లాభాలు కార్పోరేట్లకు, కాలుష్యం ప్రజలకా?

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్) ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్ధాలను శుద్ధి చేయకుండా, లేదా అరకొరగా శుద్ధి చేసి పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డ, ఇతర కాలువల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్న ప్రదేశాలను, విసర్జన పైపులను గుర్తించి తక్షణం మూసివేయాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది.

ఆ ప్రాంతంలో అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న పారిశ్రామిక కాలుష్యం గురించి గత కొద్ది కాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలు, ఫిర్యాదుల గురించి తెలుసుకుని, నలుగురు సభ్యులతో కూడిన హెచ్.ఆర్.ఎఫ్. బృందం ఈ రెండు మండలాల్లో అనేక కాలుష్యం ప్రభావిత గ్రామాలను 15-5-2026న సందర్శించింది. ఈ బృందం అచ్యుతాపురం మండలంలోని పూడిమడక ప్రాంతాన్ని, రాంబిల్లి మండలంలోని సీతపాలెం, కంసాలి కాలనీ, లాలంకోడూరు, ఎరకన్నపాలెం గ్రామాలను సందర్శించి అక్కడ రైతులు, మత్స్యకారులను కలిసి విషయాలు తెలుసుకుంది. అక్కడ కొన్ని పదుల సంఖ్యలో ఉన్న ఫార్మా, రసాయనిక కర్మాగారాల నుండి అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్ధాలు పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లోకి పారడం మేము ప్రత్యక్షంగా చూసాము. 

ఈ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్ధాల దుర్గంధం భరించ లేనంతగా వ్యాప్తి చెందుతోందని, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని, జలచరాలకు ముప్పు వాటిల్లుతున్నదని, పాడిపంటలు దెబ్బతింటున్నాయని, ప్రజారోగ్యంపై దాని ప్రభావం బాగా ఉన్నదని గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక గ్రామస్తులు పదే పదే ఫిర్యాదు చేస్తున్నా వాటిని పెడచెవిన పెట్టారు. అప్పుడప్పుడు నామమాత్ర చర్యలు తీసుకున్నా అవి అర్ధవంతమైనవీ కావు, వాటి వల్ల పర్యావరణ వినాశనం ఆగిందీ లేదు.

ప్రమాదకర వ్యర్ధాల విసర్జన గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రజల నుండి ఫిర్యాదులు అందుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఇతర నియంత్రణ సంస్థలు వహిస్తున్న పాత్ర ఏమిటి అనే ప్రశ్న రాకమానదు. ఇంత పెద్దెత్తున, ఇంత సుదీర్ఘకాలం పాటు పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే అది ఆయా నియంత్రణ సంస్థల అత్యంత నిర్లక్ష్యవైఖరన్నా అయివుండాలి, ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడం అయినా అయివుండాలి, లేదా కావాలని కుమ్మక్కవ్వడం అయినా అయివుండాలి. 

పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లో కొన్నేళ్ళ క్రితం వరకు కూడా స్వచ్చమైన నీరు పారేదని, అవి త్రాగునీటికి, గృహావసరాలకు, సేద్యానికి పనికొచ్చేవని స్థానికులు గుర్తు చేసుకున్నారు. సెజ్ ప్రాంతంలో, సెజ్ ప్రాంతాన్ని అనుకున్న ప్రాంతాల్లో పరిశ్రమల సంఖ్య పెరిగిపోవడంతో ఆ గెడ్డలు  అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్ధాలు పారే మురుగు కాలువలుగా మారిపోయాయి.

ఈ పరిణామాలు పర్యావరణాన్ని అనేకవిధాలుగా దెబ్బ తీస్తున్నాయి. పిల్లమ్మగెడ్డ తూర్పు దిక్కు ప్రవహించి ఉప్పరిగెడ్డలో కలుస్తుంది. ఉప్పరిగెడ్డ పూడిమడక దగ్గర ఉప్పుటేరులో కలిసి అనంతరం సముద్రంలో కలుస్తుంది. ఇందువల్ల, విషపూరిత పారిశ్రామిక వ్యర్ధాల ప్రభావం కేవలం మంచినీటి చెరువులు, కాలువలపైనే కాదు,అత్యంత సున్నితమైన తీరప్రాంతంపైన, సముద్ర పర్యావరణ వ్యవస్థలపైన కూడా పడుతుంది. విషపూరిత నీటి కాలుష్యo ప్రభావం మత్స్య సంపదపై, దానిపై ఆధారపడే వారి జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పూడిమడక మత్స్యకారులు పదేపదే విన్నవించుకున్నా, నియంత్రణ సంస్థల్లో వారి గోడు వినే నాధుడు లేడు. 

పరిశ్రమలు విడుదల చేసే హానికర వ్యర్ధాలను శుద్ధిచేసే పారిశ్రామిక మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఇ.టి.పి.) ఒకటి పూడిమడక దగ్గర స్థాపించినప్పటికీ అది తన బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందనేది స్పష్టమౌతోంది. ఆ ప్రాంతంలో పరిశ్రమల నుండి శుద్ధికి నోచుకోని, అరకొరగా శుద్ధి చేసిన ద్రవ వ్యర్ధాలు అక్కడున్న గెడ్డల్లోకి, కాలువలలోకి, చెరువుల్లోకి కలిసిపోతున్నాయి. అదంతా సహజాతి సహజంగా, క్రమబద్ధంగా జరిగిపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం.  

అచ్యుతాపురం-రాంబిల్లి పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నది కేవలం కాలుష్యానికి సంబంధించిన ఒకానొక చెదురు మదురు సంఘటనో, లేదా సాధారణ ఉల్లంఘనో మాత్రమే కాదు. ఇది ఒక పధ్ధతి ప్రకారం నీటి వనరులను, వ్యవసాయ భూములను, సముద్ర పర్యావరణ వ్యవస్థలను, పరిసర ప్రాంతాల ప్రజల జీవితాలను, వారి జీవనోపాధులను బుగ్గిపాలు చేయడమే. లాభాలేమో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి, పర్యావరణానికి అవి తలపెట్టే నష్టాన్నేమో సమాజo నెత్తిన రుద్దె పారిశ్రామిక నమూనాకి రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు, మత్య్సకారులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 

హానికర వ్యర్ధాల విడుదలకు కారకులైన పరిశ్రమలు, వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికార్లు సాంకేతిక కారణాలు, అధికారిక ఇబ్బందులు మొదలైన సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీలులేదు. విషపూరిత వ్యర్ధాలు ఈ స్థాయిలో విడుదల అవుతున్నా నియంత్రణా వ్యవస్థలు చర్యలు తీసుకోకపోవడం జవాబుదారితనం లేకపోవడాన్ని సూచిస్తుంది. హానికర వ్యర్ధాలను గెడ్డల్లోకి,కాలువలలోకి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలోకి చట్టవిరుద్ధంగా విడుదల చేయడం నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 1974, పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986, హానికర వ్యర్ధాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఉద్దేశపూర్వకంగా మానవ మనుగడకు, ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హానికరమైన కాలుష్యం వెదజల్లుతూపొతే, అందుకు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలే కాదు, ఉల్లంఘనలు జరుగుతున్న విషయం తెలిసి జోక్యం చేసుకోని ప్రభుత్వ అధికార్లు కూడా శిక్షార్హులు అవుతారు. ఇన్నేళ్ళ పాటు, ఇంత బాహాటంగా ఈ ప్రాంతంలో పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే నియత్రణ సంస్థలు విధినిర్వహణలో నిర్లక్ష్యానికైనా పాల్పడి ఉండాలి, లేదంటే వారు ఉద్దేశపూర్వకంగా నేరస్తులతో కుమ్మక్కు అయినా అయివుండాలి.

పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లో, ఆ ప్రాంతంలోని ఇతర వాగులలో పారిశ్రామిక వ్యర్ధాల విడుదలను నిలిపేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్ధాల విసర్జన గురించి కోర్టు పర్యవేక్షణలో కాని, స్వతంత్రంగా కాని ఒక శాస్త్రీయ పరిశోధన జరిపించాలని మేము కోరుతున్నాం. కాలుష్య ప్రభావిత గ్రామాల్లో సమగ్రమైన ఆరోగ్య, పర్యావరణ ప్రభావ అంచనా జరిపించడం తక్షణ అవసరం. చట్టాన్ని ఉల్లంఘిస్తూ విషపూరిత వ్యర్ధాల విడుదలకు కారకులైన పరిశ్రమలపై కాలపరిమితిలోపు క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. చట్టం అమలు చేయడంలో జరుగుతున్న వైఫల్యానికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అధికార్లు, ఇతర నియంత్రణ సంస్థల అధికార్ల పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి ఒక స్వతంత్ర విచారణ జరగాలి. ఈ పర్యావరణ నేరానికి సహకరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఈ పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి వ్యర్ధాల పర్యవేక్షణ నివేదికలను, భూగర్భజలాల అధ్యయనాలను, తనిఖీ నివేదికలను, అనుసరణ గణాంకాలను ప్రజలకు బహిర్గతం చేయాలని హెచ్.ఆర్.ఎఫ్. కోరుతోంది. ఆ ప్రాంతంలోని గెడ్డలు, ఏరులు,కాలువలు, చెరువులు, వ్యవసాయ భూములు, ప్రభావిత తీర ప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు, పునర్జీవనానికి చర్యలు తీసుకోవాలి. సుదీర్ఘకాలం పారిశ్రామిక కాలుష్యానికి గురై జీవనోపాధి కోల్పోయిన, ఆరోగ్యం దెబ్బతిన్న బాధిత ప్రజలకు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలి.

పారిశ్రామిక అభివృద్ధి పేరిట, ‘ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని బాధిత గ్రామాల ప్రజలు బలిపశువులు కాకూడదు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యం అభివృద్ధికి ఆటంకాలేమీ కావు. అవి ఒక ప్రాధమికమైన రాజ్యాంగ, మానవ హక్కుల బాధ్యత.

కె సుధా – హెచ్.ఆర్.ఎఫ్.AP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
కె అనూరాధ – హెచ్.ఆర్.ఎఫ్. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి
విఎస్ కృష్ణ – హెచ్.ఆర్.ఎఫ్.AP&TG సమన్వయ కమిటీ సభ్యులు

17-5-2026
విశాఖపట్నం

Related Posts

Scroll to Top