సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ దగ్గరలోని జరాసంఘం, నాయకల్ మండలాలలో 12,634 ఎకరాల భూమిని సేకరించి నేషనల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ జోన్ (NIMZ) స్థాపించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించి, అందుకు కావలసిన ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో మెట్ట పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.
బలవంతంగా పోలీసుల సహయంతో భూసేకరణ జరిపించారు. పలుమార్లు నిరసన చేస్తున్న రైతులను అక్రమమగా అరెస్ట్ చేశారు. మంత్రులు హరీష్ రావు, కె.టి.రామారావు జహీరాబాద్ కు ఏ కార్యక్రమానికి వచ్చినా ముందస్తుగా ఈ రైతులను పోలీస్ స్టేషన్లకు తరలించి ఆ నాయకులు వెళ్లిపోయిన తరువాత విడిచిపెట్టేవారు. ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న రైతులను కలిసి వివరాలు సేకరించడానికి 9 మంది సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం 10-12-2023 (ఆదివారం) నాడు NIMZ ప్రభావిత 10 గ్రామాలలో పర్యటించి భాదితులను కలిసి వివరాలు సేకరించింది. మాకు దృష్టికి వచ్చిన విషయాలు —
1. ఎల్గోయీ గ్రామంలోని సర్వే నంబర్ 54 &125లలో గల మూడు వేల ఎకరాల పైగా భూమిని ఇప్పటికే ప్రభుత్వం గత ఏడెనిమిదేండ్ల కాలంలో సేకరించింది. ఇందులో అధిక భాగం అసైన్డ్ భూమి. ఈ సేకరణ అంతా జీవో 123 అనే అక్రమ జీవో ద్వారా అన్యాయంగా, భూమి స్వంత దారులను భయ బ్రాంతులకు గురిచేస్తూ జరిగింది. హైకోర్టు ఆ జీవో ను కొట్టివేసిన కారణంగా ఆ జీవో సహాయంతో జరిగిన భూ సేకరణ ఒప్పందాలను మొత్తం రద్దుచేసి, తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసి, అదే భూమిని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించాలి. కొత్త ధరల ప్రకారం వారికి పరిహారం చెల్లించాలి.
2. ఎల్గోయీ గ్రామానికి చెందిన ఐదువందల ఎకరాల వ్యవసాయ భూమిని రైతులు ఇప్పటివరకు NIMZ కి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వటానికి వారు సిద్దంగా లేరు. కాబట్టి ప్రభుత్వం ఆ భూమిని బలవంతంగా సేకరించవద్దని ఆ గ్రామ రైతులు కోరుతున్నారు.
3. భూమిని కోల్పోయే రైతులు భవిష్యత్తులో భూమి లేని కూలీలుగా మారే ప్రమాదం ఉన్నందున గ్రామానికి సాధ్యమైనంత సమీపంలో అవసరమైన భూమిని ప్రభుత్వమే కోనుగోలు చేసి భూమిని కోల్పోయే ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ రెండెకరాల వ్యవసాయ భూమిని అందించాలి.
4. ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ కోల్పోయే ఒక ఎకరం వ్యవసాయ భూమికి ఒక గుంట నివాస స్థలం చొప్పున పునరావాస సహాయం అందివ్వాలని రైతులు కోరుతున్నారు.
5. NIMZ కల్పించే ఉద్యోగాల్లో నిర్వాసిత కుటుంబాల్లోని, స్థానిక ప్రాంతంలోని అర్హులకు తప్పని సరిగా ఉద్యోగ అవకాఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లిఖిత పూర్వక ఒప్పందం ఉండాలి.
6. ఇంకా NIMZ లో ఎటువంటి పరిశ్రమల పనులు ప్రారంభం కాలేదు కాబట్టి అంత వరకు ఆ భూములు పడావు ఉండకుండా అప్పటిదాకా ఆ భూముల స్వంత దారులైన రైతులను వ్యవసాయం చేసుకోవటానికి స్వేచ్ఛగా అనుమతించాలి.
S. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు
Dr.S.తిరుపతయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
V. బాలరాజు, నగర కమిటీ అధ్యక్షుడు
రోహిత్, వెంకట్ నారాయణ, సురేష్, అచ్యుత్,
M.బాలయ్య, మల్లేష్ – సంస్థ సభ్యులు
14 డిసెంబర్ 2023