నారాయణపేట జిల్లా మక్తల్, నర్వ మండలాల ప్రజలకు ప్రాణాంతకంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య..
ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి వైద్య నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి..
నారాయణపేట జిల్లా మక్తల్, నర్వ మండలాల్లో వందలాదిగా పెరుగుతున్న కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల వార్తల నేపథ్యంలో ఈ రెండు మండలాల్లో మానవ హక్కుల వేదిక ఆరుగురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులతోనూ, గ్రామస్తులతోనూ మాట్లాడి వివరాలు సేకరించింది. మక్తల్ మండలం మంతెన గోడు, ఎర్నాగునపల్లి, కాట్రేవ్ పల్లి గ్రామాలు, నర్వ మండలం రాయకోడ్, జక్కన్నపల్లి, పాతర్ చేడ్లలో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కొక్క గ్రామం నుండి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున వారానికి రెండు లేదా మూడు సార్లు డయాలిసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రెండువేల జనాభా లేని ఒక్క కాట్రేవ్ పల్లి గ్రామంలో కేవలం కిడ్నీ సమస్యలతో గత పదేళ్లలో కనీసం పదిమందికి పైగా చనిపోయారు. వీరెవరూ యాభై, అరవై ఏళ్ళు దాటి బ్రతకలేదు. ఇంకా డయాలిసిస్ చేయించుకుంటున్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు. డయాలసిస్ కి చేరువలో కనీసం పదిహేను మంది ఉన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా పరిస్థితి విషమిస్తున్నది.
ఈ మండలంలో కిడ్నీ కేసులు విపరీతంగా పెరగడానికి కారణం వారు తాగుతున్న బోరు నీళ్లలో గానీ, వారు సాంప్రదాయంగా తాగుతున్న కల్లు క్రమంగా దారుణంగా కల్తీ కావటంలో గానీ ఉంది. కిడ్నీ వ్యాధుల బారిన పడ్డవాళ్ళు, డయాలసిస్ రోగులు ఆ రోజు నుండి తమ రోజువారి ఆదాయాన్ని కోల్పోయి ఇతరుల మీద డిపెండెంట్గా బ్రతకాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండే కుటుంబ సభ్యులు రోజువారి పని కోల్పోతారు. అదనంగా, వారు తరచుగా చేయించుకునే రక్త పరీక్షలు, స్కానింగ్ ల ఖర్చు నెలకు 3 నుండి 4 వేల రూపాయలు దాటుతున్నాయి. మందుల ఖర్చులు కనీసం నాలుగు వేలు అవుతున్నాయి. ఆపైన ప్రైవేట్ డాక్టర్లను సంప్రదించడానికీ, డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరగటానికి అయ్యే ఖర్చు అధనం. ఇలా మొత్తంగా ఒక్క నెలకి కనీసం 10 నుండి 15 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ ఖర్చు వారికి చాలా భారం. శాశ్వత వైద్యం లేని ఈ జబ్బుల బారిన పడ్డవాళ్ళు అర్ధాంతరంగానే చనిపోతారు.
ఒక పరిమిత ప్రాంతం నుండి ఇంత అసాధారణ స్థాయిలో కేసులు నమోదవుతున్నప్పుడు, అందుకుగల కారణాలను కనుక్కోవటం గానీ, ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కొనే పనిని గానీ ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించ లేదు. డయాలిసిస్ రోగులకు నెలకు రెండువేల రూపాయలు ఇచ్చి, మక్తల్ మండల కేంద్రంలో ఒక డయాలిసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకునే ధోరణే ఉంది.
ఈ ఆధునిక, నాగరిక కాలంలో ప్రభుత్వ ఈ వైఖరి అన్యాయమైనది, అంగీకరించలేనిది.
మా డిమాండ్లు:
- ప్రభుత్వం వెంటనే ఒక ఉన్న స్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఈ మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలి.
- సమస్యకు కారణమయ్యే త్రాగు నీరు లేదా కల్తీ కల్లు సమస్యను ఆ ప్రాంతంలో లేకుండా చేయాలి.
- మక్తల్, నర్వ మండల కేంద్రాల్లో కనీసం వారానికి రెండు సార్లు నెఫ్రాలజిస్టు వైద్యులను రోగులు సంప్రదించడానికి అందుబాటులో ఉంచాలి.
- మక్తల్ మండల కేంద్రంలోని డయాలిసిస్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలి.
- డయాలసిస్ రోగులందరికీ నెలకి 12,000 రూపాయల పెన్షన్ అందజేయాలి.
మా నిజనిర్ధారణ బృందంలో పాల్గొన్న సభ్యులు పాల్గొన్న వారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వి దిలీప్, తాళ్ళ రోహిత్ మరియు సభ్యులు ఎం శ్రీధర్, వి వెంకట నారాయణ మరియు బొల్లి ఆదం రాజు.
– డా ఎస్ తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక, తెలంగాణ .
మక్తల్,
08.02.2026.