వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నం రూరల్ మండలంలోని అడవివరం-ముదసర్లోవ గ్రామాలలో 160 ఎకరాల విస్త్రీణంలో మొదలుపెట్టిన వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను తక్షణం నిలిపివేయాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి కూతవేటు దూరంలో ఉన్నది.ఇది పర్యావరణపరంగా సున్నితమైన, జీవవైవిధ్యం గల(ఇకో సెన్సిటివ్ జోన్/ఈ.ఎస్.జడ్.)ప్రాంతం.ఇక్కడ మన రాష్ట అటవీ విభాగం వారు ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి ఎటువంటి అబ్యంతరం లేదనే ధృవీకరణ పత్రం (ఎన్.ఓ.సి.) మంజూరు చేయడం పర్యావరణ పరిరక్షణకు, ప్రజా హితవుకు విఘాతం కలిగించే ఒక ఉన్మత్త చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
సింహాచలం పర్వతశ్రేణిలో అంతర్భాగమైన కైలాశగిరి అటవీ ప్రాంతంలో పచ్చని ప్రాంతాన్ని హెచ్.ఆర్.ఎఫ్. బృందం ఈ నెల 18న సందర్శించింది. అమూల్యమైన ఈ అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని, చెట్లను కొట్టేసి భూభాగాన్ని తవ్విపోయడం, చదును చేయడం చూసి మేము నిర్ఘాంతపోయాము. ఈ పని గత కొన్ని వారాలుగా సాగుతున్నదని స్థానికులు మాకు తెలిపారు. భూమిని చదును చేసి, తాత్కాలిక కచ్చా రోడ్ల నిర్మాణానికి పనులు సాగుతున్నాయనేది మాకు అర్ధమైంది. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పర్యావరణపరమైన ఆమోదం (ఇ.సి.) పొందలేదు. అనుమతులు రాకపోయినా, ఎటువంటి నదురుబెదురు లేకుండా బరితెగించి చట్టాన్ని బాహాటంగా, నిర్లజ్జగా ఉల్లంఘిస్తూ ఈ పనులు మొదలుబెట్టారు. ప్రాజెక్టు ప్రతిపాదించే వ్యక్తులు, లేదా సంస్థలు ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండా, ప్రాజెక్టు స్థాపించాలనుకున్న ప్రాంతంలో భూమి నైసర్గిక స్వరూపాన్ని మార్చడం, చెట్లు తొలగించడం, ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ఇతర పనులు చేపట్టడం వంటివి చేయకూడదని పర్యావరణ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ విధంగా చేస్తే అది పర్యావరణ ప్రభావ అంచనా మదింపుకు ఆటంకం అవుతుంది. జరిగిన నష్టం ఎలాగూ జరిగి పోయింది, దీన్ని కొనసాగించేద్దాం అనే ఒక వైరాగ్య భావన దాపురించాడానికీ దారి తీస్తుంది.
గూగుల్-రేడెన్-అదాని ప్రోత్సహిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీ (ఎస్.ఇ.ఏ.సి) అన్యాయంగా కాటగిరి బి2 ప్రాజెక్టుగా వర్గీకరించింది. ఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడం, కంబాలకొండ అభయారణ్య సమీప ప్రాంతం కావడం వల్ల పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ (ఇ.ఐ.ఏ.), 2006లోని సాధారణ నిబంధనలు వర్తిస్తాయి. అంటే, ఈ ప్రాజెక్టును కాటిగరి ఏ ప్రాజెక్టుగా గుర్తించాలి. దాని పర్యావరణ ప్రభావ అంచనా మదింపు చేయాల్సింది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ (ఇ.ఏ.సి.). సమగ్రమైన పర్యావరణ ప్రభావ అంచనా, బహిరంగ విచారణ మొదలైన చర్యలు తప్పనిసరిగా చేపట్టి తీరాలి.

ప్రాజెక్టు స్థాపించే ప్రదేశం కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్య సరిహద్దుకి కేవలం 0.86 కి.మీ.ల దూరంలో ఉన్నదని, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతానికి (ఇ.ఎస్.జడ్.) 0.45 కి.మీ.ల దూరంలో ఉన్నదని స్వయంగా ప్రాజెక్టు ప్రతిపాదకులు వారి నివేదికలో ఒప్పుకున్నారు. వన్యప్రాణుల (పరిరక్షణ) చట్టం, 1972 కింద సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతం చుట్టూ 10 కి.మీ.ల పరిధిలో కాటిగరీ బి ప్రాజెక్టులన్నీ కాటిగరీ ఏ ప్రాజెక్టులుగా పరిగణింపబడతాయి.
ప్రాజెక్టు ప్రతిపాదకుడు ఒక వైపు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి, ఇ.ఎస్.జడ్. ప్రాంతానికి సమీపంలో ఉన్నామని ఒప్పుకుంటూనే మరో వైపు ఈ ప్రాజెక్టుకు సాధరణ నిబంధనలు వర్తిస్తాయా అంటే ‘నో’ అని, ఇది వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం, 1972 పరిధిలోకి వస్తుందా అంటే ‘నో’ అని పేర్కొన్నారు. వారు చేసిన ప్రకటన, వారు సమర్పించిన నివేదికలకు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా ఉన్నాయి. కాటిగరీ ఏ కింద జరగాల్సిన సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా, బహిరంగ విచారణ మొదలైన ప్రక్రియల నుండి తప్పించుకోవడానికే ఇటువంటి కుయుక్తులకు పాల్పడ్డారు. పారదర్శకత, భాగస్వామ్య ప్రజాస్వామ్యం వంటి విలువలను గౌరవించే ఈ పర్యావరణ నిబంధన నుండి తప్పించుకోవడానికే ఈ పనికి పూనుకున్నారు.
రాష్ట అటవీ విభాగం ఈ ప్రాజెక్టు స్థాపన కోసం అభ్యంతరం లేదంటూ జారీ చేసిన ధృవీకరణ పత్రం (ఎన్.ఓ.సి.) ఏవిధంగా చూసుకున్నా చెల్లదు. వాళ్ళు కనీసం కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన అటవీ సలహా కమిటీ (ఎఫ్.ఏ.సి.) నుండి ముందుగా అనుమతి పొందడం వంటి ప్రాధమికమైన పని కూడా చేయలేదు. పర్యావరణపరంగా ఇంతటి సున్నితమైన ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో అటవీ విభాగం ఇంత అనాలోచితంగా, యాంత్రికంగా, కళ్ళు మూసుకుని ఎన్.ఓ.సి.లు మంజూరు చేయకూడదు. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం విశాఖపట్నం ప్రాంతానికి పర్యావరణపరంగా ఆయువుపట్టు లాంటిది. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని, భూగర్భజలాల పునర్జీవనాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఒక అరుదైన ప్రక్రుతి సంపద కంబాలకొండ. ఈ ప్రాజెక్టు పేరిట జరుగుతున్న ప్రయత్నాలన్ని అటవీ సంరక్షణ చట్టం, 1980కి విరుద్ధం. రాష్ట్ర అటవీ విభాగం ఇప్పటికైనా కార్పొరేట్ సంస్థలకు జేబు సంస్థలా వ్యవహరించడం మానేయాలి.
ఈ ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టు గురించి మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే విశాఖపట్నానికి మంచినీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్ కు అత్యంత సమీపంలో ఉన్నది. హనుమంతువాక నుండి సింహాచలం వెళ్ళే రహదారిలో ఎడం పక్కన కైలాశగిరి అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు స్థాపించాలని అనుకుంటున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్ రహదారిని ఆనుకుని కుడి పక్కన ఉన్నది. ఈ ప్రజెక్టు పేరిట పెద్దెత్తున సన్నాహక ఏర్పట్లు చేయడం, అడవులు నరికివేయడం, భూభాగాన్ని అతలాకుతలం చేయడం, భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, చమురు నిలువ చేయడం, భారీ జనరేటర్లు ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడితే కైలాశగిరి అడవి నుండి ముడసర్లోవలోకి పారే సెలయేళ్ళు ఎండిపోతాయి. ముడసర్లోవకు దక్షిణ పరివాహక ప్రాంతం నుండి అందే నీరు పూర్తిగా హరించుకుపోతుంది. అది రిజర్వాయర్ పర్యావరణ వ్యవస్థకు, విశాఖ నగర నీటి భద్రతకు ఎనలేని హానికి దారి తీస్తుంది. జరగబోయే ఈ నష్టాన్ని తిరిగి చక్కదిద్దుకోలేము.
ఇది 512 మెగావాట్ల సామర్ధ్యం గల అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్. అయినప్పటికీ పర్యావరణ నిర్వహణ ప్లాన్ (ఇ.ఎం.పి.) లో దాని శితలీకరణ వ్యవస్థ, నీటి వాడకం మొదలు పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపే అంశాల గురించి అసలు ప్రస్తావించలేదు. ప్రస్తావించినా దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టుకు కేవలం 246 కె.ఎల్.డి.ల మంచినీటి అవసరం ఉంటుందని ఇ.ఎం.పి.లో పేర్కొన్నారు. ఇంత భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కి కేవలం ఇంతటి నీటి వాడకం ఉంటుందనేది అసాధ్యం, హాస్యాస్పదం.
ఇది ఖచ్చితంగా పర్యావరణ వ్యవస్థను, నీటి వనరులను, గాలి స్వచ్ఛతను, పర్యావరణ పరంగా విశాఖ నగర మనుగడను ప్రభావితం చేయబోయే అతిపెద్ద భారీ పారిశ్రామిక వ్యవస్థ. దానిని కేవలం ఒక ‘భవంతులు, నిర్మాణాల’ ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆ పనే వారు తర్లువాడ, రాంబిల్లి డేటా సెంటర్ల విషయంలో కూడా చేసారు.
ఇప్పటికీ పర్యావరణ ప్రభావ అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి ఆ ప్రదేశంలో ప్రాజెక్టు స్థాపనకు జరుగుతున్న సన్నాహక చర్యలను, భూమి మీద నైసర్గిక మార్పులు చేసే పనులు తక్షణం నిలిపివేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ ప్రభావం అంచనా వేసే అధికారం రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీ (ఎస్.ఇ.ఏ.సి.) కి లేదు. ఇది కాటిగరీ ఏ ప్రాజెక్టు కనుక దీని ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖకు పంపాలి.వారిచే సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను రూపొందించి, బహిరంగ విచారణను జరిపించాలని ఎస్.ఇ.ఏ.సి.కి హెచ్.ఆర్. ఎఫ్.ఒక వినతిపత్రం సమర్పించింది.
కార్పొరేట్ సంస్థల మెగా ప్రాజెక్టులకు వెసులుబాటును కల్పించాలనే ఆత్రుతలో పర్యావరణ పరిరక్షణ చట్టాలను, ఇతర నియంత్రణా వ్యవస్థల రక్షణ చర్యలను తొలిచివేసే అధికారం ప్రభుత్వానికి లేదు. వారు ప్రకృతికి కేవలం సంరక్షకులు మాత్రమే, యజమానులు కారని చట్టం స్పష్టంగా చెబుతుంది. చట్టాలను నిర్వీర్యం చేసి, తప్పుడు ప్రకటనలు స్వీకరించి, వాయిదాల పద్ధతిలో అనుమతులు జారీ చేసి, లేదంటే బాహాటంగా అక్రమాలకు పాల్పడి పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలు నుండి తప్పించుకోలేరు. ఈ ఒక్క ప్రాజెక్ట్ ప్రతిపాదన వల్ల పచ్చటి కంబాలకొండ అభయారణ్యానికి, విశాఖ నగరవాసులకు దాహం తీర్చే ముడసర్లోవకు ప్రమాదం వాటిల్లబోతోంది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ వెంటనే కలుగజేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో చేస్తున్న పర్యావరణ చట్టాల ఉల్లంఘనలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలనిహెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. అడవివరంలో అక్రమంగా అడవిని నరికివేయడానికి కారకులైన అధికార్లు, సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
డేటా సెంటర్ల మీద గతంలో మానవహక్కుల వేదిక పత్రికా ప్రకటనల కోసం ఈ కింది లింక్ మీద క్లిక్ చెయ్యండి
https://humanrightsforum.org/data-center-samaajaaniki-paryaavaranaaniki-vipatthu/
వై. రాజేష్ – హెచ్.ఆర్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి.ఎస్. కృష్ణ – హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి.& టి.జి. సమన్వయ కమిటీ సభ్యుడు
20-05-2026
విశాఖపట్నం