ఈనెల 17వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఫారెస్ట్ సిబ్బంది మనుబోతులపాడు గ్రామ పంచాయతీకి చెందిన కోయ ఆదివాసి మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక ఐదుగురు సభ్యుల బృందం బాధితులను కలిసి వివరాలు సేకరించింది.
మనుబోతులపాడు జిపిలో భాగంగా ఉన్న పొడియం నాగేశ్వరరావు గుంపు హామ్లెట్ లో 23 కోయ ఆదివాసి కుటుంబాలున్నాయి. ఎవరూ పెద్దగా చదువుకోలేదు, ఒకరిద్దరు ఇంటర్మీడియట్ వరకు వెళ్ళటం తప్ప. అందరికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అందరికీ ఎంతో కొంత పోడు చేసుకున్న భూమి ఉంది. కానీ, ఎవరికీ రెవెన్యూ పట్టాలు గానీ, అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన వ్యవసాయపట్టాలు గానీ లేవు. 30 ఏళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్న వారిపై ఫారెస్ట్ అధికారులు తరచుగా దాడులు చేసి వేధిస్తున్నారు. అందులో భాగంగా 2019లో ఒకసారి వీరు పోడు చేసుకున్న 40 హెక్టార్ల భూమినీ, 2025 లో మరొకసారి బెదిరించి మరో నలభై హెక్టార్ల భూమినీ వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకుని అందులో ప్లాంటేషన్ చేశారు. మిగిలిన భూమిలో మీరు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవచ్చని మాట ఇచ్చి కూడా, తిరిగి ఈ సంవత్సరం అటవీ శాఖపై గల ప్లాంటేషన్ టార్గెట్ ను పూర్తి చేసుకోవడానికి కావచ్చు, ఆదివాసుల నుండి మరో ఎనిమిది ఎకరాల భూమిని తీసుకోజుస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈనెల 17వ తేదీన వారిపై జరిగిన భౌతిక దాడి. ఆదివాసులు కష్టపడి పోడు చేసుకుని పాతికేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిని స్వాధీన పరుచుకునే ఉద్దేశం అటవీ శాఖకు ఉంటే ఆదివాసులకు లిఖితపూర్వకంగా నోటీసులు ఇవ్వాల్సి వుండింది. కానీ అటవీ శాఖ ఏనాడు అటువంటి సాంప్రదాయాన్ని పాటించలేదు.
17వ తేదీన ఉదయం 11 గంటలకు 30 మంది సిబ్బంది లాటిలు, కత్తులు, నాలుగు జెసిబిలతో ఆదివాసుల భూమి పైకి వచ్చి వారి వ్యవసాయ భూముల్లో ప్లాంటేషన్ చేయడం ప్రారంభించారు. అడ్డుకోబోయిన ఆదివాసి మహిళలను విచక్షణ రహితంగా కొట్టారు. కడుపులో తన్నారు. కత్తులు చూపించి బెదిరించారు. జుట్టు పట్టి, చీరలు పెట్టి లాగి లాకెళ్లి, జీపులలో పడేశారు. మహిళల పట్ల అవమానకరంగా వ్యవహరించారు. ఫలితంగా ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి.
అదే రోజు అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు బాధితులు వెళ్లి మమ్మల్ని అటవీశాఖ అధికారులు ఇంత దారుణంగా హింసించారని ఫిర్యాదు చేస్తే, పోలీస్ అధికారి ఆ ఫిర్యాదు తీసుకోవటానికీ ,రిసీవ్డ్ కాపీ ఇవ్వటానికీ నిరాకరించాడు. స్థానిక రాజకీయ నాయకులు సైతం వచ్చి ఆదివాసులకు మద్దతుగా పోలీసులను నిలదీసినా బాధితుల ఫిర్యాదుకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు. ఆ ఫిర్యాదు పై ఎఫ్ఐఆర్ చేయలేదు. గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ ను కలిసి వారి బాధలు చెప్పుకుంటే, ఆ అధికారి మాటిమాటికి మీరు చత్తీస్గడ్ నుండి ఇక్కడికి వలస వచ్చారని, కాబట్టి మీరు మేము చెప్పినట్టు వినకపోతే మీకు ఇక్కడ నివసించటానికే ముప్పు వస్తుందని బెదిరించాడని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) e ప్రకారం భారతదేశంలోని పౌరులు ఎక్కడి నుంచి, ఎక్కడికైనా వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. నివాసం ఏర్పాటు చేసుకున్న చోట వారికి స్థానికులతో పాటు అన్ని హక్కులూ లభించాలి. అయినా ఆదివాసులను మాటిమాటికి ఈ రకంగా ఉన్నతాధికారులు బెదిరించటం, స్థానిక ఆదివాసీలను వారిపై ఉసిగొల్పటం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఆదివాసులకు గల అభ్యంతరాలను, కష్టాలను నివేదించటానికి ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ కు గానీ, అటవీ శాఖకు గాని ఇచ్చే ఫిర్యాదులకు వారు కూడా రిసీవ్డ్ కాపీ ఇవ్వటం లేదు. వారి ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులకు, పోలీసులకూ, ప్రతీ అధికారికి ఆదివాసులంటే అలుసు, చులకన భావం. చట్టాలు, రాజ్యాంగపరంగా ఆదివాసులకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ, వాటిని గౌరవించని గిరిజన అభివృద్ధి సంస్థలు, అటవీ శాఖ, పోలీస్ సిబ్బంది నుండి అవి వారిని రక్షించలేకపోతున్నాయి.
మా డిమాండ్లు:
- ఆదివాసి మహిళలను అవమానించి, భౌతికంగా గాయపరిచి, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన అటవీ శాఖ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
- 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు చేసుకుంటున్న ఆదివాసులందరికి ప్రభుత్వం శాశ్వత వ్యవసాయ పట్టాలు అందించాలి.
- ఆదివాసులు తమపై దాడి జరిగిందని అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వబోతే, తీసుకోవటానికి నిరాకరించిన పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి.
ఈ రోజు మా నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బదావత్ రాజు, ఖమ్మం జిల్లా కన్వీనర్ ఆదినారాయణ, వి.దిలీప్ , సదానందం లు పాల్గొన్నారు.
డా.ఎస్. తిరుపతయ్య, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అశ్వాపురం,
26.07.2026.