ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental Impact Assessment) ఈరోజు విచారణ జరుగుతోంది. వారు తమ నివేదికలో సంవత్సరంలో 270 రోజులలో ఎంత ఖనిజం తయారు చేసేది చూపించారు. అయితే దీనిని తయారు చేసే క్రమంలో వెలువడే వాయు కాలుష్యం గురించి సమాచారం ఇవ్వకుండా, దాచి పెట్టి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడడాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండిస్తోంది. వారి నివేదికలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎంత మొతాదు ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూడవలసిన ఉంటుందని మేము భావిస్తున్నాం.
వాయు కాలుష్యం :
యాజమాన్యం వాయు కాలుష్యం
” 0″ స్థాయిలో ఉంటుందని తమ పర్యావరణ ప్రభావిత నివేది చూపారు. అయితే ప్రకాశం జిల్లాలోని వీరికే చెందిన జ్ఞానేశ్వర్య మైన్స్ & మినరల్స్ గనుల కంటే, ఎక్కువ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నదని చూపే ఓర్వకల్ గనులలో తక్కువ వాయు కాలుష్యం ఉంటుందని చూపడం నమ్మశక్యం కాని విషయం. వీరు ప్రభుత్వాన్ని, ప్రజలను దగా చేయాలని చూడడం తీవ్రమైన విషయంగా మేము భావిస్తున్నాం.
వాయు కాలుష్యం గురించి అసంపూర్తి సమాచారం :
వీటిలో దుమ్ము, ధూళి వల్ల వచ్చే వాయు కాలుష్యానికి వీరు ఉద్దేశ్య పూర్వకంగానే చూపలేదు. ఈ ఖనిజాన్ని గ్లాస్ తయారీ కంపెనీలలో వాడడం జరుగుతుంది. యాజమాన్యం ఈ గనుల దగ్గరనే రాయిని పొడిచేయడం తప్పనిసరి. వాయుకాలుష్యాన్ని దాచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు భరోసా లేకుండ పోయే ప్రమాదం ఉంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీరి నివేదికను పరిశీలన చేసి, అవి సరైనదా? కాదా? అని చూసి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తిరస్కరించాలి. కాని వారు ఆ పని చేయడం లేదు.
Quartz గనులలో విషాదంతాలు అనేకం :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖనిజాన్ని పొడిచేసే క్రమంలో వచ్చే దుమ్ము, ధూళిలో సిలికాన్ వాయు కాలుష్యం వల్ల అక్కడ పనిచేసే వారు ఊపిరితిత్తులు దెబ్బతిని కాన్సర్ కారక సిలికోసిస్ వ్యాధుల బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్ మండలంలోని ఎల్కత్త గ్రామంలో Quartz గనులలో పనిచేసే వందలాదిమంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా, దేవరకొండ గ్రామ సమీపంలో కూడా Quartz కంపెనీ లోను ఇదే విధమైన విపత్తు జరిగి డజన్ల కొద్దీ మనుషులు మృత్యు వాత పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎల్కత్త గ్రామాన్ని ఇప్పుడు “విధవల గ్రామంగా” పిలవడం జరుగుతోంది. గతంలో జరిగిన ఈ విపత్తుల నుండి మనం ఏం నేర్చుకొన్నట్టు?
మానవ హక్కుల వేదిక రాష్ట్ర హై కోర్టులో బాధితుల తరపున వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేయడం జరిగింది. అయితే అధికారయంత్రాంగం బాధితులను తీసుకొని రావడంలో విఫలం కావడం వల్ల వారి కుటుంబాలకు తగిన న్యాయం జరుగలేదు.
మేమేమంటున్నాం?
ఈ విచారణ ప్రజలకు అందుబాటులో ఉండే పాఠశాల ఆవరణంలోనో, గ్రామ ప్రజల సమక్షంలో కాకుండ, ఎటువంటి, సౌకర్యాలు లేని చోట జరపడం ఏమిటి? అదేవిధంగా అసలు సమాచారాన్ని యాజమాన్యం దాచిపెట్టి , ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో దెబ్బతీసే ప్రమాదం ఉంది. కావున కేంద్ర అడవులు & పర్యావరణ రక్షణ మంత్రిత్వ శాఖ వీరి నివేదికను వెంటనే రద్దు పరచి, Quartz గనులను అనుమతులకు వీరిని అనర్హులుగా ప్రకటించాలని మేము కోరుతున్నాం.
( U. G. శ్రీనివాసులు )
HRF రాష్ట్ర అధ్యక్షులు,
( K. ఉరుకుందప్ప )
HRF కర్నూలు జిల్లా అధ్యక్షులు
( S. సూగురప్ప )
HRF కర్నూలు జిల్లా EC సభ్యులు,
( D. పాణి )
HRF కర్నూలు జిల్లా EC సభ్యులు
కర్నూలు,
06 సెప్టెంబర్, 2024.