మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన పోలీసులపై బిఎన్ఎస్, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను పోలీసు కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన వివిధ పోలీసే స్టేషన్ లకి చెందిన పోలీసులపై బిఎన్ఎస్, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, శాంసన్ కు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తుంది.

దళితుడైన వడ్లపూడి శాంసన్, చల్లా సుబ్బారావు లను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి, అక్రమంగా కష్టడీలో ఉంచి, చిత్రహింసలకు గురి చేసిన సంఘటనకి సంబంధించి ఇద్దరు సభ్యుల హెచ్ఆర్ఎఫ్ బృందం ఫిబ్రవరి 15 నాడు మొరుసుమిల్లి సందర్శించి, గ్రామస్తులతో, బాధితులతో, వారి కుటుంబసభ్యులతో, మైలవరం పోలీసులతో మాట్లాడింది. మా నిజ నిర్ధారణలో ఈ క్రింది విషయాలు తెలిసాయి.

మొరుసుమిల్లి పక్క గ్రామమైన ములకలపెంట కి చెందిన కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫిబ్రవరి 8 నాడు తన పొలంలో చనిపోయారు. ఆయన కొడుకు కడియం పుల్లారావు తన తండ్రి చావుకి కారణం చల్లా సుబ్బారావు, వడ్లపూడి శాంసన్ లు అని, తన తండ్రికి సుబ్బారావుకి మధ్య భూ తగాదాలు ఉన్నాయి అని ఫిబ్రవరి 9 నాడు మైలవరం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫిబ్రవరి 9 నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంసన్ సుబ్బారావు పొలంలో వ్యవసాయ కూలీగా ఎన్నో సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు. శ్రీనివాస రావు పొలం, సుబ్బారావు పొలం పక్కపక్కనే ఉంటాయి.

ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఫిబ్రవరి 9 నాడు అయితే, ఫిబ్రవరి 8 సాయంత్రమే సుబ్బారావు, శాంసన్ లను పోలీసులు తమ కష్టడీ లోకి తీసుకున్నారు. ఈ కేసులో జరిగిన చట్టవిరుద్ధ పనులకి ఇది నాంది. వారిని కష్టడీలోకి తీసుకుని సీసీటీవీ కెమెరాలు ఉన్న మైలవరం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళకుండా, అవి లేని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరినీ రెండు వేరు వేరు గదులలో ఉంచారు. తన మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని, తనకి ఈ చావుకి సంబంధం లేదని సుబ్బారావు స్పష్టం చేయగా, శాంసన్ మాత్రమే తానే శ్రీనివాసరావుని హత్య చేశానని కష్టడీలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అక్కడ పోలీసులు తెలుపని విషయం ఏమిటంటే కష్టడీలో ఉన్న శాంసన్ ను పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని. అయితే పోలీసులు చిత్రహింసలకు గురి చేసే క్రమంలో శాంసన్ అలా చెప్పాడా లేక గురి చేశాక చెప్పాడా అనే విషయంలో స్పష్టత లేదు.

ఆ తరువాతి రోజు, అనగా ఫిబ్రవరి 9 నాడు శాంసన్ ను శ్రీనివాసరావు చనిపోయిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. హత్య చేశాను అని శాంసన్ ఒప్పుకున్నాడు కాబట్టి, హత్యకి వాడిన ఆయుధాన్ని స్వాధీనపరుచుకోవడానికి తనని తీసుకువెళ్ళాము అనేది పోలీసులు చెప్పిన కారణం. ఆ ఆయుధాన్ని వెతకటానికి పోలీసు జాగిలాలను కూడా తీసుకువెళ్లారు. అయితే అక్కడ ఏ ఆయుధమూ లేదు, ఏదీ దొరకలేదు. ఈ హత్యలో ఇతరులు భాగమయ్యారని వేరే వాళ్ళ పేర్లు చెప్పాడని, వారిని విచారిస్తే వారికి ఈ ఘటనతో సంబంధమే లేదని తేలిందని పోలీసులు తెలిపారు. ఇక్కడ వాళ్ళు చెప్పని మరొక విషయం ఏమిటంటే వివిధ స్టేషన్ల నుండి వచ్చిన పోలీసులు శాంసన్ ను ఎడతెరపి లేకుండా ప్రశ్నిస్తూ భౌతికంగా హింసించారు.  తమనే తప్పుదోవ పట్టిస్తావా అంటూ శాంసన్ ను వివస్త్రుడని చేసి, అక్కడ ఉన్న మామిడి చెట్టుకి వేళాడదీసి పోలీసులు చితకబాదారు. అంత చిత్రహింసలకి గురి చేసిన తరువాత కానీ వీరి ఇద్దరికీ ఈ చావుతో సంబంధం లేదని పోలీసులకి తెలిసి రాలేదు. పోలీసులు ఆ పొలాన్ని జాగిలాలతో జల్లెడపడుతున్న సందర్భంలో దీని గురించి అడిగినందుకు మొరుసుమిల్లికి చెందిన దళిత యువకుడు సగ్గుర్తి అశోక్ మీద కూడా పోలీసులు చేయి చేసుకున్నారు.

ఆ తరువాత పోలీసుల విచారణలో ఈ చావు హత్య కేసు అని, ఇందులో నిందితుడు బాధిత శ్రీనివాసరావు కొడుకే అయిన పుల్లారావు అని తేలింది అని ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత కానీ సుబ్బారావు, శాంసన్ లను అక్రమ నిర్బంధం నుండి విడుదల చేయలేదు. ఇద్దరినీ కూడా ఫిబ్రవరి 8 రాత్రి నుండి ఫిబ్రవరి 14 రాత్రి వరకు సిఐ కార్యాలయంలోనే ఉంచారు. అంటే మొత్తం ఆరు రోజులు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, చట్టపరంగా పోలీసు కష్టడీ కోరి, తీసుకుందాము అనే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.

ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా చట్ట విరుద్ధమే. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే, అరెస్ట్ కూడా చూపించకుండా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ పైన 6 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. శాంసన్ ను చిత్రహింసలకు గురిచేశారు. ఇది నిజం కాదు అని పోలీసులు అనలేదు. అయితే ఇలా చేయడం తప్పలేదు అని మాత్రం సమర్దించుకున్నారు. పైగా పుల్లారావు ను నిందితునిగా తేల్చి శాంసన్ కు మేలు చేశామని, లేకపోతే శాంసన్ కష్టడీ లో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనకి రిమాండ్ కోరి తమ పని అయిపోయింది అన్నట్టు ఉండేవాళ్ళమని, అలా చేయకుండా నిజమైన నిందితునిని గుర్తించి శాంసన్ ను కాపాడామని చెప్పుకొచ్చారు.

పుల్లారావు ను నిందితునిగా చూపించిన తరువాత మైలవరం పోలీసులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో తమ పనిని పొగుడుకుంటూ పుల్లారావు ని “తమ శైలిలో” ప్రశ్నించి నిజం రాబట్టామని చెప్పుకొచ్చారు. పోలీసులు “తమ శైలిలో” అంటే దానర్థం ఏమిటో తెలియనిది కాదు. భారత రాజ్యాంగం కానీ, భారత దేశ చట్టాలు కానీ పోలీసులు “తమ శైలిలో” విచారణ చేయమని చెప్పలేదు. అది పోలీసులయినా సరే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మాత్రమే విచారణ చేయాలి అని చెప్పాయి. పోలీసులకి నచ్చినా, నచ్చకపోయినా వారు కూడా రాజ్యాంగం, చట్టాలకి లోబడి పని చేయాల్సిందే. దీనితో ఏమైనా విబేధం ఉంటే వారు రాజ్యాంగంలోని 14, 21, 22 అధికరణలు చూడవచ్చు. అలాగే బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 57 కూడా చూడవచ్చు.

ఈ చిత్రహింసల ఘటనలో పాల్గొన్న పోలీసులని తక్షణమే సస్పెండ్ చేసి, వారి మీద బిఎన్ఎస్ లోని సెక్షన్ 120 (2) మరియు 258 కింద, ఎస్ సి/ ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం లోని సెక్షన్ 3 (1) (ఈ), 3 (1) (పి), 3 (2) (v) మరియు 3 (2) (vii) కింద కేసు నమోదు చేయాలని, శాంసన్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్ట పరిహారం అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.

వై. రాజేష్ (HRF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

జి. రోహిత్ (HRF రాష్ట్ర కార్యదర్శి)

16.02.2025,
విజయవాడ.

Related Posts

Scroll to Top