మతిస్థిమితం లేని అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

ఆస్పరి మండలం, జొహరాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని 35ఏళ్ళ తన కూతురిని ముత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతు నమ్మించి అత్యాచారానికి పాల్పడినాడని బాధితురాలి తండ్రి ఆరోపణలు రావడాన్ని ‘”మానవ హక్కుల వేదిక ” తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషయమై HRF ఇరువురు సభ్యులు బాధితురాలి తండ్రిని, ఆదోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరెంటెండెంట్ ను విచారించగా ఈ కింది వాస్తవాలు వెలుగు చూశాయి.

బాధితురాలి తండ్రి రాఘవేంద్ర స్వామి కమిటీతో మాట్లాడుతూ తనకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నా, భార్య చనిపోయాక, తాను మతి స్థిమితంలేని చిన్న కూతురును చూసుకొంటూ, జొహరాపురంలో ఉంటున్నానని చెప్పాడు. తను చిన్న కూతురు ఆదోనిలో ఇంటర్ చదివే వరకు మానసిక స్థితి బాగానే ఉందని, ఆ తరువాత నుండి ఆమె మతి స్థిమితం కోల్పోయిందని వాపోయాడు. ఆమె స్థితిలో వచ్చిన మార్పుతో పాటు, తన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పాడు. తన భార్య చనిపోగా, కొడుకు, పెద్ద కూతురు తమ దగ్గరకు రావడం మానివేశారని చెప్పాడు.

తాను పోస్టుమెన్ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసి, నెలనెలా వచ్చే పెన్షన్తో తన చిన్న కూతురు ఆరోగ్యం కొరకు ఖర్చు చేస్తూ, జీవితాన్ని నెడుతూ వచ్చానని, ముత్తుకూరు గ్రామ నివాసి కురుబ హనుమంతు గత ఎనిమిది ఏళ్లుగా ఆశ్రమంలో ఉమామహేశ్వరస్వామి ఆరాధన, భజన కొరకు తమ వచ్చి వెళ్లడం నుంచి పరిచయం ఉందని చెప్పాడు. అతను మాయ మాటలు నమ్మి, కర్నూలులో మంచి అనాధ ఆశ్రమంలో చేర్పిస్తాననిచెప్పగా, 17 డిసెంబర్, 2024 తేదిన ఉదయం తానే పంపానని చెప్పాడు. అదేరోజు రాత్రి ముత్తుకూరు గ్రామంలోని హోటల్ నడుపుకొనే అతను నాకు ఫోన్ చేసి, ఆరోజు ఉదయం నుండి హనుమంతు తన కూతురిని లైగికంగా వేధిస్తున్నాడని సమాచారం తెలియగా, నేను అదేరోజు రాత్రి ఆస్పరి పోలీసులకు ఫోన్ లో సమాచారం ఇస్తూనే, మరుసటి రోజు 18 డిసెంబర్, 2024 తేదిన పోలీసు స్టేషన్లో రాతమూలకంగా ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆస్పరి పోలీసులు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకొని, కేసును నమోదు చేసి, బాధితురాలికి ఆదోనిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఆసుపత్రి సూపరెంటెండెంట్ మాట్లాడుతూ తాము వైద్య పరీక్షలు జరిపి కోర్టు దృష్టికి తీసుకొని వెళతామని చెప్పారు. మానసిక రోగులకు చికిత్స చేసే సైకియాట్రిస్ట్ ఈ రోజే రిలీవ్ అవుతున్న విషయం తెలిపారు. బాధితురాలి తండ్రి కోర్టు
దృష్టికి తీసుకొనిపోతే ఆమె మన స్థితి సరిగాలేదని నిర్ధారణకు వస్తే న్యాయమూర్తి ప్రభుత్వ మానసిక వైద్యం చేసే ఆసుపత్రిలో చేర్చే అవకాశం ఉందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, బాధితురాలికి వైద్య పరీక్షల్లో వచ్చే నిర్ధారణను బట్టి, నమ్మించి మోసం చేసి లైంగిక దాడి
జరిపాడని తేలితే ఆ అమానుష సంఘటనకు కారకుడైన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపడంతోపాటు, బాధితురాలు 95% మానసిక స్థితిలేని విషయం వాస్తవం అయితే, ఆమె తండ్రి రాఘవేంద్ర స్వామిని విచారించి, న్యాయస్థానం ఉత్తర్వులు తీసుకొని ఆమెను ప్రభుత్వం మానసిక వైద్యశాలలో చేర్చి, వైద్య సేవలు అందించి, సంరక్షించే విధంగా చర్యలు తీసుకొని ఆమెను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

U. G. శ్రీనివాసులు
HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఆదోని.

ఖాదర్ భాష
జిల్లా కార్యవర్గ సభ్యులు,
ఆదోని.

ఆదోని,
19 డిసెంబర్, 2024.

Related Posts

Scroll to Top