న్యాయవాది పవన్ తన ముద్దాయి కోసం కర్నూలు పోలీసుస్టేషన్ వెళ్లినప్పుడు సి.ఐ విక్రమసింహ దాడి చేశాడని ఆరోపణలు రావడాన్ని HRF తీవ్రంగా ఖండిస్తోంది

న్యాయవాది పవన్ కుమార్ పై సిఐ తన ఛాంబర్లో దాడి చేశాడన్న ఆరోపణలు నిజమా? అబద్దమా? తెలియాలంటే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి. సుప్రీంకోర్టు ఇటీవలే దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లో స్టేషన్ అంతా కనపడే విధంగా సీసీ టీవీ ఫుటేజీ అమర్చమని తీర్పు ఇచ్చింది. అదేవిధంగా సీసీ టీవీలు సవ్యంగ పనిచేసే విధంగా కంట్రోల్ రూంల నుండి స్వతంత్ర వ్యవస్థలతో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పనిచేయక పోవడం వల్ల పోలీసుల తప్పిదాలు బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పోలీసులు అక్కడ సీసీ టీవీ లేదనో, ఉన్నా, పనిచేయడం లేదనో చెప్పే అవకాశం ఉంది.

సిఐ విక్రమసింహ న్యాయవాది పవన్ తో ముందస్తు బెయిల్ ఎందుకు వేశావు? క్రిమినల్ కేసులోని తొమ్మిదవ ముద్దాయి అరెస్ట్ గురించి న్యాయస్థానానికి స్పష్టత ఎందుకు ఇచ్చావు? అని  బెదిరించాడన్న ఆరోపణ నిజమైతే, న్యాయస్థానంలో జరిగే విచారణ ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడం గానే మేం పరిగణిస్తున్నాం. పత్తికొండ కోర్టులో న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులో పోలీసులు జోక్యం చేసుకొన్న ఘటనను మనం మరవకుండానే, కర్నూలు పోలీసులు మరోచరిత్ర సృష్టించారు. కేంద్రప్రభుత్వం చట్ట సవరణలు చేసి, పోలీసులకు అనేక అధికారాలను కట్టబెట్టిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను ఏర్పాటు చేయకపోవడం వల్లనే, ఇటువంటి ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం ఉందని, దీనిని మేం తీవ్రమైన విషయంగా భావిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, న్యాయవాది పవన్ చేసిన ఆరోపణల విషయమై, సదరు సిఐ విక్రమ సింహను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి, స్వతంత్ర సంస్థతో సమగ్రమైన విచారణకు ఆదేశించి, న్యాయవాది ఆరోపణలు నిజమని తేలితే అతనిపై క్రిమినల్ కేసును నమోదుచేసి, చట్టప్రకారం అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఇప్పటికైనా సీసీ టీవీలను ఏర్పాటుచేసి, వాటిని కంట్రోల్ రూం నుండి స్వతంత్ర వ్యవస్థలతో నియంత్రించి,  సామాన్య ప్రజల పోలీసుల అక్రమ నిర్భంధం, లాకప్ మరణాలు, ఆఖరికి న్యాయవాదుల, న్యాయస్థానాల విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధమైన అరాచకాలు పెరిగిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

యు.జి. శ్రీనివాసుల (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
యు.ఎం. దేవేంద్ర బాబు (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
కె. ఉరుకుందప్ప (HRF కర్నూల్ జిల్లా అధ్యక్షులు)

ఆదోని,
22.02.2026.

Related Posts

Scroll to Top