హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు గారికి మానవ హక్కుల వేదిక నివాళి

మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల వలన మృతి చెందారు.

గతంలో మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన మాధవ రావు గారు విద్యార్థి జీవితం నుండీ విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులై పని చేసారు. సమాజంలో మార్పు కోసం హక్కుల రంగాన్ని ఆయన కార్య క్షేత్రం చేసుకున్నారు. నాలుగు దశాబ్దల పైగా హక్కుల రంగంలో అలుపెరగని కృషి చేసారు.మొదట ఎ పి సి ఎల్ సి లో పనిచేసారు. తర్వాత మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగానే కాకుండా పలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో సంస్థ ఎదుగుదలకు ఎనలేని కృషి చేసారు.

విప్లవ సాహిత్యం పై మక్కువతో అనేక అనువాదాలు చేసారు. ఉపా లాంటి అణచివేత చట్టాలపై విలువైన వ్యాసాలు రాశారు. చట్ట సంబంధ అంశాల లోని క్లిష్టతను తగ్గించి సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా అనేక రచనలు చేసారు. పేరొందిన న్యాయవాదిగా ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ యువ న్యాయవాదులకు వృత్తి సంబంధిత నైపుణ్యాలు మెరుగు పరుచుకోవడానికి తన వంతు సాయం చేసేవారు.

మాధవ రావు గారి మృతి వారి కుటుంబానికే కాక, హక్కుల రంగానికి మొత్తంగా సమాజానికే తీరని లోటు.

కె వి జగన్నాథరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
మానవ హక్కుల వేదిక

వై రాజేష్
అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక

28-12-2024
విజయవాడ

Related Posts

Scroll to Top