మేల్, ఫీమేల్ వరి వంగడాల పేరిట మోసం
నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ యాక్ట్ కింద కేసులునమోదు చేయాలి
రైతులకు ఎకరాకు రూ. 80 నష్ట పరిహారం కంపెనీ నుండి అందించాలి
మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం నాడు మన హక్కుల వేదిక నేతలు షేక్ అహ్మద్, దిలీప్, రోహిత్, సిరి బృందం చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలోని రైతులను కలిసింది. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు నమోదు చేసుకుంది. విత్తన కంపెనీలు ఒక మాఫియాగా మారి రైతులను బాహాటంగా మోసం చేస్తున్న తీరు గర్హనీయమని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ అహ్మద్ పేర్కొన్నారు. మేల్, ఫీమేల్ వంగడాలంటూ ఉచితంగా విత్తనాలు సరఫరా చేసి రైతులను కొన్ని కంపెనీలు మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ తంతు జరుగుతుందని, దీనిపై సమగ్రమైన విచారణ జరిపి మోసాలున్న అరికట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం పర్యటిస్తున్న చోట ఇలాంటి ఘటనలు నమోదవుతుండడం ఆశ్చర్యకరమన్నారు. విత్తన కంపెనీలపై కేసులు నమోదు చేసి రైతులకు ఎకరాకు 80 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రుక్మాపూర్ గ్రామంలో 100 ఎకరాల పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటల కోసం చేసిన అప్పులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన నమోదు కావడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపినప్పటికి ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు. పోలీసులు సదర్ కంపెనీల ప్రతినిధులపై కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చేగుంట, మెదక్.
16-11-2025.