విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ (JSWAL)కు 2007లో జూన్ 28న (జీఓ నెం. 892 కింద) కేటాయించిన 1166 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకొని భూమిలేని వారికి, చిన్న రైతులకు పంపిణీ చేయాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఇందులో 985.70 ఎకరాల ప్రభుత్వ, మరియు డి.పట్టా భూమి, అలాగే కంపెనీ స్వయంగా కొనుగోలు చేసిన 180 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నాయి. దాదాపు ఇరువై ఏళ్లుగా జిందాల్ ప్రాజెక్టు ప్రారంభించడంలో విఫలమైంది. ప్రభుత్వం ఇకనైనా ఆ మొత్తం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, భూమిలేని వారికి, చిన్న రైతులకు పంపిణీ చేయాలి. ఈ భూముల కేటాయింపు కూడా అత్యంత వివాదాస్పదంగా జరిగిందని మేము నమ్ముతున్నాము.
2025 జూలై 5న HRF బృందం ముషిడిపల్లి, కిల్తంపాలెం, చీడిపాలెం, చిన్నఖండేపల్లి, మూలబొడ్డవర గ్రామాలకు వెళ్లి రైతులను కలుసుకుంది. బొడ్డవరలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను కలిసాము. కంపెనీ వస్తే వారికి ఉపాధి దొరుకుతుందని నమ్మి భూములిచ్చి మోసపోయామని వారంతా బాధపడుతూ చెప్పారు.
అయిదవ షెడ్యూల్ ప్రాంతంలో అరకు దగ్గర ఉన్న రక్తకొండ, గాలికొండ, చిత్తంగొండి కొండల్లో ఉన్న బాక్సైటు ఖనిజాన్ని, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) జిందాల్ కంపెనీకి సరఫరా చేయాల్సి ఉంది. అయితే 2016 లో ప్రభుత్వం ఆ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జిందాల్ సంస్థ ఇన్నేళ్ళు గడిచినా ఫ్యాక్టరీ నెలకొల్పలేదు. ఇతర చోట్ల నుండి ముడి సరుకు తెప్పించుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. అంతేకాకుండా గడచిన 18 ఏళ్లుగా భూమిని నిరుపయోగంగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. భూమిని కోల్పోయిన రైతులు మాత్రం జీవనాధారాలు లేక అలమటిస్తునే ఉన్నారు.
గత ప్రభుత్వం (YSRCP) అదే భూమిలో 2023 ఫిబ్రవరి 20న జీఓ నెం. 14 ద్వారా, అల్యూమినియం కాంప్లెక్స్‌కు బదులుగా “MSME పార్క్ లేదా ఇతర పరిశ్రమలు” ఏర్పాటు చేసుకోవచ్చని జిందాల్ కంపెనీకే మళ్ళీ అనుమతిని ఇచ్చింది. ఇది ప్రైవేట్ సంస్థకు నేరుగా లాభం చేకూర్చే చర్యగా మేము భావిస్తున్నాం. అంతే కాదు, తాటిపూడి రిజర్వాయర్ నుండి ఈ పార్క్‌కి నీరు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. ఇది విశాఖపట్నం నగరానికి త్రాగునీరు, మరియు ఎస్.కోట, జామి, గంట్యాడ మండలాల్లో 15,000 ఎకరాల సాగునీటి అవసరాలను హానిచేస్తుంది. ప్రజల తాగునీటి, సాగునీటి, అవసరాలను విస్మరించి ఈ నీటిని పరిశ్రమలకు ఇవ్వడం అన్యాయం.

ఉపాధి కోల్పోయిన రైతులు ఇప్పుడు భూమిని తిరిగి తమకు ఇవ్వాలంటూ న్యాయపూర్వకంగా పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం వారి గొంతును అణచేందుకు పోలీసులను దింపడం, బెదిరింపులు జరపడం దురదృష్టకరం. ముషిడిపల్లికి చెందిన దళిత రైతు ముత్యాల సన్యాసిరావుపై ఇటీవల రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, “జిందాల్‌కు వ్యతిరేకంగా పోరాడితే ప్రాణహాని ఉంటుంది” అంటూ బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు.
రెండు దశాబ్దాల పాటు భూమిని నిరుపయోగంగా తమ వద్ద పెట్టుకుని, అక్కడ పరిశ్రమను నెలకొల్పకుండా, ప్రజలకు ఉపాధి లేకుండా చేసాక మళ్ళీ అదే కంపెనీకి అదే భూమిని వేరొక రూపంలో కట్టబెట్టడం ఘోరమైన తప్పిదం. ప్రభుత్వం జీఓ నెం.14, ను తక్షణమే రద్దు చేసి JSWALకు చేసిన భూకేటాయింపులను పూర్తిగా రద్దు చేయాలి. ప్రభుత్వం కార్పొరేట్‌లకు మధ్యవర్తిగా కాక, ప్రజల హక్కులను కాపాడే సంస్థగా ఉండాలి. ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజలందరికీ చెందిన సామూహిక వనర్లను కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ కర్తవ్యం. ఈ నేపధ్యంలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని స్థానిక రైతులకు, ముఖ్యంగా దళిత, ఆదివాసీలకు పంచాలని, మొత్తం భూకుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.
కె.వి. జగన్నాధ రావు – HRF ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు
కె. అనురాధ – HRF ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
వి.ఎస్. కృష్ణ – HRF ఆంధ్ర-తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు
7-7-2025
విశాఖపట్నం