నెల్లూరు జిల్లా కరేడు పంచాయతీ లోని గ్రామాలలో ఇండో సోల్ సోలార్ పరిశ్రమ ఏర్పాటు కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మానవ హక్కుల వేదిక

నెల్లూరు జిల్లా కరేడు (ఉలవపాడు మండలం), రామాయపట్నం లలో రాష్ట్ర ప్రభుత్వం ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి సౌర పలకల పరిశ్రమ కోసం భూ సేకరణ ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆ గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామస్థులకు సంఘీభావంగా మానవ హక్కుల వేదిక (హెచ్ ఆర్ ఎఫ్), రాష్ట్ర చేనేత జన సమాఖ్య కార్యకర్తలు కరేడు పంచాయతీ లోని గ్రామాలలో ఈ రోజు ప్రచారం నిర్వహించారు.

ఈ సౌర పలకల పరిశ్రమ కోసం ఇంత భూమి అనవసరం అని, దానిలో పదవ వంతు భూమిలో ఇది పెట్టుకోవచ్చు అని వారు తెలిపారు. ఒక ప్రైవేటు సంస్థ కోసం ప్రజల ఆమోదాన్ని కాదని ప్రభుత్వం భూ సేకరణ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. కరపత్రాలు పంచుతూ, గ్రామస్థులతో సమావేశం అవుతూ ఇండో సోల్ సంస్థకి ఇటువంటి క్లిష్టమైన పరిశ్రమ స్థాపించే టెక్నాలజీ కానీ అనుభవం కానీ లేదని తెలిపారు. తమ జీవనాధారమైన రెండు పంటలు పండే వ్యవసాయ భూమిని ప్రైవేటు సంస్థ కోసం సేకరించడాన్ని గ్రామస్థులు తప్పుబట్టారు.

ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రజల సమ్మతి, సామాజిక ప్రభావ అంచనాల నుంచి మినహాయించడాన్ని వారు ఖండించారు. అటువంటి మినహాయింపు కేవలం “ప్రజా శ్రేయస్సు” కోసం చేయాలి. ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ లాభాలు, ప్రజల నష్టాలు తప్ప ప్రజా శ్రేయస్సు ఏముందని వారు ప్రశ్నించారు.

అదే విధంగా ప్రభుత్వం ఈ సంస్థకు సుమారుగా 45000 కోట్ల సబ్సిడీలు ఎందుకు అందించాలి అనే ప్రశ్న లేవనెత్తారు. ఈ మొత్తం కూడా ప్రాజెక్టు వ్యయంలో దాదాపుగా 60 శాతం. భూములు ప్రజలవి, సముద్రం ప్రజలది, ఈ సబ్సిడీ డబ్బులు ప్రజలవి. లాభాలు మాత్రం ప్రైవేటు సంస్థవి. ఇది ఏ మాత్రం ప్రజాస్వామ్యం? ఆ మాత్రం న్యాయం? ఏ మాత్రం ప్రజా శ్రేయస్సు? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుని తక్షణమే రద్దు చేసి, భూ సేకరణ ప్రకటనలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో హెన్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్, రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షులు ఎం మోహన్ రావు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం నిర్వహించిన గ్రామాలు కరేడు, కొత్త పల్లిపాలెం, టెంకాయ చెట్ల పాలెం, అలగాయపాలెం, అలాగాయపాలెం పల్లి పాలెం, బట్టి సోమయ్య పాలెం మర్రి చెట్ల సంఘం, కత్తి కోటయ్య సంఘం, ఆకు చెట్ల సంఘం, బాల కోటయ్య సంఘం.

వై రాజేష్ (హెచ్ఎర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

ఎం. మోహన్ రావు (రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షులు)

జి రోహిత్ (హెచ్ఎర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి)

కరేడు,
16.07.2025.

Related Posts

Scroll to Top