాగౌరవాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.
వీధి వ్యాపారుల చట్టం, 2014 ఇలాంటి చర్యలను చాలా స్పష్టంగా నిషేధిస్తుంది. సెక్షన్ 3(3) ప్రకారం: “వీధి వ్యాపారానికి అనువైన స్థలాలను గుర్తించే సర్వే పూర్తవకముందు, అందరు వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వకముందు ఎవరినీ బహిష్కరించరాదు లేదా తరలించరాదు.” సెక్షన్ 12 ప్రకారం, ముందస్తు నోటీసు లేకుండా, విధివిధానాలు అనుసరించకుండా ఎవరినీ తొలగించరాదు. అదేవిధంగా, వ్యాపారుల ప్రతినిధులతో కూడిన టౌస్ వెండింగ్ కమిటీలు (TVCలు) ఏర్పాటు చేసి, వెండింగ్ జోన్లను గుర్తించి, వాటిని పారదర్శకంగా నియంత్రించాలని ఈ చట్టం చెబుతుంది. వాస్తవానికి ఈ చట్టం వీధి వ్యాపారుల హక్కులను రక్షించేందుకు అమలులోకి వచ్చింది. కాని జివిఎంసి మాత్రం ఈ చట్టాన్ని తుంగలో తొక్కి చట్ట దిక్కరణకు పాల్పడుతోంది.
ఇటువంటి స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ జివిఎంసి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సర్వేలు పూర్తిచేయకుండా, వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా, టౌను వ్యాపారుల కమిటీలను ఏర్పాటు చేసి వాటితో సంప్రదింపులు జరపకుండా వ్యాపారులను తొలగిస్తోంది. 2014 చట్టం ఇచ్చిన చట్టబద్ధమైన రక్షణా కవచాన్ని జివిఎంసి నిర్లక్ష్యం చేస్తూ, నియంత్రణ పేరుతో అణచివేతకు దిగింది. చట్టం కల్పించిన రక్షణను శిక్షగా మలుస్తూ, అత్యంత బలహీన వర్గాల ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది.
వీధి వ్యాపారులు నేరస్తులు కారు. వారు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ పట్టణ ప్రజలకు చవకగా, సులభంగా అవసరమైన వస్తువులను అందించే వ్యవస్థను నిర్మించారు. ‘ఇబ్బంది’ అనే భావనకు విరుద్ధంగా, వారి ఉనికి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంతో పాటు, వేలాది కుటుంబాలను దారిద్య్రంలోకి జారిపోకుండా కాపాడుతోంది. ఒకపక్క పెద్ద వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ ఆక్రమణలు రక్షణ పొందుతుంటే, మరోపక్క ప్రత్యేకంగా వీధి వ్యాపారులనే లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వపు వివక్షపూరిత, క్రూరపూరిత వైఖరిని బయటపెడుతోంది. హింస అనేది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు; జీవనోపాధులను నాశనం చేయడం, కార్మికులను ప్రతిరోజూ అవమానించడం, వారికి పట్టణ హక్కులను నిరాకరించడమూ హింసే. న్యాయం, సమానత్వం ఆధారంగానే పట్టణ పరిపాలన ఉండాలిగాని పరిపాలన పేరుతో పేదల ఆస్తులను హరించి వారిని కుంగదీయడం సరికాదని HRF నమ్ముతోంది.
మా డిమాండ్లు:
- కొన్ని రోజులుగా కొనసాగుతున్న వీధి వ్యాపారుల తొలగింపు కార్యక్రమాన్ని తక్షణమే ఆపాలి. ఇక ముందు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు.
- 2014 చట్టం ప్రకారం పారదర్శకమైన, సంప్రదింపుల ఆధారిత ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. దీనిలో భాగంగా విశాఖపట్నంలో సక్రమమైన టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం, చట్టపరమైన సర్వేలను న్యాయంగా పూర్తి చేయడం, వెండింగ్ జోన్లను గుర్తించి, అర్హులైన అందరు వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేయడం తప్పనిసరిగా చెయ్యాలి.
- ఇప్పటికే తొలగించబడిన వ్యాపారులకు నష్టపరిహారం ఇచ్చి, స్వాధీనం చేసుకున్న సరుకులను జరిమానా లేకుండా వారికి తిరిగి ఇవ్వాలి.
- చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఎం. శరత్ – HRF AP రాష్ట్ర ఉపాధ్యక్షులు
కె. అనురాధ – HRF AP రాష్ట్ర కమిటీ సభ్యులు
వి.ఎస్. కృష్ణ – HRF AP&TG సమన్వయ కమిటీ సభ్యులు
24-9-2025,
విశాఖపట్నం.