జగిత్యాల రూరల్ మండల తహసీల్ కార్యాలయంలో, అటెండర్ గా పనిచేస్తున్న దళిత మహిళకు జరిగిన అవమానంపై మానవ హక్కుల వేదిక కరీంనగర్ జిల్లా నుండి నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం శనివారం (27.09.2025) జగిత్యాల తహసిల్ (MRO) ఆఫీస్ కి వెళ్లి బాధిత మహిళను, నిందిత మహిళలను, ఆఫీసు బాధ్యులను కలిసి వివరాలు సేకరించింది. ఎం ఆర్ ఓ గారితోనూ వివరంగా మాట్లాడింది.
తెలంగాణ ప్రభుత్వం 61 సంవత్సరాలు నిండిన VRA ల స్థానంలో పనిచేయటానికి వారి పిల్లలకు అవకాశం కల్పించటంతో, తన తండ్రి స్థానంలో ఈశ్వరి అనే మహిళ (SC మాల) జగిత్యాల రూరల్ తహసిల్ కార్యాలయంలో గత 8 నెలలుగా అటెండర్ గా పని చేస్తున్నది. అదే కార్యాలయంలో, అనారోగ్యం పాలైన తన భర్త స్థానంలో వచ్చి పనిచేస్తూన్న ఒక BC తెనుగు కులానికి చెందిన మహిళ, అలాగే మరో బీసీ మహిళ కూడా అటెండర్లుగా అప్పటికే ఉన్నారు.
వారం రోజుల క్రితం, తహసీల్ కార్యాలయంలో జరిగిన GPO ల శిక్షణా కార్యక్రమంలో శిక్షణకు హాజరైన అధికారులకు, ఉద్యోగులకు ఈశ్వరినే స్వయంగా వాటర్ బాటిళ్లు, టీ అందించింది. ఈ క్రమంలో వేరొకరి ద్వారా టీ అందుకున్న బీసీ తెనుగు మహిళా అటెండర్, దళితురాలు తాకిన ఫ్లాస్క్ లోని టీ ని నేను తాగనని, కప్పులో ఉన్న టీ ని పారబోయడమే కాకుండా, ఫ్లాస్క్ లో మిగిలి ఉన్న టీ ని కూడా పారబోస్తూ, నేను నీకంటే ఎక్కువ కులస్తురాలునని తెలియదా ? నీవు తాకిన టీ ని నేను తాగుతానని ఎలా అనుకున్నావు? అంటూ దళిత మహిళా అటెండర్ పై గుడ్లురిమింది. ఆమెకు, మరో బీసీ మహిళా అటెండర్ వంత పాడింది. ఇటువంటి అనుభవమే మరుసటి రోజు కూడా తనకు జరిగినట్లు బాధితురాలు మాకు చెప్పింది.
ఈ సంఘటన పట్ల కలత చెందిన బాధితురాలు డిప్యూటీ తహసిల్దార్ తో, ఏడుస్తూ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుంటుండగా, యాదృచ్చికంగా అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రుడు, పత్రికలో వార్తగా రాయడంతో, విషయం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన అంబేద్కర్ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు స్పందించి కార్యాలయానికి రాగా, ఎమ్మార్వో గారు ఇరువర్గాలని అందరి సమక్షంలో కూర్చుండబెట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరి మధ్యనే బీసీ తెనుగు మహిళ తన తప్పును అంగీకరిస్తూ, క్షమించుమని దళిత మహిళను ప్రాధేయపడింది. తనకు అట్రాసిటీ కేసు పెట్టే ఉద్దేశం లేకపోవడం వల్లా, వయస్సులో చాలా పెద్దావిడ పొరబాటయ్యిందని చెప్పడం వల్లా తెనుగు మహిళను క్షమించానని బాధితురాలు తెలిపింది. కుల వివక్ష ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ తోటి అతి చిన్న ఉద్యోగులైన గ్రామీణ, పేద మహిళల పట్ల ఉదారంగా ఉన్న బాధితురాలి (దళిత మహిళా అటెండర్) పెద్ద మనసును అభినందిస్తూనే, ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా చూడాల్సి ఉంది.
ఇది కేవలం ఇద్దరు మహిళల మధ్య వివాదం అయితే ఇంతటితో ఎవరైనా వదిలివేయవచ్చును. కానీ, ఇది సమాజంలో నెలకొన్న అసమాన సాంప్రదాయాలకు, విలువలకు కొనసాగింపు. మామూలుగా ఆ ఆఫీసు అధికార కార్యక్రమాల్లో సిబ్బంది మధ్య అధికారులు కులవివక్ష పాటిస్తున్న ఆరోపణలు లేకపోవటం మంచిదే గానీ, రాజ్యాంగ స్ఫూర్తితో నడవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఈ హేయమైన ఈ కుల వివక్ష, అవమానాలు విస్తరించటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇటువంటి వివక్ష పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆఫీసు సిబ్బంది అందరినీ కూర్చోబెట్టి అర్థం చేయించే ప్రయత్నం చేశాము.
తరతరాల వివక్ష, అణచివేతలకు సాధనంగా ఉన్న కులవ్యవస్థ, మారుతున్న కాలంలో కూడా వివక్ష, అణచివేతల రూపాలను మాత్రమే మార్చుకుంటూ దాని మౌలిక స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎవరో నాయకులు, బలహీన కులాలకు చెందిన నాయకులతో సహా, వస్తే అంతా మారిపోతుందని కాకుండా వివక్షకు గల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పునాది అంశాలపై అందరం పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తున్నది. ఈ విషయంలో సమాజం సమానత్వపు దిశగా ప్రయాణించాల్సింది ఇంకా చాలా ఉంది.
మా ఈ నిజనిర్ధారణ బృందంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానవ హక్కుల వేదిక జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి మధు గోసిక, ఎస్ అచ్యుత్ కుమార్, కన్నూరి సదానందం, సుధాకర్ లు పాల్గొన్నారు.
మధు గోసిక,
01.10.2025.